లైఫ్‌లో ఏదీ సులభంగా అందదు

Female ceo divya suryadevara story - Sakshi

ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలని అంటారు. ఇప్పుడు దానిని కాస్త మార్చి మహిళా సీఈవోలను చూసి, కంపెనీలని చూడాలని అంటున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీల్లో అత్యున్నత పదవులకు మహిళల నియామకానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దినట్టే మహిళలు కంపెనీనీ సమర్థంగా నిర్వహిస్తారనే భావన ఈ మధ్య కాలంలో అందరిలోనూ పెరుగుతోంది.

ఈ క్రమంలోనే అమెరికాలో ప్రఖ్యాత ఆటోమొబైల్‌ సంస్థ జనరల్‌ మోటార్స్‌ తమ కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా (సీఎఫ్‌ఓ) మొట్టమొదటిసారిగా ఒక మహిళను నియమించింది. భారత్‌లోని చెన్నైకి చెందిన దివ్య సూర్యదేవరను సీఎఫ్‌ఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.జనరల్‌ మోటార్స్‌లో దివ్య 2005 సంవత్సరంలో చేరారు. వివిధ స్థాయిల్లో ఎన్నో పదవులు నిర్వహించారు.  2017 జూలై నుంచి ఆమె కార్పొరేట్‌ ఫైనాన్స్‌ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. సెప్టెంబర్‌ నుంచి సీఎఫ్‌ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇప్పటికే జనరల్‌ మోటార్స్‌ కంపెనీ సీఈవోగా మేరీ బర్రా అనే మహిళే ఉన్నారు. అంతే కాకుండా హెర్షే కో, సిగ్నెట్‌ జ్యుయలర్స్‌ వంటి ప్రసిద్ధ కంపెనీలకు సీఈవో, సీఎఫ్‌ఓలుగా మహిళలే ఉన్నారు. ‘‘పెద్ద పెద్ద కంపెనీలన్నీ అత్యున్నత స్థాయి పదవుల్లో మహిళల్నే నియమించడం నిజంగా గర్వ కారణం. ఇది సంబరాలు చేసుకునే సమయం’’ అని మహిళలు అత్యున్నత స్థాయికి వెళ్లడానికి శిక్షణనిచ్చే స్వచ్ఛంద సంస్థ సీనియర్‌ డైరెక్టర్‌ అన్నా బెనింగర్‌ వ్యాఖ్యానించారు.

చదువులకోసం అప్పులు
బ్యూక్, కాడిలాక్, చావర్లెట్‌ వంటి కార్లను రూపొందించే అత్యంత ప్రతిష్టాత్మక కంపెనీ జనరల్‌ మోటార్‌  ఆర్థిక వ్యవహారాల బాధ్యతల్ని చూడటం అంటే ఆషామాషీ కాదు. ఈ స్థాయికి దివ్య ఎదగడం వెనుక ఆమె అకుంఠిత దీక్ష, పట్టుదల ఉన్నాయి. తాను చేరిన సంస్థలోనే అత్యున్నత స్థాయికి ఎదగడంతో దివ్య ఆనందం పట్టలేకపోతున్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నతనంలో తను ఎన్ని కష్టాలు పడ్డారో గుర్తు చేసుకున్నారు.

‘‘మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం. చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. దీంతో అమ్మ ఒక్కతే రెక్కలు ముక్కలు చేసుకుంటూ  మమ్మల్ని పెంచింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అప్పోసొప్పో చేసి మరీ చదివించింది. పెద్ద చదువులు చదివి పైకి ఎదగాలని మా అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది. జీవితంలో ఏదీ సులభంగా అందదని నాకు చిన్నవయసులోనే అర్థమైంది. ఉన్నత చదువుల కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఉద్యోగం వచ్చాక నేనే చెల్లించాను. అమెరికాకు వచ్చాక సాంస్కృతిక తేడాల కారణంగా అలవాటు పడటానికి సమయం పట్టింది’’ అంటూ ఆమె తన మనోగతాన్ని వెల్లడించారు.

మద్రాస్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చదివి దివ్య ఆ తర్వాత అమెరికాకు వచ్చేశారు. హార్వార్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. ప్రైస్‌వాటర్‌ హౌస్‌ కూపర్స్‌లో తొలుత ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత 25 ఏళ్లకే జనరల్‌ మోటార్‌లో చేరారు. దివ్యలో ప్రతిభ, ఆమె అనుభవం, నాయకత్వ లక్షణాలతో జీఎం మంచి వాణిజ్యపరమైన లాభాలు చూసిందని ఆ సంస్థ కొనియాడింది.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top