సహనమే సగం బలం | Sakshi
Sakshi News home page

సహనమే సగం బలం

Published Sun, Jan 28 2018 1:46 AM

Endurance is half strengthfa - Sakshi

అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యానికి ఓ రాజు. ఆ రాజుకి ఒకటే దిగులు. దానిని ఎవరితోనూ చెప్పుకోలేక నానా అవస్థ పడుతున్నాడు. లోలోపల ఒత్తిడికి లోనవుతున్నాడు. రాజు ముఖం చూడగానే ఆయన ఏదో సమస్యతో ఒత్తిడికి లోనైనట్టు మంత్రి గ్రహించాడు. కానీ అడిగితే కోపగించుకుంటాడేమో అని మంత్రి అనుమానం. అయినా ఎలాగైనా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఓ ఎత్తుగడ వేశాడు. ‘‘మీరు వేటకు వెళ్ళి చాలా కాలం అయినట్టుందే’’ గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు మంత్రి. ‘‘అవును.

కానీ ఇప్పుడు నేను వేటాడే మానసికస్థితిలో లేను’’ చెప్పాడు రాజు. ‘‘మనసు సరిగ్గా లేనప్పుడే ఉత్సాహం తెచ్చుకోవడానికి వేటాడాలి రాజా. దారిలోనే మీ గురువుగారి ఆశ్రమం. ఆయనను కూడా ఓ సారి దర్శించుకుందాం. బయలుదేరండి.’’ చెప్పాడు మంత్రి. ‘‘గురువు’’ అనే మాట వినడంతోనే రాజులో ఆశ చిగురించింది. ఆయనను కలిస్తే ఆయన చెప్పే మాటలతో తన దిగులుకు సమాధానం లభిస్తుందేమో అని రాజు అనుకున్నాడు. రాజుగారి గురువు ఓ జెన్‌ సాధువు. ఆయన ఊరు చివర ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తున్నారు.

ఆయన దగ్గర కొందరు శిష్యులు కూడా ఉన్నారు. రాజు రాక తెలియడంతోనే ఆశ్రమ శిష్యులు ఎదురెళ్ళి రాజుగారికి స్వాగతం పలికారు. రాజు తిన్నగా గురువుగారి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. తన మనసులోని సమస్యను చెప్పుకున్నాడు. ఎలా పరిష్కరించుకోవాలనుకున్నాడో కూడా చెప్పాడు. అన్నీ అయిన తర్వాత రాజు అడిగాడు –‘‘మీరేమనుకుంటున్నారు’’ అని. సాధువు ఏమీ చెప్పలేదు. కొన్ని నిముషాలు మౌనంగా గడిచాయి. ‘‘నువ్వు బయలుదేరవచ్చు’’ అన్నారు. రాజు ముఖంలో కోపం గానీ నిరాశ గానీ కనిపించలేదు. ఉత్సాహం కనిపించింది. బయలుదేరాడు. తన గుర్రం ఎక్కాడు. అది చూసిన మంత్రి సాధువు దగ్గరకు వెళ్ళి ‘‘రాజుగారి సమస్యను ఎలా పరిష్కరించారు’’ అని అడిగాడు.

‘‘మీ రాజు చాలా తెలివైనవాడు. అతనే తన సమస్యను పరిష్కరించుకున్నాడు. నేను చేసిందేమీ లేదు. అతను తన సమస్యలన్నీ విడమరిచి ఒకటి తర్వాత ఒకటి వరుసగా చెప్తుంటే ఓపికగా విన్నాను. అంతేకాదు, ఆయన దగ్గరకు జరిగి భుజం మీద వాలి విన్నాను. వెన్ను తట్టాను. అంతే....’’ అన్నారు. సాధువు మౌనంగా విన్న క్రమంలో ఆయన పాటించిన సహనాన్ని గమనించి దాన్ని రాజు పాటించాలనుకున్నాడు. అదే తన సమస్యలకు పరిష్కారం అని అనుకున్నాడు. అంతకన్నా మరొకటి లేదని గ్రహించాడు కనుకే రాజు తన సమస్యకు జవాబు దొరికిందన్న ఆనందంతో వేటకు వెళ్ళాడు.

– యామిజాల జగదీశ్‌

Advertisement
Advertisement