దస్తగిరి కుటుంబానికి దిక్కెవరు?

Farmers Suicide on debt burden - Sakshi

నివాళి

పంటల సాగుకు చేసిన అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం దుర్భరమైన జీవితం గడుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడి భార్య, నలుగురు పిల్లలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండల పరిధిలోని కంబదహాల్‌ గ్రామానికి చెందిన దస్తగిరి(40) అప్పుల బాధతో పొలంలో పురుగుల మందు తాగి 2016 సెప్టెంబర్‌ 12న మృతి చెందారు.  ముగ్గురు కూతుళ్లను, ఒక కుమారిడిని పోషించుకునేందుకు అతని భార్య దానమ్మ తీవ్ర అవస్థలు పడుతున్నారు.

దస్తగిరికి రెండెకరాల పొలముంది. దీనికి తోడు మరో ఐదెకరాలను ఎకరా రూ. 30 వేలకు కౌలుకు తీసుకుని 2014, 2015, 2016 సంవత్సరాలలో వ్యవసాయం చేశాడు. ఏడెకరాలలో పత్తి పంట సాగు చేశారు. పంటల సాగుకు ఏడాదికి రూ. లక్ష అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. వచ్చిన అరకొర దిగుబడులతో రైతు దస్తగిరి కొంతమేర అప్పులు తీర్చుతూ వచ్చాడు. అయితే పంటల సాగు, ఇంటి నిర్మాణంకు, ఇద్దరు కూతుళ్ల వివాహానికి ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రూ. 3 లక్షలు అప్పు చేశాడు. అదేవిధంగా సి.బెళగల్‌ని బంగారు అంగళ్ళ దగ్గర రెండవ కూతురు లుదియాకు చెందిన రెండు తులాల బంగారాన్ని తాకట్టుపెట్టి రూ. 46 వేలు అప్పు తీసుకున్నాడు.

తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర, గ్రామస్తుల దగ్గర పంటలకు, కుటుంబ పోషణకు దస్తగిరి రూ. 6 లక్షల వరకు అప్పులు చేశాడు. చేసిన అప్పలు ఎలా చెల్లించాలోనని మధనపడేవాడని భార్య దానమ్మ, కుమార్తెలు తెలిపారు. దానమ్మ కూలి పనులు చేసుకుంటూ నలుగురు పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. కుమారుడు దీవనరాజు కోడుమూరులోని ఎస్సీ వసతి గృహంలో వదిలారు). అయితే రైతు చనిపోయి రెండేళ్లు పూర్తయినా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ప్రభుత్వం తమను కరుణించి పరిహారం అందజేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితురాలు దానమ్మ కోరుతోంది.

– బి.గోవిందు, సాక్షి రిపోర్టర్, సి.బెళగల్, కర్నూలు జిల్లా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top