మూత్రంలో ఎరుపు కనిపిస్తోంది...  కిడ్నీలకు ప్రమాదమా?  | Kidney Counseling | Sakshi
Sakshi News home page

మూత్రంలో ఎరుపు కనిపిస్తోంది...  కిడ్నీలకు ప్రమాదమా? 

Feb 21 2018 12:51 AM | Updated on Feb 21 2018 12:51 AM

Kidney Counseling - Sakshi

నా వయసు 28 ఏళ్లు. అప్పుడుప్పుడూ మూత్రం ఎరుపు రంగులో వస్తోంది. ఏడాదిన్నరగా ఇలాగే అప్పుడప్పుడూ వచ్చిపోతోంది. వచ్చినప్పుడుల్లా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. దీని వల్ల కిడ్నీలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా?  – నరేంద్రప్రసాద్, కాకినాడ 
సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్‌ ఉండటం వల్ల కొందరికి ఇలాంటి సమస్య రావచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్, యూరిన్‌ ఎగ్జామినేషన్‌ వంటి పరీక్షలు చేయించాలి. దాంతో మీ సమస్యకు అసలు కారణం ఏమై ఉంటుందో తెలుస్తుంది. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను  కలవడం మంచిది. సమస్య నిర్ధారణ అయితే దానికి తగిన మందులు వాడవచ్చు. మీకు సాధారణ ఇన్ఫెక్షన్‌ ఉంటే అది మామూలు యాంటీబయాటిక్‌ మందులతోనే తగ్గిపోతుంది. మీరు ఒకసారి యూరిన్‌లో ప్రోటీన్లు పోతున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలూ చేయించాలి. 

కిడ్నీ రోగులు నీళ్లు తక్కువగా ఎందుకు తాగాలంటారు?
నా వయసు 47 ఏళ్లు. ఇటీవలే నాకు కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని తెలిసింది. నేను నీళ్లు ఎక్కువగా తాగకూడదని మా డాక్టర్‌ చెప్పారు. మంచి ఆరోగ్యం కోసం అందరూ నీళ్లు ఎక్కువగా తాగమంటూ సలహాలిస్తారు కదా. మరి నా విషయంలో నీళ్లు తాగవద్దని ఎందుకు అంటున్నారు? దయచేసి చెప్పండి.  – గోపాలరావు, కర్నూలు
సాధారణంగా కిడ్నీ జబ్బులు ఉన్న వారిలోనూ నీరు తక్కువగా తాగాలంటూ ఆంక్షలు విధించరు. అయితే కిడ్నీ జబ్బుతో పాటు గుండెజబ్బు లేదా అలా నీరు తీసుకోవడం వల్ల హాని జరిగే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం రోగులు ఎంత నీరు తీసుకోవాలన్నది డాక్టర్లు చెబుతారు. మన భారతదేశంలాంటి ఉష్ణ దేశాల్లో మామూలు వ్యక్తి రోజుకు 5–6 లీటర్ల నీటిని తీసుకుంటాడు. అయితే కొందరు వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీలు కేవలం ఒక్క లీటరు నీటిని ప్రాసెస్‌ చేయడానికే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అందుకే వారికి ఉన్న జబ్బు ఆధారంగా, వారి కిడ్నీ పనిచేసే సామర్థ్యం ఎంతో తెలుసుకొని, దానికి అనుగుణంగా డాక్టర్లు వారు రోజూ తీసుకోవాల్సి నీటి మోతాదును నిర్ణయిస్తారు. 

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ తర్వాత జాగ్రత్తలేమిటి?
నాకు 45 ఏళ్లు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.  – రామసుబ్బారెడ్డి, ఒంగోలు 
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ తర్వాత కూడా శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్‌ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్‌ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఎక్కువ. జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్‌ పర్యవేక్షణలో లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్‌ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్‌ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 
- డాక్టర్‌ విక్రాంత్‌రెడ్డి, సీనియర్‌ నెఫ్రాలజిస్ట్,
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement