ఇండియాలో దాగిన హిందుస్తాన్ ఆసక్తి రేపే పుస్తకం

ఇండియాలో దాగిన హిందుస్తాన్ ఆసక్తి రేపే పుస్తకం


తాజా పుస్తకం

 

గతం నుంచి వర్తమానం, వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్మితమవుతాయి. చరిత్ర కూడా ఇలాగే అడుగులు వేస్తూ వెళుతుంది. ఒక్కోసారి తప్పటడుగులు కూడా. అయితే తప్పటడుగులు వేసిన వారికి తమ తప్పిదాలు తెలియకపోవచ్చు. ముందు తరాల వారు వాటిని గుర్తిస్తారు. గాంధీలో ఉన్న హిందుత్వ భావనే దేశ విభజనకు కారణమైందని, ఆ తరువాత నెహ్రూ దాన్ని పెంచి పోషించాడని ఈ పుస్తక రచయిత పెరి అండర్‌సన్ అంటారు. పెరి అండర్‌సన్ ఆంగ్లో-ఐరిష్ రచయిత. ప్రముఖ మార్క్సిస్టు మేధావి. ఆయన గతంలో ‘ఇండియన్ ఐడియాలజీ’ పేరుతో ఇంగ్లిష్‌లో రాసిన పుస్తకమే ఇప్పుడు ‘ఇండియాలో దాగిన హిందుస్తాన్’ పేరుతో అనువాదమై వెలువడింది. ఈ పుస్తకంలోని అంశాలను మనం సమర్థించవచ్చు. లేదా విమర్శించవచ్చు. కాని చర్చించాల్సిన విషయాలు కొన్ని ఇలా ఉన్నాయి.

 

 ఇండియా అన్న భావనే యూరప్ నుంచి సంక్రమించింది. ఎందుకంటే అంతకు ముందు అది చిన్న చిన్న రాజ్యాల సమూహం. అందుకే బ్రిటిష్‌వాళ్లు సులభంగా జయించి ఒక్కటి చేశారు.

 

 లౌకికవాదాన్ని అనుసరించే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీకి చేతికి వచ్చిన తరువాత పురాణాలు, మత ధర్మశాస్త్రాలను చొప్పించి ఆయనకు తెలియకుండానే హిందుత్వని అమలు చేశారు. గాంధీ పట్ల ముస్లింల అపనమ్మకానికి ఇది బీజం వేసింది. మున్ముందు ఇది దేశవిభజనకు దారి తీసింది.

 

 1922లో చౌరీచౌరాలో పోలీసులపై హింస జరిగినందుకు నిరసనగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిలుపుదల చేయించిన గాంధీ, రెండవ ప్రపంచ యుద్ధాన్ని సమర్థించడమే కాకుండా సైన్యంలో చేరమని కూడా పిలుపునిచ్చారు. ఆయన  అహింసాయుధంపై ఆయనకే స్పష్టత లేదు.

 

 అంటరానివాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేస్తూ బ్రిటిష్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా గాంధీ చేశారు. నిస్సహాయ స్థితిలో అంబేద్కర్ కూడా గాంధీకి లొంగిపోయారు. ఈ విషయమై చనిపోయేవరకూ అంబేద్కర్ బాధ పడుతూనే ఉన్నారు.

 

 నెహ్రూకి గాఢమైన మత విశ్వాసాలు లేకపోయినా అనేక అంశాల్లో గాంధీ హిందుత్వనే ఆయన అనుసరించాడు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే ఈనాటికీ రక్తం ఏరులై పారుతోంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలను రాజకీయాలకు ముడిపెట్టే అలవాటు నెహ్రూకి ఉంది. బహిరంగ సభలో నాగాలాండ్ ప్రజలు తనకి పిరుదులు చూపించి అవమానించారనే కోపంతో ఆయన నాగాలాండ్‌పై కర్కశంగా ప్రవర్తించారు. (‘గాంధీ అనంతర భారతదేశం’ పుస్తకంలో రామచంద్ర గుహ కూడా ఇదే చెబుతారు)

 

 మతతత్వం వల్ల లబ్ది చేకూరుతుందనుకుంటే బిజెపి, కాంగ్రెస్‌లు ఒకేలా వ్యవహరిస్తాయి. 2002లో గుజరాత్‌లో చనిపోయిన వారి కంటే 1984లో ఢిల్లీలో జరిగిన ఊచకోతలో చనిపోయిన వాళ్ల సంఖ్యే ఎక్కువ.రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాళ్లందరూ చదవాల్సిన పుస్తకమిది.

 

 - జి.ఆర్.మహర్షి


 ఇండియాలో దాగిన హిందుస్తాన్- పెరి అండర్‌సన్; హెచ్.బి.టి ప్రచురణ; వెల: రూ.150; ప్రతులకు: 040- 23521849

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top