గుండెకు మేలు చేసే ఆహారం

గుండెకు మేలు చేసే ఆహారం


► సాల్మన్ ఫిష్, ట్యూనా, హెర్రింగ్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే బెటరని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది.

► ఓట్ మీల్ తింటే మంచిది. పీచు పదార్థం ఉండే ఈ ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేసి, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే.

► స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, ఆ పండ్లలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, పీచుపదార్థాలు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది.

► డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరిగే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్‌ల వల్ల ఉపయోగం లేదు. అయితే వీటిని కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి.

► విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్ళీ అతిగా పంచదార కలుపుకోకూడదు.

► సోయా పాలు, సోయా జున్ను (తోఫూ) తింటే ఒంటికి కావాల్సిన ప్రొటీన్లు వస్తాయి. అనారోగ్యకరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు. సోయా ప్రొటీన్లు ఒంట్లో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

► బంగాళదుంపలు అనగానే అతిగా పిండిపదార్థమని చాలామంది పక్కనపెడుతుంటారు. కానీ, అతిగా వేయించనంత వరకు బంగాళదుంపలు గుండెకు ప్రమాదకరం కావు. పొటాషియం ఎక్కువగా ఉండే వీటిలో ఫైబర్ ఉంటుంది.

► టొమాటోలలో కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. ఇందులోని విటమిన్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

►గుప్పెడన్ని నట్స్ అంటే బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్‌నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది.

►బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి.

►దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ రసం తాగితే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. దానిమ్మ పండు గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే అడ్డంకులు (ప్లాక్స్)నూ శుభ్రం చేస్తాయి. యాపిల్ పండ్లు కూడా.

►అవిశె గింజలలో (ఫ్లాక్ సీడ్స్) పీచు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటిని రోజుకు 20 గ్రాములు తింటే మేలు.
- రాధిక

 చీఫ్ డైటీషియన్,

 కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top