వంట.. నువ్వా నేనా?

Fighting between husband and wife for cooking - Sakshi

సంసారం ఉల్లిపాయలాంటిది.ఎన్నో పొరలుంటాయి.ప్రతి పొరలోనూ ఒక కథ ఉంటుంది. పొరలు విప్పుకుంటూ..భార్యాభర్తలు కలిసి జీవించాలి. అలా కాకుండా.. సంసారాన్ని కోసుకుంటే కన్నీళ్లే. 

రెస్టారెంట్‌లో పాట లోగొంతుకలో వినిపిస్తూ ఉంది. కిశోర్‌ పాడుతున్నాడు.‘తుమ్‌ ఆగయేహో... నూర్‌ ఆగయా హై’...‘ఇది గుల్జార్‌ సినిమాలోది అనుకుంటాను’ అన్నాడు వెంకట్‌ ప్లేట్‌లో ఉన్న పదార్థాన్ని కొద్దిగా నోట్లో పెట్టుకుంటూ.‘మీకు గుల్జార్‌ తెలుసా’ అంది అనిత కొంత మెరుపు తెచ్చుకుంటూ.‘పెద్దగా తెలియదు. కాని హిందీ పాటలు వింటాను’‘థాంక్‌ గాడ్‌... పాటలు తెలియని అబ్బాయితో పెళ్లి చూపులేమోఅనుకుని కొంచెం భయపడ్డాను’ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసగా చూసుకున్నారు.పెద్దలు కుదిర్చిన పెళ్లిచూపులు అమ్మాయి ఇంట్లో నాలుగురోజుల క్రితమే ముగిశాయి. రెండు మూడుసార్లు కలిశాక ఏ సంగతి చెబుతాం అని ఇద్దరూ అన్నారు. ఇది మొదటి మీటింగ్‌.‘నాకు పాటలు ఇష్టం. చేనేత వస్త్రాలు ఇష్టం. భూపేన్‌ హజారికా, కైలాష్‌ ఖేర్‌ను అభిమానిస్తాను. ఊటీ నైనిటాల్‌ కంటే మన మదనపల్లి పక్కన ఉన్న హార్స్‌లీ హిల్సే ఇష్టం’ చెబుతోంది అనిత.‘నాక్కూడా పాటలు ఇష్టమే. కాకపోతే నేను ఎస్‌.జానకి ఫ్యాన్‌ని. రామ్‌రాజ్‌ యాడ్‌లో వెంకటేశ్‌లా కాకపోయినా సింపుల్‌గా ఉండే బట్టలే ఇష్టం.ట్రావెలర్‌ని కాదుగాని లోకల్‌ కల్చర్, పల్లెటూళ్లు... వీటిలో మీతో ఒక రెండు మూడు రోజులు ఉండమంటే సంతోషంగా ఉంటాను. చిన్న డౌట్‌?’ ‘అడగండి’‘ఒకవేళ మనకు పెళ్లయితే రాత్రి పది తర్వాత కూడా పాటలు వింటూ కూర్చోరుగా’నవ్వింది. నోట్లో ఉన్న సాంబర్‌ ఇడ్లీ గొంతులోకి వెళ్లి పొలమారేంత నవ్వు వచ్చింది.వాళ్ల మనసులు పెళ్లికి సిద్ధమయ్యాయి.అంతా కుదిరినట్టే అనుకన్నారు.కాని ఒకటి రెండు ముఖ్యమైన ప్రశ్నలు మర్చిపోయారు.
 

వెంకట్‌ తల్లిదండ్రులు ఇండిపెండెంట్‌ స్వభావం ఉన్నవాళ్లు. పైగా ఈ కాలపు ధోరణి తెలిసినవాళ్లు. కొడుకు పెళ్లి కావడంతోటే మంచి ఫ్లాట్‌ అద్దెకు తీసుకొనేలా చేసి విడిగా కాపురం పెట్టే ఏర్పాటు చేశారు.ఏడంతస్తుల ఫ్లాట్‌. టాప్‌ ఫ్లోర్‌లో కొత్త జంట. ఇద్దరూ ఆఫీసులకు వెళతారు. ఇద్దరూ ఆఫీసు నుంచి వస్తారు. డిన్నర్‌ సాధారణంగా బయటే ఉంటుంది. లేదంటే స్విగ్గీ, జొమోటో ఉండనే ఉంది. అతడు ఆమె చేయి పట్టుకుని సోఫాలో పక్కన చేరి టీవీ ఆన్‌ చేస్తాడు. కబుర్లు నడుస్తాయి. బాగా నవ్వుకుంటారు. నిశ్శబ్దం పాటించాల్సిన సమయంలో కూడా కళ్లు విపరీతంగా మెరుస్తాయి.మంచి జోడి అని ఇద్దరికీ అనిపిస్తూ ఉంది.ఆరునెలలు గడిచే వరకు ఏ జంటకైనా ఇలాగే అనిపిస్తుంది కాబోలు.ఒకరోజు వాట్సప్‌లో హైదరాబాద్‌ హోటళ్లలో కల్తీ తిండి క్లిప్పింగ్‌ ఒకటి విపరీతంగా సర్క్యులేట్‌ అయ్యింది. ‘బయటి తిండి ఇక మానేయాలి’ అన్నాడు వెంకట్‌.‘అవును... పొట్టంతా ఏదో అవుతోంది’ అంది అనిత.ఆనాటితో వారి అసలైన కాపురం మొదలైంది.

ఇద్దరిదీ దాదాపు ఒకే వయసు. ఇద్దరివీ బాధ్యతాయుతమైన ఉద్యోగాలు. ఇద్దరికీ మంచి జీతం ఉంది. ఇద్దరూ బయటికెళ్తారు. ఇద్దరూ ఇంటికొస్తారు. కాకుంటే చిన్న తేడా. అతడు మగాడు. ఆమె ఆడది.ఆమెకు రాత్రి వచ్చేసరికి ఎనిమిది అయిపోతుంది. అప్పుడు వంట చేయాలి. తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుంది. తిన్నాక మళ్లీ వంటిల్లు చక్కబెట్టాలి. పదీ పదిన్నర అయిపోతుంది. ఆ తర్వాత నిద్ర పోవాలి.పన్నెండు అయిపోతుంది. కాని తెల్లారి మళ్లీ లేవాలి. బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి. ఆఫీసుకు రెడీ అవ్వాలి. ఒకరోజు, రెండ్రజులు, మూడ్రోజులు... మెల్లగా ఆమెకు ఒకటి అర్థమైంది. ఇది అనంతం. స్త్రీకి అనంతం. దానికి తోడు తనకు వంట సరిగా రాదు. అన్నిసార్లు కుదిరి చావదు. తనకేం జరుగుతున్నదో వెంకట్‌కు పట్టదు.‘వంట చేసే పని మనిషిని పెట్టుకుందామా’ అంది ఒకరోజు.‘అలాగే’ అన్నాడతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.కాని కాపురంలో మూడో మనిషి ప్రమేయం అన్నిసార్లు సుఖంగా ఉండదు. ఆ పని మనిషి ఉదయం ఆరున్నర ఏడుకు వస్తేనే వీరికి ప్రయోజనం. అలా వచ్చే పని మనిషి దొరకదు. పని వచ్చినా వంట సరిగ్గా వచ్చే మనిషి దొరకదు. దొరికినా శుభ్రంగా కనిపించే మనిషి దొరకదు. తెల్లారే లేచి శుభ్రంగా స్నానం చేసి వచ్చే వీలు వారికి ఉండదు. అలాంటి వీలు ఉన్నవాళ్లు పనిమనుషులుగాపని చేయరు. ఇవన్నీ కుదిరినా ఇల్లు అప్పజెప్పాలంటే అనుమానం. ‘ఈ హింస కంటే నేనే హింస పడతాను. నువ్వు కాస్త సహాయం చెయ్‌’ అంది ఒకరోజు.అప్పటిదాకా వెంకట్‌లో కోపధారి అయిన ఒక మనిషి ఉంటాడని ఆమెకు తెలియనే తెలియదు. ఆరోజు తెలిసింది.‘ఏం మాట్లాడుతున్నావ్‌? ఉల్లిపాయలు కోసి అంట్లు తోమమంటావా? నాకు అసహ్యం. ఇంకొక్కసారి ఆ ప్రస్తావన తేకు.కావాలంటే నువ్వు ఉద్యోగం మానెయ్‌’ అన్నాడు.‘ఏం చేస్తున్నావ్‌ సుజా.. కాస్త క్యారెట్‌ తరిగిపెట్టనా’ అనే మగాళ్లు ఉంటారు. కాని ఇతను అలాంటి వాడు కాదు. ‘అయ్యో... మీరు వంటింట్లో ఏంటండి... వెళ్లండి’ అనేఆడవాళ్లు ఉంటారు.అనిత అలాంటి ఇల్లాలు కాదు.ప్రాబ్లమ్‌ స్టార్టెడ్‌.

తొమ్మిదో నెలకు సాధారణంగా బిడ్డ పుట్టాలి. వీరి పెళ్లయిన తొమ్మిది నెలలకు తెగదెంపులు చేసుకుందామా అని అనుకున్నారు. ఆ సమయంలోనే వెంకట్‌ తల్లిదండ్రులు కొన్నాళ్లు ఉండిపోదామని కొడుకు దగ్గరకు వచ్చారు. నాలుగు రోజుల్లోనే కొడుకూ కోడలి మధ్య ఏం జరుగుతుందో వారికి అర్థమైంది. దగ్గరి మనుషుల సలహాలు ఒక్కోసారి రుచించవు. బయటి మనుషులు చెప్తే వింటారని ఇద్దరినీ సైకియాట్రిస్ట్‌ దగ్గరకు కౌన్సిలింగ్‌కు తీసుకొచ్చారు.నేను వారి కంటే ముందు అబ్బాయి తల్లిదండ్రులతో, అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడాలి అంది లేడీ సైకియాట్రిస్ట్‌.మొదట వెంకట్‌ తల్లిదండ్రులు వచ్చారు.‘మీ ఇంటి పరిస్థితులు పెంపకం చెప్పండి’ అంది సైకియాట్రిస్ట్‌.‘ఇద్దరం బాగా చదువుకున్నాం. కాని నేను ఉద్యోగం చేయాలని నా భార్య ఇల్లు చూసుకోవాలని ముందే నిశ్చయించుకున్నాం. నేనెప్పుడూ ఇల్లు పట్టించుకున్నది లేదు. నా భార్య నా పిల్లలకు చిన్న పని చెప్పింది లేదు. వాళ్ల చదువులు, ఫ్రెండ్స్‌ అలాగే పెరిగారు’ అన్నాడు వెంకట్‌ తండ్రి.‘ఊ... అందుకే మీలాంటి జీవితమే మీ అబ్బాయి ఆశిస్తున్నాడు’ అంది సైకియాట్రిస్ట్‌.‘మేము మా అమ్మాయిని యాంబీషియస్‌గా పెంచాం. ఆడపిల్లంటే వంటలక్క కాదని కెరీర్‌లో పైకి వెళ్లాలని బాగా చదువుకోవాలని పెద్ద ఉద్యోగం చేయాలని చెప్తూ పెంచాం. మా అమ్మాయి అలాగే పెరిగింది కూడా’ అన్నారు అనిత తల్లిదండ్రులు.‘ఊ... కనుకనే ఇంటి పని ఆమెకు పెద్ద పీడగా మారింది’ అంది లేడీ సైకియాట్రిస్ట్‌.

ఆ తర్వాత డాక్టర్‌ ఆ కొత్త జంటతో మాట్లాడటం ప్రారంభించింది. వారికి ఒకరినొకరిని అసలైన అర్థంలో పరిచయం చేయడం మొదలెట్టింది. ఇద్దరి ఆకాంక్షల మధ్య ఒక సర్దుబాటు రేఖ గీసి అక్కడి వరకూ వారిని నడిపించింది.‘చూడు వెంకట్‌... నీకు నీ భార్య సంపాదన హోదా కావాలి గాని ఆమె ఇంటి పనిలో భాగం వద్దంటున్నావు. ఇది ఎంత వరకు భావ్యం? అనిత.. నువ్వు భర్త ద్వారా వచ్చే గౌరవం, సెక్యూరిటీ ఆశిస్తున్నావు గాని మగ స్వభావం అర్థం చేసుకోలేకపోతున్నావు. మీరిద్దరూ బయట పనిలో రాణించాలంటే ఇంటి శ్రమను పంచుకోవాల్సిందే. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. మీ ఇద్దరి మధ్య ఉన్నప్రేమను తరగాల్సిన ఒక ఉల్లిపాయ హరించేయకుండా చూసుకోండి’... అంది డాక్టర్‌.చెప్పగా చెప్పగా వారి మనసులకు ఎక్కింది.ఆ రోజు లాస్ట్‌ సెషన్‌ పూర్తయ్యింది. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ల్యాప్‌ టాప్‌లో పెద్ద సౌండ్‌తో కిశోర్‌ పాటలు మొదలయ్యాయి. ‘డిన్నర్‌లోకి విజిటెబుల్‌ పలావు చేస్తాను’ అంది అనిత.వెంకట్‌ కూరగాయలతో వంటగదిలో పద్మాసనం వేశాడు.‘తుమ్‌ ఆగయేహో.. నూర్‌ ఆగయా హై’.... పాట సరైన పాకంలో పడింది.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top