చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొట్టారయ్యా?! | The first crying club in the country was started in Surat | Sakshi
Sakshi News home page

చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొట్టారయ్యా?!

Feb 11 2019 1:00 AM | Updated on Feb 11 2019 1:01 AM

The first crying club in the country was started in Surat - Sakshi

ఎవరూ కొట్టలేదు. ఊరికే ఏడుస్తున్నాడు కిట్టయ్య. కిట్టయ్యే కాదు, కిట్టమ్మా.. ఏడుస్తోంది చూడండి!ఏడుపు క్లబ్‌లో చేరి మరీ చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు.ఆరోగ్యానికి మంచిదట. లాఫింగ్‌ క్లబ్‌ పెట్టిన ఆయనేఇప్పుడు..క్రయింగ్‌ క్లబ్‌ కూడా పెట్టి మరీ ఏడిపిస్తున్నాడు.

పెద్దవాళ్లకంటే చిన్నపిల్లలే ఆరోగ్యంగా ఉంటారు శారీరకంగా.. మానసికంగా. ఎందుకంటే పిల్లలు మనసారా నవ్వుతారు.. కడుపారా ఏడుస్తారు! ఏ ఉద్వేగాన్నీ దాచుకోరు. పెద్దవాళ్లకు ఉన్నట్లు పిల్లలకు  భావోద్వేగాల దాపరికాలు ఉండవు! అంతెందుకు.. బిడ్డ పుట్టగానే ఏడిస్తేనే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టని నమ్ముతాం. అంటే ఆరోగ్యానికి ఏడుపే సంకేతమన్నట్టు కదా! చైల్డ్‌ సైకాలజీ లెసెన్‌కు ఇదేదో ఉపోద్ఘాతమనుకునేరు. కాదు.. పెద్దవాళ్లు ఆనందంగా ఉండడానికి ఏర్పాటు చేసిన ఓ క్లబ్‌కు ఇంట్రడక్షన్‌. లాఫింగ్‌ క్లబ్‌ కాదు. దేశంలో ఏర్పాటైన మొట్టమొదటి ‘క్రయింగ్‌ క్లబ్‌’ అది! సూరత్‌లో (గుజరాత్‌) స్టార్ట్‌ చేశారు.

సంస్థాపకుడు కమలేష్‌ మసల్వాలా.  బాగా పేరున్న సైకాలజిస్ట్‌. 62 ఏళ్లు. చాలా మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చేవాడు. నవ్వు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుందని, వృద్ధాప్యాన్ని దూరం చేస్తుందనీ తన పేషంట్స్‌కి చెప్పి.. లాఫింగ్‌ క్లబ్‌లో చేరమని సలహా కూడా ఇచ్చేవాడు. లాఫ్టర్‌ థెరపిస్ట్‌గా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరూ పొందాడు. అయినా మందుల వాడకం, మనో వ్యాకులత తగ్గకపోవడం గమనించాడు. కారణం ఏంటని అన్వేషించాడు. చుట్టూ ఉన్న మనుషులను, పరిసరాలను పరిశీలించడం మొదలుపెట్టాడు. అప్పుడు తెలిసింది.. క్రయింగ్‌ క్లబ్‌ తెరుచుకుంది!

ఆరోగ్యానికి ‘హాయి’కరం
కమలేష్‌ మసల్వాలా చిన్న పిల్లలను చూశాడు. వాళ్ల కేరింతలను, ఏడుపునూ అబ్జర్వ్‌ చేశాడు. జవాబు దొరికింది. ఒత్తిడి ఎక్కువైన ఆధునిక జీవన శైలిలో బాధ, దిగులు గూడుకట్టుకుంటుందే తప్ప దానికి అవుట్‌లెట్‌ లేదు. సంతోషానికి ఇంకో తలుపు తెరవాలనే చెప్తూ వచ్చాడు తప్ప భావోద్వేగాలను బంధించి ఉంచాలనే పాతకాలపు భావాల ద్వారాన్ని బద్దలు కొట్టాలని చెప్పలేదు. మనలో ఉన్న బాధ కన్నీళ్లుగా బయటకు వస్తే తప్ప అసలైన సంతోషం హృదయంలోకి చేరదు, మొహంలో ప్రతిఫలించదు. కాబట్టి ముందు కన్నీళ్లకు తలుపులు తెరవాలని అని నిశ్చయించుకున్నాడు కమలేష్‌. ఆ విషయాన్ని సూరత్‌లో ఉన్న తనకు సన్నిహితులైన కొంతమంది సైకాలజిస్ట్‌లు, సైకియాట్రిస్ట్‌లకు చెప్పాడు. క్రయింగ్‌ క్లబ్‌ పెట్టాలన్న కమలేష్‌ నిర్ణయానికి ఊతమిచ్చారు వాళ్లంతా. అలా వాళ్లందరి సహకారంతో 2017లో ‘హెల్దీ  క్రయింగ్‌ క్లబ్‌’ను ప్రారంభించాడు కమలేష్‌.  

టియర్స్‌ టు చీర్స్‌
‘‘టియర్స్‌ టు చీర్స్‌’’లక్ష్యంతో హెల్దీ క్రయింగ్‌ క్లబ్‌ పనిచేస్తోంది.  ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ‘మ్యాజికల్‌  థెరపటిక్‌ ప్రొసీజర్‌ ఆఫ్‌ క్రయింగ్‌ అవుట్‌ లౌడ్‌’ తో క్లబ్‌కి వచ్చిన వాళ్లలో ఆనందాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కమలేష్‌. మారిన లైఫ్‌ స్టయిల్‌లోని వేగం.. మన గురించి మనం పట్టించుకోకపోవడం.. కన్నీళ్లు పెట్టుకోవడం మనిషి బలహీనతకు చిహ్నమనే అపోహ వంటి వాటివల్ల డిప్రెషన్‌ మనిషిని స్థిరనివాసంగా మార్చుకుంది. నవ్వడం మర్చిపోయినట్టే ఏడ్వడాన్ని తొక్కిపెట్టాడు. క్రయింగ్‌ థెరపీ కోసం ప్రపంచంలోని హ్యాపీ థెరపీలన్నిటినీ అభ్యసించాడు, పరిశోధించాడు కమలేష్‌.

అన్నిటి ఫలితమే క్రయింగ్‌ అవుట్‌ లౌడ్‌. ఈ పద్ధతిలో తను ఇస్తున్న ట్రీట్‌మెంట్‌తో తన పేషంట్స్‌ ఇతర జబ్బులకు వాడే మందుల్లో దాదాపు యాభై శాతం మందుల వాడకం తగ్గిపోయిందట. తొలినాళ్లలో ఈ క్లబ్‌కి యాభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు ఎక్కువగా వచ్చేవారట. ఇప్పుడు ఇరవై నుంచి ఎనభైఏళ్ల వాళ్లు వస్తున్నారట. ప్రతి నెల మరింత మంది చేరుతున్నారు.  ఏడుపు.. సంతోషానికి తొలి మెట్టు అని శాస్త్రీయంగా కూడా రుజువైన సత్యం. ఏడిస్తే శరీరానికి హానిరకమైన టాక్సిక్‌ హార్మోన్, కార్టిసోల్‌ విడుదలై బయటకు వెళ్లిపోతాయి. దాంతో మనసు, శరీరం తేలికై పాజిటివ్‌ ఎనర్జీతో ఉత్తేజితమవుతాయట. ‘‘మనసులో ఉన్న బాధను బయటకు చెప్పుకుంటూ ఏడ్చాక చాలా మంది తేలికపడి.. సంతోషంగా ఫీలవుతున్నారు.

ఏడ్వడం పిరికివాళ్ల లక్షణం, ఏడుపు బలహీనత వంటి అర్థంలేని మాటలను లైఫ్‌ డిక్షనరీలోంచి తొలగించండి. ఏడుపు వచ్చినప్పుడు ఏడ్వాలి. బాధ పంచుకుంటే తగ్గుతుంది.. సంతోషం పంచుకుంటే పెరుగుతుంది అన్న నానుడి ఉండనే ఉంది. దీన్ని ప్రాక్టీస్‌లో పెడితే.. సంతోషం మీ వెంట ఉన్నట్టే. ప్రతి రాత్రి తర్వాత ఉదయం అనివార్యం. బాధ బయటకు వెళితేనే సంతోషం వచ్చి చేరుతుంది. కడుపులో దుఃఖాన్ని కన్నీళ్ల రూపంలో పంపించేయండి... నవ్వుల రూపంలో సంతోషాన్ని మనసులో భద్రం చేసుకోండి’’ అంటాడు కమలేష్‌ మసల్వాలా.

క్రయింగ్‌ క్లబ్‌లో నెలనెలా పెరుగుతున్న సంఖ్యను చూసి.. దీన్ని దేశంలోని మిగతా ప్రాంతాలకూ విస్తరింపచేసే ఆలోచనలో ఉన్నాడు కమలేష్‌. అంతేకాదు.. సూరత్‌లోనే లాఫ్టర్‌ అండ్‌ క్రయింగ్‌ థెరపీని కలుపుతూ ఓ ప్రయోగం చేయబోతున్నట్టు చెప్పాడు కమలేష్‌. ఏడుపు.. ఏడువిధాల మేలు అనే మాట ఖాయం కానుందన్నమాట. సోషల్‌ మీడియా భాషలో కూడా లాల్‌ (లాఫింగ్‌ అవుట్‌ లౌడ్‌) ఉన్నట్టే .. కాల్‌.. క్రయింగ్‌ అవుట్‌ లౌడ్‌ కూడా రానుందన్నమాట. 

డబ్బులు ఇచ్చి మరీ..!
ఎన్నో కొత్త ఆవిష్కరణలకు జపాన్‌ దేశమే ప్రయోగశాల. క్రయింగ్‌ క్లబ్స్‌కి కూడా జపానే మూలం.  టోక్యోలోని మిట్సుయి గార్డెన్‌ యోట్సుయా అనే హోటల్లోనైతే ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా ‘‘క్రయింగ్‌ రూమ్స్‌’’ను ఏర్పాటు చేశాయి. రోజుకి పదివేల జపనీస్‌ యెన్‌ అంటే 6,120 రూపాయలు చార్జ్‌ చేస్తారట ఈ క్రయింగ్‌ రూమ్స్‌కి. కళ్లు, ముక్కు  తుడుచుకునే టిష్యూస్, దుఃఖాన్ని తెప్పించే  విషాదభరితమైన సినిమాలు, విషాదభరితమైన సంగీతం వంటి వన్నీ ఆ గదిలో ఉంటాయి.

ఈ క్రయింగ్‌ క్లబ్‌ కల్చర్‌ను జపాన్‌ నుంచి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ కూడా దిగుమతి చేసుకుంది. లండన్‌లో క్రయింగ్‌ క్లబ్‌లు ఓ పరిశ్రమగా మారాయి. యూరప్‌లో  ఇప్పుడిప్పుడే క్రయింగ్‌ క్లబ్‌లు తెరుచుకుంటున్నాయట. అమెరికాలో ఆల్రెడీ స్టార్ట్‌ అయ్యాయి. అక్కడ వెబ్‌సైట్స్‌ కూడా వెలిశాయట. ఏడుస్తూ ఫోటోలు తీసుకుని .. ఏడ్చిన కారణం, ఏడ్చిన తర్వాత కలిగిన అనుభూతి వంటి వాటిని ఆ ఫోటో కింద రాసి వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేయాలి. ఈ వెబ్‌సైట్లకు చాలా క్రేజ్‌ ఉందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement