రిలేషన్‌షిప్‌లో సంతోషంగా ఉండండిలా...

How to Grow Stronger In Your Relationship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాహ జీవితం, రిలేషన్‌షిప్‌లో సంతోషంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు కానీ చాలా సార్లు అనుకున్నట్లుగా ఉండలేకపోతుంటారు.  డబ్బు, పలుకుబడి ఉంటేనే సంతోషంగా ఉండగలమని కొన్ని జంటలు అనుకుంటాయని కానీ అది కూడా సరైన అభిప్రాయం కాదని నిపుణులు అంటున్నారు. ప్రేమలో నిజాయితీగా ఉండటమే సంతోషానికి కారణమని తెలిపారు. కింది సూచనలు పాటించడం ద్వారా రిలేషన్‌షిప్‌ను ఎంజాయ్‌ చేస్తూ సంతోషంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

1. భాగస్వామికి అండగా నిలవాలి...
జీవితం విషయంలో, ఉద్యోగ విషయాల్లో మీ పార్టనర్‌కు తోడుగా నిలబడండి. వారికి ఉ‍న్న గోల్స్‌ను సాధించుకొనే క్రమంలో మీ వంతు సహకారాన్ని వారికి అందించండి. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రోత్సాహాన్ని అందించండి. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అలవర్చుకోవాలి.

2. అన్నీ మంచి రోజులే ఉండవు...
రిలేషన్‌షిప్‌లో అన్నీ సంతోషకరంగా గడిచే క్షణాలే ఉండవు. కొన్నిసార్లు మనస్పర్థలు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో సంయమనం పాటించడం నేర్చుకోవాలి. మంచిరోజులైనా, చెడురోజులైనా ఒకరినొకరు అర్థం చేసుకొని అండగా నిలవాలి. ఏరోజు జరిగిన గొడవలను ఆ రోజు రాత్రికల్లా పరిష్కరించుకొని తర్వాతి రోజును ప్రేమతో ఆరంభించాలి.

3. సమయం గడపాలి...
ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉ‍న్నప్పటికీ మీ భాగస్వామితో కొంత సమయం గడపడానికి ప్రయత్నించాలి. రిలేషన్‌షిప్‌లో మీ వారితో మీరు ఎంత సమయం గడుపుతున్నారన్నదే ఆ బంధం లోతును తెలియజేస్తుంది. ఈ రోజు ఎలా గడిచింది ? అనే ప్రశ్న ప్రతి రోజూ అడగాలి. మీ భాగస్వామి మీతో ఎంతో మాట్లాడాలని, చెప్పాలని ఉన్నప్పటికీ మీరు అడగకపోతే కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. సమయం దొరికినపుడు విహారయాత్రలకు కలిసి వెళ్లి సంతోషంగా గడిపిరావాలి.

4. నిజమైన మిత్రులు...
కుటుంబమైనా, రిలేషన్‌షిప్‌ అయినా పురుషులు, మహిళలు మిత్రులుగా ఉంటేనే ఆ బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది. ఇద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. మీకు ఎదురయ్యే ఇబ్బందులను, ఆనందాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. ప్రేమ బంధానికి స్నేహం జతకలిస్తేనే అది అవిభాజ్య బంధంగా మారుతుంది.

5. బయటకు కనిపించాలి....
రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే పలు ఇబ్బందులను మీరు అధిగమించడం మీ తోటి మిత్రులు చూడాలి. రోజురోజుకు బలపడుతున్న మీ బంధానికి వారే సాక్షులుగా నిలవాలి. దాని నుంచి వారు నేర్చుకోవడం మాత్రమేగాక సమాజంలో ఇదో బాధ్యత అనే విషయం మీకు కూడా బోధపడుతుంది. 

ఈ విషయాల పట్ల కొంచెం జాగ్రత్త తీసుకొని, అనుదిన జీవితంలో పాటించడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top