భాగ్యరాజ్‌ చూపిన స్త్రీలు

Director Bhagyaraj Shown Ladies Importance In His Movies - Sakshi

కె.భాగ్యరాజ్‌ తన గురువు కె.భారతీరాజా తీసిన ‘ఎర్రగులాబీలు’ సినిమాకు కథ అందించాడు. ఆ సినిమా సూపర్‌హిట్‌ అయ్యింది. స్త్రీల వంచన వల్ల మోసపోయిన మగవారు ఆ స్త్రీల మీద పగ తీర్చుకోవడానికి ‘సైకో’లుగా మారే కథ ఇది. తమిళనాడులో 1960ల నాటి సైకో కిల్లర్‌ రమణ్‌ రాఘవ్‌ను ఈ కథకు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. ఎర్రగులాబీలలో ఒక సవతి తల్లి, కాలేజీ అమ్మాయి, గృహిణి మగవారిని వంచించడం కనిపిస్తుంది.

భాగ్యరాజ్‌ తీసిన మరో ముఖ్యమైన సినిమా ‘అంద ఏళు నాట్కల్‌’ (ఆ ఏడు రోజులు) స్త్రీ హృదయానికి, సంప్రదాయానికీ మధ్య జరిగే సంఘర్షణను చూపిస్తుంది. ఈ సినిమాలో తను ప్రేమించిన అబ్బాయిని చేసుకునే వీలు లేక అంబిక మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. కానీ ఆ పెళ్లి నుంచి బయటపడాలనుందని తన ప్రియుణ్ని పెళ్లి చేసుకోవాలని ఉందని శోభనం నాడే భర్తకు చెబుతుంది. ఆ భర్త ఆ ప్రియుణ్ణి వెతుకుతాడు. కానీ ఆ ప్రియుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించడు. ఆమె పట్ల తనకు చాలా ప్రేమ ఉన్నా భారతీయ సంప్రదాయంలో తాళికి చాలా విలువ ఉందని, ఒకసారి తాళి కట్టించుకున్న స్త్రీ మరొకరి సొంతం కాజాలదని చెప్పి వెళ్లిపోతాడు.

ఈ సినిమా తెలుగులో ‘రాధా కల్యాణం’గా రీమేక్‌ అయ్యింది. ఈ సినిమాయే ఆ తర్వాత ‘మౌనరాగం’, ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ సినిమాలకు ఆధారం అయ్యింది. ‘చిన్నవీడ్‌’ సినిమా ‘స్త్రీ సహనాన్ని’ చూపిస్తుంది. ఇందులో హీరోగా వేసిన భాగ్యరాజ్‌ పెళ్లయిన తర్వాత తన భార్య స్థూలకాయంతో ఉందని మరొకరితో సంబంధం పెట్టుకుంటాడు. ఈ సంగతి భార్యకు తెలుస్తుంది. అయితే ఆమె అతనితో ఘర్షణకు దిగకుండా, అతనితో వేరు పడకుండా ఎంతో ఓపికగా ఉండి మనసు మార్చుకుంటుంది. ఈ సినిమాయే కమలహాసన్‌ ‘సతీ లీలావతి’గా, నిన్న మొన్న అల్లరి నరేశ్‌ ‘కితకితలు’గా వచ్చింది.

భాగ్యరాజ్‌ తీసిన ‘ముందానై ముడిచ్చు’ సినిమా తెలుగులో ‘మూడుముళ్లు’గా వచ్చింది. ఇందులో భార్య చనిపోయి ఒక బిడ్డకు తండ్రిగా ఉన్న చంద్రమోహన్‌ ఒక పల్లెటూళ్లో స్కూల్‌ టీచర్‌గా పని చేస్తుంటాడు. రెండో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన భార్య సవతి తల్లిగా తన బిడ్డను ఏ బాధలు పెడుతుందోనని పెళ్లే చేసుకోనంటాడు. కానీ అతని మీద  ప్రేమ పెంచుకున్న ఆ ఊరి అమ్మాయి రాధిక అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చివరకు అతని కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేసుకోవడానికి కూడా సిద్ధమైపోతుంది. ఆమెను హాస్పిటల్‌లో నిస్సహాయ స్థితిలో చూసిగానీ ఆమె ప్రేమను నమ్మడు చంద్రమోహన్‌.

‘చిన్నరాజా’ సినిమాలో సవతితల్లి ఆస్తి కోసం భర్త నడుములు విరిగేలా చేస్తుంది. సవతి కొడుకును ఉత్త వెంగళాయిగా పెంచుతుంది. చివరకు పాలలో విషం కలిపి అతడి వారసుణ్నే చంపాలనుకుంటుంది. ఆ సంగతి తెలిసినా సవతి తల్లి మీద నమ్మకంతో ఆమె కళ్లెదుటే ఆ పాలు తాగుతాడు భాగ్యరాజ్‌. అతను చావుబతుకుల్లోకి వెళితే తప్ప ఆ సవతి తల్లిలో పరివర్తన రాదు. ఈ సినిమా తెలుగులో ‘అబ్బాయిగారు’గా వచ్చింది. ‘సుందరకాండ’ సినిమాలో కేన్సర్‌ ఉన్న అమ్మాయి సుమంగళిగా చనిపోవాలని అనుకుంటుంది. వివాహితుడైనప్పటికీ లెక్చరర్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆమె చనిపోతుందని తెలిసి ఆ లెక్చరర్‌ భార్య ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని భర్తతో చెబుతుంది. అయితే ఈలోపే ఆ అమ్మాయి మరణిస్తుంది.

భాగ్యరాజ్‌ సినిమాలలో హీరోను హీరోయిన్లు యథాతథంగా స్వీకరించాల్సిన స్థితి ఉంటుంది. అతడి ‘డార్లింగ్‌ డార్లింగ్‌’లో హీరోయిన్‌ శ్రీమంతురాలు, హీరో వాచ్‌మన్‌ కొడుకు. ఆమెకు అతని మీద ఏ అభిప్రాయమూ లేకపోయినా చిన్నప్పటి నుంచి ఆమెను ఆరాధిస్తున్న హీరో తన ఆరాధనను తెలిసేలా చేసి పెళ్లి చేసుకుంటాడు. ‘రాసకుట్టి’ సినిమాలో హీరో పల్లెల్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ డాక్టర్‌ గెటప్‌లో, లాయర్‌ గెటప్‌లో ఫొటోలు దిగి కాలక్షేపం చేస్తుంటాడు. అతడు విద్యాధికుడు అని నమ్మిన హీరోయిన్‌ చివరకు ఆ మోసం తెలిసి నిరాకరిస్తుంది. కానీ హీరో ఇలాంటి షోకిల్లారాయుడైనా హీరోయిన్‌ చివరకు అతణ్ణే పెళ్లి చేసుకోక తప్పని విధంగా హీరో క్యారెక్టర్‌ ఆ తర్వాత తీర్చిదిద్ద బడుతుంది.

ఈ సినిమా హిందీలో ‘రాజాబాబు’గా రీమేక్‌ అయ్యి సూపర్‌ హిట్‌ అయ్యింది.మొత్తంగా చూస్తే భాగ్యరాజ్‌ పితృస్వామ్య సంస్కృతిలో సగటు పురుషుడు స్త్రీని ఎలా చూస్తాడో చూడాలనుకుంటాడో అలా చూపడానికే ఎక్కువ ఇష్టపడ్డాడని అనిపిస్తుంది. అదే భావజాలం స్త్రీలకూ నూరిపోయబడ్డది కాబట్టి అతని సినిమాలన్నీ హిట్‌ అయ్యాయి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top