మూగ జీవాలకూ తీపి మాత్రలు! 

Faster results at low cost - Sakshi

తక్కువ ఖర్చుతోనే వేగంగానే సత్ఫలితాలు

నూజివీడు ప్రాంతంలో వాడుతున్న పశుపోషకులు

విశేష కృషి చేస్తున్న డాక్టర్‌ దంటు సత్యన్నారాయణ 

పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు అనారోగ్యానికి గురైనప్పుడు ఖరీదైన ఇంగ్లిష్‌ మందులుæ వాడటం తప్ప రైతులకు మరో మార్గం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇంగ్లిష్‌ మందులతో ఇతర సమస్యలు రావడంతోపాటు ఈ వైద్యం సన్న, చిన్నకారు రైతులకు శక్తికి మించిన భారంగా మారుతోంది. ఈ నేపధ్యంలో పశువులకు హోమియో వైద్యం ద్వారా అతి తక్కువ ఖర్చుతో సత్ఫలితాలను పొందవచ్చంటున్నారు డాక్టర్‌ దంటు సత్యన్నారాయణ. హోమియో మందులతో పశువుల్లో వచ్చే ఎలాంటి వ్యాధినైనా వేగంగా, పూర్తిగా తగ్గిస్తున్నారు. పశుపోషణపై ఆధారపడిన రైతులకు ఇది వరమని నిరూపిస్తున్నారు. డా. సత్యన్నారాయణ అందిస్తున్న హోమియో వైద్యంతో కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో పలువురు పాడి రైతులు, పశుపోషకులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఖమ్మంకు చెందిన డా. దంటు సత్యన్నారాయణ పశుసంవర్థకశాఖలో వైద్యునిగా పనిచేసి 2003లో రిటైరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఈయన అల్లోపతి మందుల కంటే హోమియో మందులు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని గమనించి.. రిటైరవ్వకు ముందు నుంచే పశువులకు హోమియో వైద్యం చేస్తున్నారు. లాభాపేక్ష లేకుండా కొన్న ధరకే 50 రకాల హోమియో మందుల కిట్‌ను రైతులకు అందజేస్తున్నారు. 

పశువులకు హోమియో వైద్యం వల్ల లాభాలు
ఖర్చు తక్కువ, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు, మందులు నిల్వ ఉంచడానికి ఫ్రిజ్‌ అవసరం లేదు. పశువులకు సారా, బీడీ, చుట్ట, మసాలా వంటి ఎలాంటి అలవాట్లు ఉండవు కాబట్టి పశువులలో ఈ మందులు బాగా పనిచేస్తాయి. డాక్టర్‌ కోసం ఎదురుచూడకుండా రైతే ఈ మందులను పశువులకు వేయవచ్చు. జబ్బులు రాక ముందుగానే ఈ మందులను అతితక్కువ ఖర్చుతో వేసుకోవచ్చు. తెల్ల మాత్రల్లో ద్రవరూప మందును ఒకసారి కలిపితే చాలాకాలం పాటు వాడుకోవచ్చు. ఎలాంటి యాంటీబయాటిక్స్‌ వాడనందున పశువులు త్వరగా కోలుకుంటాయని డా. సత్యన్నారాయణ తెలిపారు. 
 
ఏయే పశు వ్యాధులకు హోమియో చికిత్స
పశువులు మేత మేయకపోవడం, జ్వరం, కడుపు ఉబ్బరం, ఎదకు రాకపోవడం, పొదుగు వాపు, చూడి కట్టకపోవడం, మాయ వేయకపోవడం, గర్భకోశ వ్యాధులు, పాలు చేపకపోవడం, పాలు పితకకుండానే కారిపోవడం, పాలు తగ్గడం, గాయాలు, దెబ్బలు, గాంగ్రిన్, గాలికుంటు పుండ్లు, పాముకాటు, దూడలలో బొడ్డు వాపు, రక్త విరోచనాలు, తెల్ల విరేచనాలు, ఏలికపాములు, మలబద్దకం వంటి సమస్యలన్నిటికీ హోమియో మందులు వాడొచ్చు. కోళ్లు, గొర్రెలు, కుక్కలకు వచ్చే అన్ని రకాల వ్యాధులకు హోమియో వైద్యం ఉందని డా. సత్యన్నారాయణ తెలిపారు. గొర్రెలలో నీలి నాలుక వ్యాధిని కూడా హోమియో మందులతో తగ్గిస్తుండటం విశేషం.  – ఉమ్మా రవీంద్రకుమార్‌ రెడ్డి, సాక్షి, నూజివీడు

ఆవుల ఆరోగ్య సమస్యలు తగ్గాయి
మాకు దేశవాళీ ఆవులు 13, ఆవు దూడలు 8 ఉన్నాయి. వీటికి అల్లోపతి వైద్యం చేయించి విసుగు పుట్టింది. వైద్యులు, సిబ్బంది మనకు కావల్సినప్పుడు అందుబాటులో ఉండరు. అటువంటి పరిస్థితుల్లో డా.దంటు సత్యన్నారాయణ గారి గురించి విని ఆవులకు హోమియో చికిత్స చేయిస్తున్నాను. హోమియో వైద్యం మొదలుపెట్టిన తరువాత ఆవుల్లో ఆరోగ్య సమస్యలు చాలా వరకూ తగ్గాయి. ఆవులలో అనారోగ్య లక్షణాలను కనిపెట్టి.. ఆ వెంటనే హోమియో మందులను మేమే ఎలా వాడుకోవాలో డా. సత్యన్నారాయణ నేర్పించారు. వీటితో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏ లక్షణాలకు ఏ మందులు వాడాలనే కరపత్రం కూడా ఉంది. దానిలో పేర్కొన్న విధంగా వాడితే పశువులకు నయమవుతోంది. మరీ అర్థంకాని పరిస్థితి ఉంటే.. డా. సత్యన్నారాయణకు ఫోన్‌ చేసి లక్షణాలు చెబితే ఏ మందు వాడాలో చెప్తారు. చెప్పిన మందు వాడితే తగ్గిపోతున్నది. దూడలకు విరేచనాలు, చర్మ సంబంధిత సమస్యలు, పొదుగువాపు, జ్వరం తదితర సమస్యలు వచ్చినప్పుడు హోమియో మందులు వాడి సత్ఫలితాలు పొందాము. అల్లోపతి కంటే హోమియోతో ఖర్చు చాలా తక్కువ. – మేకా అమృత (94402 40393),  పశుపోషకురాలు, నూజివీడు, కృష్ణా జిల్లా

గోపాల మిత్రల ద్వారా వ్యాప్తిలోకి తేవాలి!
నా దగ్గర ఏడు దేశవాళీ ఆవులున్నాయి. వీటికి ఏడాది నుంచి హోమియో మందులే వాడుతున్నాను. మంచి ఫలితాలు వస్తున్నాయి. జ్వరాలు, విరోచనాలు, పొదుగు వాపు వ్యాధి, కాల్షియం లోపం, జ్వరం, చర్మ సంబంధిత  వ్యాధులు, ఇతర జబ్బులకు హోమియో వైద్యం అందిస్తున్నాం. ఖర్చు బాగా తక్కువ. ఉపయోగించడం సులువు. ప్రభుత్వం గోపాల మిత్రలకు ఈ మందుల వాడకంలో శిక్షణ ఇప్పించడం ద్వారా హోమియో పశువైద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. యాంటీబయోటిక్‌ మందు మార్కెట్‌లో రూ.100లు ఉండగా, హోమియో మందు రూ.5లకే లభ్యమవుతుంది. 
– డా.రేమెళ్ల సత్యన్నారాయణ (9440996727) విశ్రాంత వైద్యులు, పశుపోషకులు, నూజివీడు

పశువుల్లో పొదుగువాపు వ్యాధికి రూ.200తో చికిత్స
అల్లోపతి మందులు వాడినప్పటికంటే హోమియో వైద్యంలో వేగంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఖర్చు కూడా చాలా తక్కువ. మందులు బాగా పనిచేస్తున్నాయి.  పశువైద్యం అంటే అల్లోపతి వైద్యం మాత్రమే కాదు. హోమియోపతి వైద్యం కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నా. 1995 నుంచి పశువులకు హోమియో వైద్యాన్ని అందిస్తున్నా. తక్కువ ఖర్చే కాకుండా ఒకసారి తెచ్చి పెట్టుకున్న మందులు చాలాకాలం వరకు ఉపయోగపడతాయి. మందులను పశువులకు సులువుగా వేసుకోవచ్చు. పొదుగు వాపు వ్యాధికి అల్లోపతి మందులతో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేసినా తగ్గదు. హోమియో వైద్యంలో రూ. 200తో తగ్గిస్తున్నాం. ఈ వైద్యం సురక్షితమైనది. తక్కువ ఖర్చుతోనే అందించే ప్రయత్నం చేస్తున్నా.  దీన్ని మరింతగా ప్రచారం చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది.  – డాక్టర్‌ దంటు సత్యన్నారాయణ  (9440580903, 9059060491), హోమియో పశువైద్య నిపుణులు   

సహజాహారం కూరగాయలు, వరి, పత్తి విత్తనాలు 
సహజాహారం ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ఖరీఫ్‌ సీజన్‌ కోసం సూటి రకం పత్తి(సూరజ్‌), సంప్రదాయ వరి, కూరగాయల దేశవాళీ విత్తనాలను సికింద్రాబాద్‌ తార్నాకలోని సహజ ఆహారం స్టోర్‌లో రైతులకు అందుబాటులో ఉంచింది. గత సీజన్‌లో సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తయిన ఈ సంప్రదాయ విత్తనాలు 90% మొలక, 80% ఏకరూపతతో ఉంటాయని సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ డా. రామాంజనేయులు తెలిపారు. బచ్చలికూర, బీర, బెండ, కాకర, వంగ, చెట్టుచిక్కుడు, మిరప(తేజ), గోరుచిక్కుడు, పత్తి(సూరజ్‌), చిక్కుడు, మునగ, గోంగూర రెడ్, మెంతి, పాలక్, గుమ్మడి, కంది, పొట్లకాయ, సొరకాయ, వరి (గోవింద్‌భోగ్, కాలాభాత్, సుగంధి, పరిమళ సన్న, జింక్‌ రైస్‌ వంటి 16 దేశవాళీ రకాలు) అందుబాటులో ఉన్నాయి. వివరాలకు.. సహజాహారం స్టోర్, తార్నాక, సికింద్రాబాద్‌. ఫోన్లు: 81439 47491, 83007 83300. విత్తనాలను నేరుగా కొనుగోలు చేయవచ్చు. దూరప్రాంతాల రైతులు ఫోన్‌ ద్వారా ఆర్డర్‌ చేసి తెప్పించుకోవచ్చు. 

10న సిరిధాన్యాలు, కూరగాయల సాగుపై శిక్షణ
సేంద్రియ పద్ధతుల్లో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగుపై కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌ సికింద్రాబాద్‌లో ఈ నెల 10(ఆదివారం– ఉ. 9.30 గం. నుంచి)న రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసా యం గ్రూప్‌ ఆధ్వర్యంలో ఉస్మాని యా యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో ప్లాటినం జూబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌ ఎస్‌ 6 రూమ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. హాజరుకాదలచిన వారు క్రాంతి(94903 87574, 80748 47144), శ్యాంరెడ్డి (84640 76429), పాపిరెడ్డి (85019 04201)లను సంప్రదించి రిజిస్టర్‌ చేసుకోవాలి. ప్రవేశం మొదట రిజిస్టర్‌ చేసుకున్న 500 మంది రైతులకు మాత్రమే. 

10న సేంద్రియ సేద్యంపై డా. నారాయణరెడ్డి శిక్షణ 
కర్ణాటకకు చెందిన సుప్రసిద్ధ సేంద్రియ వ్యవసాయ నిపుణుడు, సీనియర్‌ రైతు డాక్టర్‌ ఎల్‌. నారాయణరెడ్డి ఈ నెల 10(ఉ.10గం.–సా. 4 గం.)న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై తెలుగులో శిక్షణ ఇస్తారు. సేంద్రియ వ్యవసాయంపై తొట్టతొలిసారిగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్, లయన్స్‌క్లబ్, పతంజలి యోగ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం జరగనుంది. బెంగళూరు రూరల్‌ దొడ్డబళ్లాపూర్‌ సమీపంలో గత 40 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న డా. నారాయణరెడ్డి ‘లీసా ఇండియా’ పత్రికకు గౌరవ సంపాదకుడుగా ఉన్నారు. సేంద్రియ రైతుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆయన వద్దకు దేశ విదేశాల నుంచి రైతులు వచ్చి శిక్షణ పొందుతూ ఉంటారు. కొద్ది ఏళ్లుగా చోహాన్‌ క్యు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను కూడా అనుసరిస్తున్నారు. వివరాలకు.. డాక్టర్‌ పి.బి.ప్రతాప్‌కుమార్‌– 94401 24253

కూరగాయలు, ఔషధ మొక్కలపై 41 రోజుల ఉచిత శిక్షణ
దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్‌ క్యూ సహజ సాగు, చింతల వెంకటరెడ్డి(సీవీఆర్‌) మట్టి ద్రావణం వాడే పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలతోపాటు.. కలబంద, అశ్వగంధ, నిమ్మగడ్డి, కాశీగడ్డి తదితర ఔషధ, సుగంధ మొక్కల సాగు, శుద్ధి, విక్రయాలపై ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో జూలై 1 నుంచి 41 రోజుల పాటు పొలంలో ఆచరణాత్మక ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు న్యూలైఫ్‌ ఫౌండేషన్‌(హైదరాబాద్‌) వ్యవస్థాపకుడు శివశంకర్‌ షిండే తెలిపారు. కనీసం పదో తరగతి చదివిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. యాదాద్రి, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో శిక్షణ ఇస్తామని, శిక్షణతోపాటు భోజన, వసతి ఉచితమే. ఆసక్తిగలవారు పేరు, విద్యార్హత, వయస్సు, చిరునామా తదితర వివరాలను ఈ నెల 11వ తేదీ లోగా 70133 09949, 81210 08002 నంబరుకు వాట్సప్‌ లేదా టెలిగ్రామ్‌ ద్వారా మాత్రమే మెసేజ్‌ పంపవలసి ఉంటుంది..

9న సేంద్రియ/ప్రకృతి సేద్యంపై అవగాహన సదస్సు 
రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంపై హైదరాబాద్‌ లక్డీకపూల్‌  రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో ఈనెల 9(శనివారం)న ఉ.10 గం. నుంచి సా. 4 గం. వరకు అవగాహన సదస్సు జరగనుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరప, పత్తి, కూరగాయలు, అరటి, చిరుధాన్యాల సాగు, కషాయాలు/ద్రావణాలు, జీవన ఎరువులు, వేస్ట్‌ డీకంపోజర్‌ వినయోగంపై అవగాహన కల్పిస్తారు. సీనియర్‌ రైతులు ఎం.సి.వి. ప్రసాద్, కొక్కు అశోక్‌కుమార్, లావణ్యారెడ్డి, శరత్, అరుసుమిల్లి కృష్ణ, పడాల గౌతమ్, కె.రామచంద్రం అవగాహన కల్పిస్తారు. వివరాలకు 98493 12629, 96767 97777 నంబర్లలో సంప్రదించవచ్చు. సదస్సుకు హాజరయ్యే రైతులకు తలా ఒక వేస్ట్‌ డీకంపోజర్‌ బాటిల్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top