డైనింగ్‌ టేబుల్‌

D Venkata Ramaiah Dining Table Story - Sakshi

కథాసారం

ఎండ నిప్పులు చెరుగుతోంది. నలుగురు– నిప్పులు పరిచిన ఆ రోడ్డుమీద ఒక పెద్ద డైనింగ్‌ టేబిల్‌ మోసుకుపోతున్నారు. తలమీద గుడ్డలు చుట్టగా చుట్టి, టేబిల్‌ తలకిందుచేసి, నలుగురూ నాలుగు మూలలు ఎత్తుకున్నారు. బరువు జాగ్రత్తగా బాలెన్స్‌ చేస్తూ నడుస్తున్నారు. ఆ నడక లయ తప్పినా, నలుగురిలో ఎవరు బెసిగినా టేబిల్‌ పడిపోయే ప్రమాదముంది. టేబిల్‌ వెడల్పు తక్కువగా, పొడుగెక్కువగా వుంది. నాలుగు మూలలా ఏటవాలుగా వున్న టేబిల్‌ కోళ్లు ఎండలో ధగధగా మెరుస్తున్నాయి. ఆ టేబిల్‌ మీద కనీసం ఎనిమిదిమంది తేలిగ్గా భోంచేయొచ్చు. ముందువేపు కుడికొమ్మున కాసిన వీరయ్యకి అలుపొచ్చింది. చెప్పుల్లేని కాళ్లు ఎండకి ఉడుకుతున్న తారురోడ్డుకి అంటుకుపోతున్నాయి. తెగిపోయిన చెప్పులు కుట్టించుకుందామంటే పొద్దున పావలా అడిగారు. పదిహేను పైసలిస్తానన్నాడు. ఎవరూ కుట్టమన్నారు. చేసేది లేక చెప్పులింట్లో పారేసొచ్చాడు. ‘‘ఏందిరా ఈరయ్యా తింగిరి నడక నడుత్తున్నావ్‌! బల్లపడకొడతావా ఏంటి కొంపదీసి,’’ అన్నాడు వెనకపక్క ఎడమ మూలనున్న పానకాలు. ‘‘బల్ల కిందడితే యింకేమన్నా వుందా? బల్లకి గోరంత గీతడిందా సావుకారు సంపేత్తాడు,’’ అని హెచ్చరించాడు వీరయ్యకి ఎడంపక్కనున్న సుబ్బడు.

వీరయ్య మాట్టాడలేదు. ఈ ఎండ అతనికేమీ లెక్కలోనిది కాదు. కాని మండుతున్న ఎండకి తోడు నెత్తినున్న బరువుకి తోడు కడుపులో ఆకలి మండుతోంది. నిన్న పొద్దుననగా తిన్న కూడు. నిన్న కూలేమీ దొరకలేదు. రాత్రి మిగిలిన గిద్దెడు నూకల్తోనూ కాసిన జావ పిల్లలకే సరిపోలేదు. తనూ పెళ్లామూ పస్తే. పొద్దు పొడవగానే లేచి బయల్దేరి తిరగ్గా తిరగ్గా యిప్పటికి కూలి దొరికింది.‘‘ఏందెహె పెళ్లినడకలు నడుత్తున్నారు! ఇట్టా అయితే, అయినట్టే. యింకా అరమైలు దూరముంది, నడవండి, నడవండి!’’ అని కసిరాడు వెనకవేపు కుడికొమ్ము కాసిన గంగరాజు.‘‘నన్నేం చెయ్యమంటావురా, ఈరిగాడు పెళ్లినడకలు నడుత్తున్నాడు. ఆడు అడుగెయ్యంది నేనేం సెయ్యను,’’ అని గునిశాడు సుబ్బడు. అక్కడికీ వీరయ్య ఏమీ మాట్లాడలేదు. తల్లోంచి కారుతున్న చెమట తుడుచుకుంటూ, రొప్పుతూ ఉమ్మూసి నడక పెంచాడు. దాంతో మిగతా ముగ్గురు కూడా వేగం పెంచారు. ‘‘అద్గదీ అట్టుండాలి. ఇప్పుడు ఏడందుకుంది ఈరయ్యమావకి,’’ అని సరసమాడాడు పానకాలు.‘‘సరేగానొరే ఈ టేబిల్‌ కరీదెంతుంటదంటా? వంద రూపాయలుంటందా?’’ అనడిగాడు గంగరాజు. ‘‘ఓరి ఎర్రిమొకమా, వంద రూపాయలకి ఒక కోడు రాదు. ఈ కర్రేంటనుకున్నా– రోజువుడ్డు– అయిదొందలకి పైస తక్కువుండదు; బొరువు సూడరాదూ; కర్రలాగుందా, ఇనుము’’ అన్నాడు సుబ్బడు, తన తెలివితేటల్ని ప్రదర్శిస్తూ.

‘‘ఓర్నాయనో, అయిదొందలే! కూడుదినే బల్లకి యింత కరుసెందుకురా!’’ గంగరాజు. ఈసారి పానకాలందుకున్నాడు– ‘‘ఈ టేబులు సేయించిందెవుడనుకున్నావ్‌. నరిసిమ్మం. ఆడికి నాలుగు పేక్టరీలుండయ్‌. సిటీ మొత్తమ్మీద ఆణ్ణి మించిన సావుకారు లేడు.’’ ‘‘ఎంత సావకారైతే మటుకి, ఆడు తినేదీ అన్నమేగా! ఎండీ బంగారం తినడుగా!’’అన్నాడు గంగరాజు. ‘‘ఓరి పిచ్చెదవా, అసుమంటోళ్లు ఏం తింటారో నీకేం తెలుసురా! ఆళ్లింట్లో ఒక పూట తినే తిండి కరీదెడితే నీకూ, నాకూ నెలరోజులు గడుత్తుంది. ఎండి తిన్నా, బంగారం తిన్నా ఆళ్లే తినాల. మనమేటి తింటాం; మట్టి!’’అన్నాడు సుబ్బడు. పానకాలు వేదాంతం మొదలెట్టాడు. ‘‘ఆళ్లు తినేదాళ్లు తింటారు. మనం తినేది మనం తింటాం. బెమ్మదేవుడు ఆళ్ల మొకానట్టా రాత్తే, మన మొకానిట్టా రాశాడు.’’ వీరయ్యకి ఈ గొడవలేం నచ్చలేదు. ‘‘ఎక్కడ్రా ఈ నరసిమ్మం యిల్లు? గంట నుంచీ నడుత్తున్నాం, అయిపులేదే,’’ అన్నాడు చిరాగ్గా. ‘‘బయల్దేరి పావుగంట కాలేదు, గంటలాగుందేరా నీకు? ఏంటివ్వాళ మరీ జావకారి పోతన్నావ్‌?’’ అన్నాడు పానకాలు హేళనగా. వీరయ్య మారు మాట్టాడలేదు. ‘నిజంగా సుబ్బడన్నట్టు ఈ బల్ల ఇనుములాగే వుంది, ఇంత బరువుందేంటి,’ అనుకున్నాడు.

మొన్నొకనాడు అన్నాలు తినేవేళ– కోళ్లూడిపోయిన పీటచెక్క కోసమూ, చిరిగిన చాపముక్క కోసమూ, పిల్లలు నలుగురూ పోట్లాడుకుంటే తిక్కరేగి చావగొట్టాడు. కాఫీ హోటల్లో బల్లమీద కాఫీ టిఫినూ తీసుకోడమేగాని– యిట్టాంటి బల్లమీద తనెప్పుడూ భోంచేసి ఎరగడు. సెంటరొచ్చింది. నాలుగువేపుల్నించి బస్సులూ, కార్లూ, రిక్షాలూ, సైకిళ్లూ వస్తున్నాయి. పోలీసు చెయ్యడ్డం పెట్టి ఆపేశాడు, ట్రాఫిక్‌ క్లియరయ్యే వరకూ రోడ్డు దాటటానికి వీల్లేకపోయింది. నిలబడితే మరీ బరువెక్కువైనట్టుంది. సెంటర్‌ దాటి కొంతదూరం నడిచి, కుడిపక్క వీధిలోకి మళ్లాక అప్పుడొచ్చింది నరసింహం యిల్లు. ‘హమ్మయ్య!’ నిట్టూర్చాడు వీరయ్య. పానకాలు చెప్పినట్టు– నరసింహం ఆ సిటీలోకల్లా ధనవంతుడు కాకపోయినా, బాగా ధనవంతుడే. గేటుకీ యింటికీ వందగజాల దూరముంది. పెద్ద మేడ. పోర్టికోలో ఆగి మెల్లగా టేబుల్‌ దింపారు. తలమీద వెయ్యిటన్నుల బరువు తొలగించినట్టయింది వీరయ్యకి. తల మీద చుట్టిన తుండుగుడ్డ తీసి మొహం తుడుచుకున్నాడు. లోపల్నించి నౌకరొచ్చి, ‘‘టేబుల్‌ లోపలికి తెమ్మంటన్నారయ్యగారు,’’ అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా. వీరయ్యకి కోపమొచ్చింది. ‘లోపలికి తేవాల్సిన పని మాకులేదు; మీరే పెట్టుకోండి,’ అందామనుకున్నాడు. కాని అప్పటికే మిగతా ముగ్గురూ తలొక పక్కనా పట్టుకుని టేబుల్‌ మెల్లగా లేపారు. ‘‘అట్టా నిలువు గుడ్డేసుకుని సూత్తావేంటి, రాయెహె.’’ సుబ్బడు.

టేబుల్‌ ఏటవాలుగా పట్టుకుని అతి జాగ్రత్తగా గుమ్మాలకి తగలకుండా ఒక పెద్ద హాలు, నాలుగు గదులు దాటించి, భోజనాల గదిలోకి చేర్చారు. ఆ యిల్లూ ఆ రంగులూ ఆ సోఫాలూ ఆ సామానూ చూస్తే వీరయ్యకి కళ్లు తిరిగిపోయాయి. టేబిల్‌ చుట్టూ అందమైనవి, సరికొత్తవి ఎనిమిది కుర్చీలు కూడా అమర్చారు. ఇప్పటికిప్పుడు ఈ కుర్చీలో కూకుని, ఈ బల్లమీద మాంచి తిండెట్టుకుని, కడుపునిండా తింటే ఎంత బాగుంటది– అనుకున్నాడు వీరయ్య. డ్రాయింగ్‌ రూమ్‌లో సోఫాలో జారగిలబడి, చుట్ట తాగుతూ కూర్చున్న నరసింహం– సిల్కు లాల్చీ జేబులోంచి నాలుగు రూపాయి కాగితాలు తీసి సుబ్బడి చేతికిచ్చాడు. సుబ్బడు తెల్లబోయి, ‘‘ఇదేంటి దొరా నాల్రూపాయలా!’’ అన్నాడు. ‘‘అవున్రా! నలుగురికీ నాలుగు. చాలదా ఏం?’’ అని ఉరిమాడు నరసింహం. సుబ్బడేమీ బదులు చెప్పలేకపోయాడు. ‘‘కనీసం మనిషికి రూపాయిన్నర యివ్వాలి. ఎండలో రెండు మైళ్లు మోసుకొచ్చాం,’’ అన్నాడు వీరయ్య. ‘‘నాల్రూపాయలే ఎక్కువ, నోర్మూసుకుని పాండవతలకి,’’ అన్నాడు నరసింహం. ఆకలితో కడుపు మండుతున్న వీరయ్యకి కోపంతో యింకా మండింది. ఒకడుగు ముందుకేసి, ‘‘అవున్లెండి! మీరెందుకిత్తారు. మాలాటోళ్ల నోళ్లు కొట్టకపోతే యింతింత మేడలెట్టా కడతారు, ఇసుమంటి బల్లల మీద కూకుని పూటకి యాభై రూపాయల తిండెక్కడ తింటారు,’’ అన్నాడు.

నరసింహం గభాల్న సోఫాలోంచి లేచివచ్చి చాచికొట్టాడు. ఉంగరాల చేతిదెబ్బకి వీరయ్య కళ్లు బైర్లు కమ్మాయి. పానకాలు ముందుకొచ్చి వీరయ్యను పడకుండా పట్టుకున్నాడు. ‘‘తిండికి లేని వెధవలకి ఇంత పొగరా! ఇంకా ఇక్కడున్నావంటే డొక్క చీలుస్తాను. పో! బయటికి,’’ అని గర్జించాడు నరసింహం. మిగతా ముగ్గురు మరేం మాట్లాడలేక వీరయ్యను తీసుకొని మెల్లగా బయటకొచ్చేశారు. గేటు దాటి బయటికొచ్చాక, రోడ్డుప్రక్కనున్న పంపు దగ్గరకెళ్లి నీళ్లు దోసిట్లో తీసుకుని పుక్కిలించి వూశాడు వీరయ్య. నీళ్లు ఎర్రగా వున్నాయి. పన్నేదో కదిలి రక్తమొస్తోంది. మరో రెండుసార్లు పుక్కిలించి నీళ్లు తాగాడు. ‘‘ఇంత ఎదవపని చేశావేరా ఈరయ్యా! అంతటోడ్ని పట్టుకుని అట్టా మాట్టాడితే వూర్కుంటాడామరి’’ అన్నాడు సుబ్బడు. ‘‘యిదిగో నీ రూపాయ్,’’అని వీరయ్యకివ్వబోయాడు. ఆ రూపాయి పుచ్చుకోబుద్ధి కాలేదు. మిగతావాళ్లు పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా ముందుకి సాగిపోయాడు. తల బరువుగా వుంది. కడుపులో మంట. నోరు మంట. ‘జేబులో డబ్బుల్లేకుండా యింటికెట్టా ఎల్లను?’ అనుకున్నాడు. రోడ్డుపక్క, ఒక చెట్టుకింద తుండుగుడ్డ పరుచుకుని పడుకున్నాడు. బరువుగా కళ్లు మూసుకున్నాడు. ఒక పెద్ద డైనింగ్‌ టేబిల్‌ చుట్టూ ఎనిమిది కుర్చీల్లో రాక్షసుల్లా ఉన్న ఎనిమిదిమంది నరసింహాలు కూర్చుని, తననీ, తన పెళ్లాంబిడ్డల్నీ బల్లమీద పడుకోబెట్టి, కత్తుల్తో, ముళ్ల గరిటెల్తో పీక్కు తింటున్నట్టు కలొచ్చింది. ఉలిక్కిపడి లేచాడు.

డి.వెంకట్రామయ్య కథ ‘డైనింగ్‌ టేబుల్‌’కు సంక్షిప్త రూపం ఇది. 1972లో ప్రచురితం. దివి వెంకట్రామయ్య (20 ఆగస్ట్‌ 1941–13 జనవరి 2020) కృష్ణా జిల్లా దొండపాడులో జన్మించారు. రేడియో న్యూస్‌రీడర్, ప్రయోక్త, కథా నాటక రచయిత, అనువాదకుడు. 1963లో ఆకాశవాణిలో చేరారు. మూడున్నర దశాబ్దాలు పనిచేశారు. రేడియో రాంబాబుగానూ  పరిచితులు. 80 కథలు , 2 నవలలు రాశారు. పంతులమ్మ సినిమాకు స్క్రిప్టు రచయితగా పనిచేశారు. డి.వెంకట్రామయ్య కథలు, ఆకాశవాణిలో నా అనుభవాలు ఆయన పుస్తకాలు.

డి.వెంకట్రామయ్య

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top