హర్షిణి క్రియేషన్స్ పతాకం మీద, ఈ లఘుచిత్రం తీశాను. నేను పుట్టింది, పెరిగింది గుంటూరు జిల్లాలోని పొన్నూరులో.
టైస్టులు...
ఎన్నో అరాచకాలు చేస్తూ...
దేశప్రగతికి అడ్డుకట్టలు వేస్తుంటారు...
సైనికులు...
కులమతాలకు అతీతంగా... ఎన్నో కష్టాలకోర్చి...
దేశ రక్ష కులుగా ఉంటారు.
ఇదే కథాంశంతో... తన ప్రాణాలర్పించి
పాఠశాల విద్యార్థుల జీవితాలను కాపాడిన ఓ వీర సైనికుడి కథను ‘నా దేశం’ అనే లఘుచిత్రంగా చిట్టితెరకు ఎక్కించాడు అనిల్ నాని.
రైక్టర్స్ వాయిస్: హర్షిణి క్రియేషన్స్ పతాకం మీద, ఈ లఘుచిత్రం తీశాను. నేను పుట్టింది, పెరిగింది గుంటూరు జిల్లాలోని పొన్నూరులో. పీజీ పూర్తి చేశాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటూ, సినిమా అవకాశాల కోసం నిరీక్షిస్తున్నాను. మా తల్లిదండ్రులు, అన్నవదినలు, స్నేహితులు నాకు చాలా సహకరిస్తున్నారు. ‘నా దేశం’ లఘుచిత్రానికి పదివేలు ఖర్చు అయ్యింది. మా సొంత ఊరు పొన్నూరులోనే, అందమైన లొకేషన్స్‌లో నాలుగు రోజులపాటు ఈ చిత్రం షూటింగ్ చేశాను. ఈ రోజుల్లో దేశాన్ని ఎంత గౌరవిస్తున్నాం అనే ఆలోచన తో ఈ కథ సిద్ధం చేసుకున్నాను. ఇందుకు మా అన్నయ్య, మావయ్య ల సహకారం ఎంతో ఉంది. ఇందులో సైనికుల డ్రెస్‌లకి, గన్స్‌కి, లొకేషన్స్‌కి చాలా కష్టపడాల్సి వచ్చింది.
షార్ట్ స్టోరీ: ఒక కుటుంబంలో ఒక యువకుడికి దేశభక్తి ఉండదు. దేశాన్ని జాతీయ జెండాని కూడా గౌరవించడు. అలాంటి యువకుడి అన్నయ్య, దేశం కోసం మిలటరీలో చేరతాడు. ఒకసారి కొంతమంది తీవ్రవాదులు ఒక పాఠశాలలో చొరబడి ఆ స్కూల్‌ని తమ ఆధీనంలోకి తీసుకుని, టైస్ట్ నాయకుడిని వదిలిపెట్టమని కోరతారు. ఆ స్కూల్‌లోని పిల్లలని కాపాడటానికి కెప్టెన్ ప్రదీప్ తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. ఆ విషయం తెలియగానే, అన్న తనతో చిన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని, తన తప్పు తెలుసుకుని, మిలిటరీలోకి వెళ్లి, దేశభక్తి పెంచుకుంటాడు ఆ యువకుడు.
కామెంట్: మంచి కాన్సెప్ట్ ఎంచుకుని ఈ లఘుచిత్రం తీసినందుకు ఈ దర్శకుడికి ప్రశంసలు అందించాలి. అయితే ఇందులో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. భవిష్యత్తులో మంచి దర్శకుడిగా ఎదగాలంటే ఆ పొరపాట్లను సరిచేసుకోవాలి. ముఖ్యంగా... డైలాగ్ డెలివరీ. అందులో మరింత పరిణతి సాధించాలి. అదే పరిణతి నటీనటుల నటనలో కూడా కనిపించాలి. ఎడిటింగ్ పరవాలేదు. సైనికుల ధైర్యసాహసాలు మరింత ఉత్తేజపూరితంగా చూపించవచ్చు. కెమెరా యాంగిల్స్‌లో కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యూజిక్ ఓకే. పదునైన సంభాషణలు రాస్తేనే కాని దేశ భక్తి ప్రతిబింబించదు. మంచి ఆశయంతో తీసిన ఈ చిత్రానికి ఈ హంగులన్నీ సమకూరినట్లయితే చిత్రం మరింత ఆకట్టుకునేది. ‘కులమత జాతి రంగు అంటనిదేరా సైన్యం’ అనే వాక్యం ఈ చిత్రాన్ని ఉన్నతంగా నిలిపింది.
- డా. వైజయంతి