
అమ్మచేతి స్టెత్ నేను
డాక్టర్ రఘురామ్ పిలారిశెట్టి సుప్రసిద్ధ ఆంకోప్లాస్టిక్ సర్జన్. కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం లండన్ నుండి ఇండియా తిరిగి వచ్చేసిన
మా అమ్మ డాక్టర్ రఘరామ్
డాక్టర్ రఘురామ్ పిలారిశెట్టి సుప్రసిద్ధ ఆంకోప్లాస్టిక్ సర్జన్. కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం లండన్ నుండి ఇండియా తిరిగి వచ్చేసిన రఘురామ్... తల్లి పేరు మీద ‘ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్’ స్థాపించి, సమాజంలోని స్త్రీమూర్తులందరికీ సేవలందిస్తున్నారు. ఆ సేవాప్రస్థానమే ఆయనను పద్మశ్రీ విజేతను చేసింది. తనను అంతగా ప్రభావితం చేసిన తన తల్లి గురించి మాట్లాడుతూ.. ‘అమ్మ చేతి స్టెత్ నేను’ అన్నారు రఘురామ్.
‘‘నేను పుట్టింది గుంటూరులో. అమ్మ ఉషాలక్ష్మి, నాన్న చలపతిరావు ఇద్దరూ డాక్టర్లు, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లు. నేను పుట్టిన ఏడాదికే అమ్మానాన్న హైదరాబాద్ వచ్చేశారు. ఐదు వందల రూపాయలతో హైదరాబాద్‌లో జీవితం మొదలు పెట్టినప్పుడు కూడా వైద్యవృత్తిని ఒక యజ్ఞంలా భావించింది తప్ప అమ్మ ఏనాడూ డబ్బు సంపాదనకు వైద్యం ఒక మార్గం అనుకోలేదు.
క్లినిక్‌లో ఒక కాలు... కిచెన్‌లో ఒక కాలు
ఉదయం ఆరు గంటలకు నేను నిద్రలేచేసరికే అమ్మ వంట చేసి హాస్పిటల్‌కు తయారవుతూ ఉండేది. సాయంత్రం ఆసుపత్రి (నీలోఫర్) నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ముందుగదిలో క్లినిక్ చూసుకుంటూ మధ్యలో లోపలికి వచ్చి నేను తినడానికి ఏమేమి కావాలో చేసి పెట్టేది అమ్మ. హోమ్‌వర్క్ చేసుకుంటున్నానా లేదా అని ఓ కంట గమనిస్తుండేది.
నా కోసం ప్రమోషన్‌నే వద్దనుకుంది!
నన్ను సౌకర్యంగా ఉంచడానికే అమ్మ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. నా కోసం కెరీర్‌లో ప్రమోషన్‌ని వదులుకుని, ఎక్కువ కాలం ఆర్‌ఎంవోగానే ఉండిపోయింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రైవేట్ ప్రాక్టీస్‌ని నిషేధించారు. అప్పుడే ఢిల్లీలో ఓ సెమినార్ ద్వారా నాన్నకు సౌదీ అరేబియాలో అవకాశం వచ్చింది. అమ్మకు కూడా అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నించారాయన. ఐదేళ్ల సర్వీసు వదులుకుని తాత్కాలికంగా సౌదీ వెళ్లిపోయారు అమ్మానాన్న. అప్పుడే నాకు విజయవాడ సిద్ధార్థ కాలేజ్‌లో సీటు వచ్చింది. నేను మా అమ్మకు దూరంగా హాస్టల్‌లో ఉండడానికి బెంగ పెట్టుకుంటానని మా అమ్మమ్మ, తాతయ్య జాగర్లమూడిలో వాళ్ల ఇంటికి తాళం పెట్టి మరీ నా కోసం విజయవాడకు వచ్చేశారు.
యు.కె.లో ఉండగా క్యాన్సర్ అని తెలిసింది
నేను యుకెలో ఉన్నప్పుడు 2002లో అమ్మ నా దగ్గరికి వచ్చింది. అప్పుడే ఆమె అనారోగ్యం బయటపడింది. బ్రెస్ట్‌లో లంప్! అప్పటికే అడ్వాన్స్‌డ్ అని నిర్ధారణ అయింది. నేను ఆ సర్జరీలో నిపుణుడినే. కానీ అక్కడి చట్టాల ప్రకారం డాక్టరు తన బంధువులకు సర్జరీ చేయకూడదు. దాంతో అమ్మకు మా ప్రొఫెసర్ ఆపరేషన్ చేశారు.
అమ్మ... వాళ్లమ్మ దగ్గరికి వెళ్లిపోయింది
సర్జరీ తర్వాత యుకెలోనే ఉండి కీమో థెరపీ చేయించుకోవడానికి అమ్మ ఇష్టపడలేదు. ‘మా అమ్మ ఇండియాలో ఉంది. మా అమ్మ దగ్గరకెళ్లి వైద్యం చేయించుకుంటానని ఇండియా వచ్చేసింది. యుకె నా జీవిత గమనాన్ని మార్చేసిందనుకున్నాను. కానీ అమ్మ అనారోగ్యం నాకో లక్ష్యాన్ని నిర్దేశించింది. కొత్త జీవనపథాన్ని నిర్మించింది. స్వయంగా డాక్టర్ అయిన అమ్మ, తన పేషెంట్లకు సూచనలిచ్చిన అమ్మ... తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. వ్యాధి ముదిరేవరకు అజాగ్రత్తగా ఉండి పోయింది. అలాంటి పరిస్థితిలో భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల కనీస అవగాహన ఎంతమందికి ఉండవచ్చు అనే ప్రశ్న నాలో రేకెత్తింది. అప్పుడే అనుకున్నాను.. ఇండియాను బ్రెస్ట్ క్యాన్సర్ రహిత దేశంగా నిలపడానికి నేను సైతం శ్రమించాలని. అలా 2007లో ఇండియాకొచ్చాను. అమ్మకు నయమైంది. అమ్మే ఇప్పుడు ఫౌండేషన్‌ను పర్యవేక్షిస్తోంది. సంభాషణ: వాకా మంజులారెడ్డి
అమ్మ మనసు కనిపెట్టలేకపోయాను!
మా అమ్మలో గొప్ప వ్యక్తిత్వాన్ని చూశాను, పరిణతి చెందిన డాక్టర్‌ని చూశాను. కానీ అమ్మలో అమ్మ మనసును చూసిన క్షణం నాకు కన్నీరాగలేదు. తనకు వచ్చిన క్యాన్సర్‌ను తలుచుకుని చింతించలేదామె. తనను పరామర్శించడానికి వచ్చిన వారితో ‘నాకు ఈ క్యాన్సరే రాకపోతే నా బిడ్డ నా దగ్గరకు వచ్చేవాడు కాదు కదా!. నిజానికి నాకు క్యాన్సర్ వచ్చినందుకు కొండంత ఆనందంగా ఉంది’ అనేది. ఆమె అన్న మాట నిజమే. అమ్మకు అనారోగ్యం రాకపోతే నేను యుకె వదిలి ఇండియాకి వచ్చే వాడినే కాదు. బిడ్డ దూరంగా ఉన్నాడనే బాధ అమ్మ గుండెల్లో ఏదో మూల సుడులు తిరుగుతూ ఉండి ఉంటుంది. అదే అనారోగ్యం రూపంలో బయటపడిందేమో అనిపిస్తుంటుంది. అమ్మ కోసం వచ్చేశాననే సంతోషంతో పాటు, అమ్మకు అంతటి బాధ రాకపోతే నేను ఆమె దగ్గరకు వచ్చే వాడిని కాదు... అనుకుంటే మనసులో ఎక్కడో గుచ్చుకున్నట్లు ఉంటుంది.