ఒక్క రాత్రిలో వేయి పడగలు

Doctor Kapilavai Lingamurthy Salagramam Book - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

మా బడిలో తరగతుల ముందు విశాలమైన ఖాళీ స్థలం, తూర్పున రెండవ గదిముందు ఒక చేదబావి, బావి ప్రక్కన ఒక తుత్తురు చెట్టు ఉండేది. దప్పి వేసిన పిల్లలు దాని దగ్గరకు వచ్చి నీరు చేదుకుని త్రాగేవారు. బావికి దూరంగా మరో తుత్తురుచెట్టు, దానికి ఉత్తరంగా పెద్ద అంజూర, ఇంకా బొప్పాయి చెట్లు ఉండేవి. మేము గంట అయి తరగతి మారే అపుడా తుత్తురు చెట్ల పండ్లకెగబడేవారం.

మా గదుల ముందు గల ఖాళీస్థలంలో కూర మడులకు కావలసినంత స్థలముండేది. ఇద్దరం లేదా ముగ్గురం కలిసి ఒక్కొక్క మడిని తీసుకుని చదును చేసి బాగా త్రవ్వి అందులో ఎరువు తెచ్చి వేసేవారం. కూరగాయల విత్తనాలు ఉపాధ్యాయులే ఇచ్చేవారు. మే దినదినం లేదా రెండు దినాలకొక పర్యాయం నీరు పోసేవారం. మడులు బాగా పెరిగిన పిమ్మట ఉపాధ్యాయులు తనిఖీ చేసి ఎవరి మడి బాగా పెరిగితే వారిని మెచ్చుకునేవారు. తర్వాత కోసిన కూరగాయలు సగం పంతులు గారికి ఇచ్చి, సగం మేం ఇండ్లకు పట్టుకుని వెళ్లేవారం. మా అమ్మమ్మగారింటిలో ఎప్పుడూ పేలప్పిండి రెడీగా ఉంచేది. ఆమె ఉదయం నీటిలో ఇంత బెల్లం కూడా నానవేసేది. ఆకలి వేసినవారా నీటిలో పేలప్పిండిని కలుపుకొని ఒక గ్లాసు త్రాగేవారు.

మొలకమామిడిలో ఉన్నప్పుడే కిశోర్‌బాబు జననం జరిగి మా శ్రీమతి అత్తవారింటిలోనే ఉండేది. అందుచే విశారద పరీక్షకు తయారీ ప్రారంభించాము. ఆనాడు దానికి సిలబస్‌లో బాలవ్యాకరణమున్నది. పరీక్షలు వ్రాయడానికి నాగర్‌ కర్నూలు వచ్చినాము. రెండు పరీక్షలు నడిచినవి. చివరి పరీక్షకు విశ్వనాథ వారి వేయి పడగలు నవల ఉన్నది. ఆ పుస్తకము నాకు దొరకక చదవలేదు. నాతోబాటు పరీక్ష రాయడానికి వచ్చిన దాసుపల్లి కృష్ణారెడ్డి గారి దగ్గర వేయి పడగలు ఉండేది. ఆయన్ను ‘మీరు చదివారా’ అని అడిగినాను. ‘లేదు’ అన్నాడు. ‘అయితే ఈ రాత్రికి ఇవ్వండి. చదివి మీకు మళ్లీ ఉదయమే ఇస్తాను’ అన్నాను. కృష్ణారెడ్డి ‘ఒక్కరాత్రిలో ఏం చదువుతావు? ఇది చదివితే నీ బుర్రలో ఉన్నదంతా పోతుంది’ అన్నాడు.

అయినా నవల తీసుకుని రాత్రి 8 గంటలకు టీ తాగి ఎక్కడా విడవకుండా తెల్లవారి నాలుగు గంటల వరకు చదవడం పూర్తి చేశాను. నాకు ఏ పుస్తకమైనా పీఠిక నుండి చదవటం అలవాటు. దానికి పీఠిక లేదు.
ఒకటి రెండు ఘట్టాలు పునరావృతం చేసుకొని పుట సంఖ్యలు గుర్తు పెట్టుకున్నాను. కథ అన్నా కన్నుల ముందు తిరుగుతూనే ఉంది. గిరిక, ధర్మారావుల గురించి ప్రశ్నలు వచ్చినవి. దాసుపల్లి కృష్ణారెడ్డి ఒక్క రాత్రిలో ఎలా చదివినావని ఆశ్చర్యపోయాడు. ఆ సంవత్సరం నేను, వెంకటనారాయణ, కృష్ణారెడ్డి అందరం విశారద పరీక్షలో ఉత్తీర్ణులయ్యాము. ఈ విశారద పరీక్షనే నా ఉద్యోగ ప్రవేశానికి నాంది అయింది. (నాగర్‌కర్నూలు జాతీయ పాఠశాలలో కపిలవాయి తెలుగు పండితునిగా ఉద్యోగం చేశారు.)

(డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి ఆత్మకథ ‘సాలగ్రామం’ నుంచి; ప్రచురణ: హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్, అడుగు జాడలు పబ్లికేషన్‌; పేజీలు: 208; వెల: 150; ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top