అదే నేనైతేనా..?

Columbus made a crucial vessel to discover America - Sakshi

ఆత్మీయం

కొలంబస్‌ సాహసవంతమైన నౌకాయాత్ర చేసి అమెరికాను కనుగొన్నాడు. ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. తిరిగి రాగానే ఆయనకు గౌరవ సూచకంగా అనేక సన్మానాలు, సత్కారాలు చేశారు. అది చూసి ఓర్వలేని కొందరు ఒకరోజు ఒక విందులో ‘‘అదేమంత ఘనకార్యం? ఈ మాత్రానికే ఇంత ఘనమైన సన్మానాలు చేయాలా?’’ అన్నారు. భోజన కార్యక్రమం అయ్యాక కొలంబస్‌ ఒక ఉడికించిన గుడ్డును బల్లమీద పెట్టి సమావేశంలోని ఎవరైనా సరే గుడ్డును తిన్నగా నిలబెట్టగలరా?’’ అని అడిగాడు. అందరూ ప్రయత్నించారు. కానీ ఆ పని చేయలేకపోయారు. తరువాత కొలంబస్‌ గుడ్డు పైభాగాన్ని కొద్దిగా వేలితో తొలగించి సమతలంగా చేసి క్షణంలో బల్లమీద నిటారుగా నిలబెట్టాడు. అందరూ అది చూసి ‘ఇదేమంత కష్టమైన పని? మేమూ చేస్తాం’ అని గట్టిగా కేకలు వేశారు. ఆ మాటలకు కొలంబస్‌ చిరునవ్వు నవ్వుతూ ‘‘చేయగలరు. కానీ, నేను చేసేంతవరకు చేయలేకపోయారు కదా... సూక్ష్మదృష్టి, సమయస్ఫూర్తి లోపించడం వల్ల తేలికైన పనులు కూడా అసంభవమనిపిస్తాయి. గొప్పదనాన్ని ఆపాదించవలసినది శ్రమకు కాదు.. సూక్ష్మబుద్ధికి’’ అని అంటాడు.

మనలో కూడా చాలామంది అలానే వ్యవహరిస్తారు. ఎవరైనా ఎంతో కష్టంతో సాధించిన పనిని ‘ఓస్‌... అదెంత? నేనూ చేసేయగలను అంతకన్నా అందంగా.. అవలీలగా చేసేయగలను’ అంటూ అవతలి వారిని, వారు చేసిన పనిని తేలిగ్గా తీసిపారేస్తారు. అది చాలా తప్పు. వీరు చేయగలిగి ఉంటే అప్పుడే చేసి ఉండొచ్చు కదా, వేరే వాళ్లు చేసిన తర్వాత వారిని తక్కువ చేయడం ఎందుకు? అంటే వాళ్లు చేసి చూపించేదాకా వీళ్లకు దానిని ఎలా చేయాలో తెలియదనైనా అర్థం, లేదంటే అవతలి వారు చేసిన పనిని అభినందించడం అయినా తెలియదని అర్థం. అంతేగా! అది చాలా తప్పు. అలాంటి వారు మనకు నిత్యజీవితంలో చాలామంది చాలా సందర్భాల్లో కనిపిస్తూనే ఉంటారు. ఒక్కోసారి అలాంటి వారిలో మనం కూడా ఉండొచ్చు. అందుకే ఎవరినీ, తేలిగ్గా చూడకూడదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top