టాప్‌ మోస్ట్‌ ర్యాంకర్‌

Himachal Pradesh Tanu Kumari Tenth State First Rank Special Story - Sakshi

పరీక్షల్లో ఎన్ని మార్కులైనా రానివ్వండి. ప్రతి మార్కు వెనుక వంద శాతం కష్టం ఉంటుంది! పేపర్‌–1,పేపర్‌–2ల వరకే పాసూ ఫెయిలు. ప్రయత్నంలో ప్రతి స్టూడెంట్‌ ర్యాంకు హోల్డరే. హిమాచల్‌ ప్రదేశ్‌లో టెన్త్‌ ఫలితాలు వచ్చాయి. తనూ కుమారి స్టేట్‌ ఫస్ట్‌. మార్కుల్లో టాప్‌ ర్యాంకర్‌ అని చెప్పడం కాదు. ప్లానింగ్‌లో టాప్‌ మోస్ట్‌ ర్యాంకర్‌ తను!!

తనూ కుమారి ‘నీట్‌’కి ప్రిపేర్‌ అవుతోంది. మెడిసిన్‌లో సీటుకు ప్రవేశ పరీక్షే.. ‘నీట్‌’ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌). ఇంటర్‌ పాస్‌ అయి ఉండటం, లేదా ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలు రాసి ఉండటం కనీసార్హత. వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. తనూ కుమారి ఇంకా అక్కడి వరకు రాలేదు. మొన్న  జూన్‌ 9 నే హిమాచల్‌ ప్రదేశ్‌ టెన్త్‌ ఫలితాలు వచ్చాయి. తనూకు స్టేట్‌ ర్యాంక్‌ వచ్చింది. 700 కి 691 మార్కులు. ఇవన్నీ కాదు ఆమె గొప్ప. ఆ ప్లానింగ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. అదే ప్లానింగ్‌తో నీట్‌కి రెండేళ్ల ముందు నుంచే ప్రిపరేషన్‌ మొదలు పెట్టింది. ఇప్పటి పిల్లలు ఎవరైనా చేసే పనే కదా అని మీకనిపిస్తే తనూ గురించి మరికొంత తెలుసుకోవాలి. (ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా)

ట్యూషన్‌లు, కోచింగ్‌లు ఇష్టం లేని అమ్మాయి తనూ! స్కూల్లో టీచర్‌లు ఉన్నప్పుడు బయట మళ్లీ ట్యూషన్‌లు ఎందుకు అని ఆమెతో ఎవరూ అనలేదు. తనకే అనిపించింది. ‘నీట్‌’ని కొట్టాలంటే కోచింగ్‌ ఉండాలి అంటారు. నీట్‌ని కూడా కోచింగ్‌ లేకుండానే సాధిస్తాను అంటోంది! హిమాచల్‌ప్రదేశ్‌లో టెన్త్‌ పరీక్షలు ఫిబ్రవరి 22న మొదలై, లాక్‌డౌన్‌కి ముందే మార్చి 19న పూర్తయ్యాయి. పరీక్షలు దగ్గరకొస్తే కానీ పిల్లలకు చదివే మూడ్‌ రాదు. తనూ మాత్రం ఇప్పుడు నీట్‌కి ప్రిపేర్‌ అవుతున్నట్లే... టెన్త్‌లో తొలి క్లాసు మొదలైన రోజు నుంచే తనని తను ‘ఎగ్జామ్స్‌ మోడ్‌’లో ఉంచేసుకుంది! ఏ రోజూ ఆరేడు గంటలు చదవకుండా లేదు. ఏ రోజూ టీచర్‌లని సందేహాలు అడక్కుండా లేదు. చివరి పరీక్ష ముగిసే వరకు టీచర్‌లను అడిగి డౌట్స్‌ తీర్చుకుంటూనే ఉంది. కొన్నిసార్లు ఫోన్‌లో. కొన్నిసార్లు నేరుగా ఇంటికి వెళ్లి. ఫోన్‌లో మాట్లాడ్డం కూడా తనూకి వెలితిగా ఉండేది. లౌక్‌డౌన్‌లో ఇప్పుడంతా.. ఆన్‌లైన్‌ క్లాసులు అంటున్నారు. తనూకి అలా ఇష్టం ఉండదు. ‘‘ఎదురుగా టీచర్‌ లేకపోతే నేర్చుకున్నట్లే ఉండదు’’ అంటుంది తనూ.

కాంగ్రాలోని సమ్లోటీలో ఇషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థిని తనూ. ఆమెకు స్టేట్‌ ఫస్ట్‌ రావడంతో ఆమె తల్లిదండ్రుల్లానే స్కూలు యాజమాన్యమూ పట్టలేని ఆనందంలో ఉంది. కుమారి తండ్రి తిలక్‌ రాజ్‌ సేల్స్‌మాన్‌. తల్లి గృహిణి. తనూ దగ్గరి బంధువుల్లో డాక్టర్‌లు ఉన్నారు కానీ.. డాక్టర్‌ అవ్వాలని మాత్రం టెన్త్‌ పరీక్షలు రాసే నాటికి తనూకి లేదు. కరోనా వచ్చి, వైద్యం ఎంత అవసరమో కళ్ల ముందు కనిపిస్తున్న కొద్దీ ఆమెలో మెడిసిన్‌ చదవాలన్న కోరిక కలిగి, క్రమంగా  బలపడింది. అంతటి ఆర్థిక స్థోమత లేకపోవచ్చు. సాధించగలనన్న ఆత్మస్థయిర్యం ఉంది. ఫ్లానింగ్‌లో టాప్‌ మోస్ట్‌ ర్యాంకర్‌ కదా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top