పాపకు మెల్లకన్ను ఉన్నట్లు అనిపిస్తోంది... 

I do not want to use contact lenses - Sakshi

ఐ కౌన్సెలింగ్స్‌

మా పాప వయసు మూడున్నర ఏళ్లు. వచ్చే ఏడాది స్కూల్లో వేయడం కోసం... ఇప్పట్నుంచే అలవాటు చేయడానికి తనను ప్లే స్కూల్‌కు పంపుతున్నాం.  ఈ క్రమంలో ఆమెకు మెల్లకన్ను ఉన్నట్లు గుర్తించాను. పాప దేనినైనా తదేకంగా చూస్తున్నప్పుడు మెల్లకన్ను పెడుతోంది. మాకు తెలిసిన కంటి డాక్టర్‌ను సంప్రదిస్తే ఆమెకు కళ్లజోడు అవసరమని చెప్పారు. ఇంత చిన్న పాపకు కళ్లజోడు అవసరమా? ఆమెకు ఇంకేదైనా చికిత్స అందుబాటులో ఉందా? 

మీరు చెప్పిన వివరాల ప్రకారం బహుశా మీ పాపకు అకామడేటివ్‌ ఈసోట్రోపియా అనే కండిషన్‌ ఉండవచ్చునని తెలుస్తోంది. మెల్లకన్ను దూరదృష్టి (హైపర్‌మెట్రోపియా)ని సరిచేయకపోవడం వల్ల ఇలాంటి కండిషన్‌ వస్తుంది. ఈ సమస్య సాధారణంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో మొదలవుతుంది. ఏదైనా చదివే సమయంలో సరిగా కనిపించనప్పుడుగానీ లేదా తదేకంగా చూస్తూ తనకు కనిపిస్తున్నదాన్ని స్పష్టంగా చూసేందుకు అకామడేట్‌ చేసుకునే ప్రయత్నంలో గానీ ఈ కండిషన్‌ మొదలవుతుంది. అదే క్రమంగా మెల్లకన్నుకు దారితీస్తుంది. మీ పాప కంటి సమస్యను చక్కదిద్దడానికి ప్లస్‌ పవర్‌ ఉన్న లెన్స్‌లను (అద్దాలను) కంటివైద్యనిపుణులు సూచిస్తారు.

ఈ కంటి అద్దాలను ఆరు నెలల పాటు వాడాక అప్పుడు మళ్లీ మెల్లకన్ను ఏ మేరకు ఉందో పరీక్షించి చూస్తారు. ఈ క్రమంలో వయసు పెరిగేకొద్దీ ప్లస్‌ పవర్‌ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మెల్లకన్ను సమస్య దానంతట అదే నయమవుతుంది. అప్పుడు ఆమెకు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. ప్లస్‌ పవర్‌ ఉన్నంతకాలం ఆమెకు కళ్లజోడు తప్పనిసరి. ఇంత చిన్న వయసులో కళ్లజోడు ఎందుకు అంటూ మీరు గనక నిర్లక్ష్యం చేసే, అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కండిషన్‌కు దారితీసి, ఆమె ఒక కంట్లోగానీ, లేదా రెండు కళ్లలోగానీ చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు మీ పాపకు తగిన అద్దాలు ఇప్పించండి. 

కళ్లద్దాలు ఇష్టం లేదు...ప్రత్యామ్నాయం ఉందా?

నా వయస్సు 20 ఏళ్లు. నేను నాలుగేళ్లుగా కళ్లద్దాలు వాడుతున్నాను. నాకు మైనస్‌ 3 పవర్‌ ఐసైట్‌ ఉంది. నాకు కళ్లద్దాలు వాడటం ఇష్టం లేదు. నా వయసుకంటే పెద్దగా కనిపిస్తున్నాను. అందుకే వాటికి బదులుగా వాడదగిన కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడటమో లేదా లాసిక్‌ సర్జరీయో చేయించుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఆ రెండింటి గురించి వివరాలు చెప్పండి. 

మొదట కాంటాక్ట్‌ లెన్సెస్‌ గురించి తెలుసుకుందాం. అవి కంటి నల్లపొర (కార్నియా పొర) మీద వాడే ప్లాస్టిక్‌ లెన్సెస్‌ అన్నవూట. ఇందులో సాఫ్ట్‌ లెన్స్, సెమీ సాఫ్ట్‌ లెన్స్, గ్యాస్‌ పర్మియబుల్‌ లెన్స్, రిజిడ్‌ లెన్స్‌ అని వెరైటీస్‌ ఉన్నాయి. దీన్ని పేషెంట్‌ కార్నియాను బట్టి వాళ్లకు ఏది ఉపయుక్తంగా ఉంటుందో డాక్టర్లు సూచిస్తారు. కాంటాక్ట్‌ లెన్స్‌ను ఉదయం పెట్టుకొని, రాత్రి నిద్రపోయే వుుందు తొలగించాలి. వాటిని అలా పెట్టుకొనే నిద్రపోకూడదు. కాంటాక్ట్‌ లెన్స్‌ ఉన్నప్పుడు కన్ను నలపకూడదు. కాంటాక్ట్‌ లెన్స్‌ ఉన్నవాళ్లు ఎక్కువగా డస్ట్, పొగ, వేడిమి ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. 

ఇక లాసిక్‌ సర్జరీ అంటే కార్నియా పై పొర ఒంపు (కర్వేచర్‌)ను అడ్జెస్ట్‌ చేసి దూరదృష్టి (ప్లస్‌), హ్రస్వ దృష్టి (మైనస్‌) లోపాలను సరిచేస్తారు. రిఫ్రాక్షన్‌ స్టేబుల్‌గా ఉంటే లేజర్‌ చికిత్స కూడా చేయించుకోవచ్చు. లేజర్‌ అయినా వారం నుంచి పది రోజుల్లో చూపు నార్మల్‌గా ఉంటుంది. ఈ చికిత్సతో సాధారణ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతే ఈ ఆపరేషన్‌ను సూచిస్తుంటాం. మీ వయసు 20 ఏళ్లు కాబట్టి మీరు ముందుగా కొన్ని పరీక్షలు చేయించుకొని, అర్హులైతే లాసిక్‌కు తప్పక వెళ్లవచ్చు. 

డాక్టర్‌ రవికుమార్‌ రెడ్డికంటి వైద్య నిపుణులు,
మెడివిజన్‌ ఐ హాస్పిటల్,హైదరాబాద్‌.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top