
తవ్వితీసిన శవానికి పట్టాభిషేకం
పద్నాలుగో శతాబ్దంలో పోర్చుగల్ దేశానికి నాలుగో అఫాన్సో రాజుగా ఉండేవాడు.
పీఛేముడ్
పద్నాలుగో శతాబ్దంలో పోర్చుగల్ దేశానికి నాలుగో అఫాన్సో రాజుగా ఉండేవాడు. అఫాన్సో రాజావారికి డాన్ పెడ్రో (ఒకటో పీటర్) అనే పుత్రరత్నం ఉన్నాడు. ప్రకృతి సహజధర్మం ప్రకారం రాజావారి పుత్రరత్నానికి కూడా వయసొచ్చింది. వయసొస్తే ఏ కుర్రాడైనా ఊరుకుంటాడా? రాకుమారుడు పెడ్రో కూడా అంతే! ప్రేమలో పడ్డాడు. అతగాడు ఏ రాచకన్నెనో వలచి ఉంటే ఇంత కథ జరిగేది కాదు గానీ, ఒక నిషిద్ధ వర్గానికి చెందిన ఇనెస్ పిరాస్ డి క్యాస్ట్రో అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగాడు. ఆమెనే పెళ్లాడాలనుకున్నా, తండ్రిచాటు బిడ్డ కావడంతో ఆ పని చేయలేకపోయాడు. అఫాన్సో రాజావారికి కొడుకు తీరు ఏమాత్రం నచ్చలేదు. కొడుకు ప్రేమను చంపడం తన వల్లకాదని ఆయనగారికి అర్థమైపోయింది. కొడుకు ప్రేమను చంపడం అసాధ్యమైనా, అతగాడి ప్రియురాలిని అంతం చేయడం పెద్ద కష్టమైన పనేమీ కాదని కూడా ఆయనగారి ‘రాచ’తెలివికి తట్టింది.
రాజు తలచుకోవాలే గానీ, ఎన్ని మొండేల నుంచి వాటి తలకాయలు వేరుపడవు? మూడో కంటికి తెలియకుండా ఈ పనిని నిర్వర్తించే బాధ్యతను ముగ్గురు నమ్మినబంటులకు అప్పగించారు. వారు అత్యంత రాజభక్తితో, రాకుమారుడి సామాన్య ప్రియురాలిని పరలోకానికి సాగనంపారు. రాకుమారుడు పెడ్రోకు శోకక్రోధాలు ఏకకాలంలో కలిగినా, అప్పటికి ఏమీ చేయలేని నిస్సహాయత. కాలం గడిచి, అఫాన్సో రాజావారు కాలధర్మం చెందారు. తండ్రి మరణంతో పెడ్రో పట్టాభిషిక్తుడయ్యాడు. గద్దెనెక్కడమే తడవుగా తన ప్రియురాలి హత్యపై దర్యాప్తుకు హుకుం జారీ చేశాడు. ముగ్గురు హంతకుల్లో ఒకడు తప్పించుకుపోయినా, మిగిలిన ఇద్దరూ రాచభటుల చేతికి చిక్కారు. వాళ్లిద్దరికీ గుండెలు పెకలింపజేసి మరణశిక్ష విధించాడు. తర్వాత తన ప్రియురాలి సమాధిని తవ్వించి, ఆమె శవాన్ని బయటకు తీయించాడు. రాజ లాంఛనాలతో ఆ శవానికే రాణిగా పట్టాభిషేకం జరిపించి, సభాసదుల చేత గౌరవవందనం చేయించాడు.