సైతాన్‌ ఉన్న చోట

Islam is to be trained by fasting  in Ramzan - Sakshi

చెట్టు నీడ / రంజాన్‌ కాంతులు

అబూబక్ర్‌ సిద్దీఖ్‌ (ర) ప్రవక్త ముహమ్మద్‌ (స) యొక్క అత్యంత ప్రియమైన మిత్రుడు. ఒకసారి ఆయన ప్రవక్త (స) తో పాటు ఇతర సహచరుల సన్నిధిలో కూర్చుని ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి, హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌ (ర) ను అనరాని మాటలు అంటున్నాడు. హజ్రత్‌ అబూబక్ర్‌ మౌనంగా వింటూన్నాడు. ప్రవక్త ముహమ్మద్‌ ( స) ఆ దృశ్యాన్ని చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతూన్నారు. ఆ వ్యక్తి లేనిపోని నిందలు వేస్తూ, ఇంకా ఏదేదో అంటుంటే, అబూబక్ర్‌ సహనం కోల్పోయి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి, అప్పటి దాకా చిరునవ్వు నవ్వుతూ కూర్చున్న ప్రవక్త ముహమ్మద్‌ (స) అక్కడి నుండి లేచి వెళ్లిపోయారు.కాసేపటికి హజ్రత్‌ అబూబక్ర్, ప్రవక్త మహనీయుల వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్త ముహమ్మద్‌ (స)! ఆ వ్యక్తి నన్ను అనరాని మాటలు అంటుంటే మీరు ముసిముసిగా నవ్వుతూ కూర్చున్నారు.

నేను వాడికి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి మీరు లేచి వెళ్లిపోయారేమిటీ?’’ అని అడిగాడు.‘‘నిన్ను ఆ వ్యక్తి దూషిస్తున్నప్పుడు దైవదూతలు నీకు బదులుగా సమాధానం ఇస్తున్నారు. అది చూసి నేను నవ్వుతూ వింటున్నా. నీవు అతనికి సమాధానం ఇవ్వడం మొదలు పెట్టేసరికి దైవదూతలు అక్కడ నుండి నిష్క్రమించారు. సైతాన్‌ మీ మధ్యలోకి వచ్చాడు. సైతాన్‌ ఉన్న చోట నేను ఉండలేను కదా. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను’’ అని చెప్పారు.దూషణలకు దూషణ సమాధానం కారాదు. అలాంటి ఇద్దరి మధ్య సైతాన్‌ దూరి తన పని కానిస్తాడు. ఇద్దరి మధ్య వైరం రగిలించి, శత్రుత్వాన్ని పెంపొందించే పని చేస్తాడు. ఇంకా వారు ఒకరినొకరు ద్వేషించుకుంటూ, తమ సమయాన్ని చెడు పనులకు వినియోగిస్తారు.

అందుకే ఖురాన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు. ‘ఓ ప్రవక్తా(స) మంచి చెడు ఒకటి కాదు. చెడును అతి శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించడానికి ప్రయత్నం చేయి. నీ ప్రాణ శత్రువు సైతం నీ ప్రాణ స్నేహితుడై పోవడం నీవు చూస్తావు. కాని ఈ అదృష్ట యోగ్యం అందరికీ సాధ్యం కాదు’ అని.ఇలాంటి సహన గుణం అలవరచుకోవడం కోసమే రంజాన్‌ మాసంలో నెలరోజుల ఉపవాస దీక్షతో శిక్షణ పొందేలా చేస్తుంది ఇస్లాం.‘మీరు ఉపవాసం పాటిస్తున్నప్పుడు, ఎవరైనా తిట్టినా లేదా జగడానికి దిగినా.. నేను రోజూ పాటిస్తున్నాను అని సమాధానం ఇవ్వండి’ అని ప్రవక్త (స )తెలిపారు. అంటే మీరు ద్వేషించే వారిని ఉపవాస దీక్ష ద్వారా ప్రేమించడం అలవర్చుకోవాలి. 
– షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top