రత్నాల పెళ్లి కూతుళ్లు

Four Girls Of Pancharatnam Quintuplets To Tie Knot On Same Day - Sakshi

అది కేరళ రాష్ట్రం, తిరువనంతపురం నగరానికి సమీపంలో ఉన్న గ్రామం. పేరు పోథెన్‌కోడ్‌. ఆ ఊర్లో ఓ ఇంటి ముందు ‘పంచ రత్నం’ అని అందంగా రాసిన నేమ్‌ ప్లేట్‌ ఉంది. ‘అవును నా ఇంట్లో పంచరత్నాలున్నాయి. అందుకే ఇంటికి ఆ పేరు పెట్టుకున్నాను’ అని చెప్పేవారు ఆ ఇంటి యజమాని ప్రేమ్‌కుమార్‌. ఆయన భార్య రమాదేవి కూడా.. ‘అవును మరి, మా బిడ్డలు పంచరత్నాలు’ అని మురిసిపోయేది. ఇది ఆ ఇంటికి ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరు కాదు, 1995, నవంబర్‌ 18వ తేదీన ఐదుగురు పిల్లలతోపాటు పేరు కూడా పుట్టింది.

నిజమే, ఐదుగురు పిల్లలూ ఒకేసారి పుట్టారు. వారిలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్ల పేర్లు ఉత్రజ, ఉత్తర, ఉత్తమ, ఉత్ర. ఇక అబ్బాయి పేరు ఉత్రాజన్‌. వీళ్లు పుట్టినపుడే వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత పుట్టినరోజు, పదో తరగతి పాస్‌ అయిన సందర్భం... ఇలా వార్తల్లో కనిపిస్తూ స్థానికంగా సెలబ్రిటీలైపోయారు. ఇప్పుడు పెళ్లి కూతుళ్లుగా మరోసారి వార్తల్లోకొచ్చారు.

కల నిజం కాబోతోంది
‘‘పిల్లలు పుట్టినప్పుడే... నలుగురమ్మాయిలకూ మంచి సంబంధాలు దొరికి నలుగురికీ ఒకేరోజు ఒకే వేదిక మీద ఆ దేవుని సన్నిధిలోనే పెళ్లి చేయాలని గురువాయూర్‌ శ్రీకృష్ణుడిని మొక్కుకున్నాను. ఆ కల నిజం కాబోతోంది’’ అన్నారు రమాదేవి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 26వ తేదీన గురువాయూర్‌లోని శ్రీకృష్ణుని దేవాలయంలో ఈ అమ్మాయిల పెళ్లి జరుగుతోంది. ఈ సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించడానికి ప్రేమ్‌కుమార్‌ లేకపోవడం ఆ కుటుంబానికి పెద్ద లోటు. ఆయన ఐదేళ్ల కిందట హటాత్తుగా మరణించాడు. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను రమాదేవి ఒంటిచేత్తో నిర్వహించారు.

ఆమె అప్పటికే గుండె సమస్యతో బాధపడుతోంది. పేస్‌మేకర్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, కోఆపరేటివ్‌ బ్యాంకులో చిన్న ఉద్యోగం చేస్తూ పిల్లలను ప్రయోజకులను చేశారు రమాదేవి. అమ్మాయిల్లో ఉత్రజ, ఉత్తమ ఇద్దరూ అనస్తీషియా టెక్నీషియన్‌లు, ఉత్తర ఫ్యాషన్‌ డిజైనర్, ఉత్ర ఆన్‌లైన్‌ జర్నలిస్ట్‌. వాళ్ల ఏకైక సోదరుడు ఉత్రాజన్‌ ఐటీ ఉద్యోగి. మరి అతడి పెళ్లెప్పుడు? అంటే... ‘‘వాడు అధిరోహించవలసిన ఉన్నత శిఖరాలెన్నో ఉన్నాయి. ఆ తర్వాతే పెళ్లి’’ అని ఉత్రాజన్‌ తల్లి అంటున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top