గొంతు దోచిన భర్త

Cancer is caused by passive smoking - Sakshi

భర్త దుర్మార్గుడైతే భార్య గొంతు కోశాడని అంటుంటారు. భర్త మంచివాడైనా భార్య గొంతు కోస్తే? భార్య గొంతు దోచుకెళ్తే? భార్యను కష్టాలపాలు చేస్తే? పొగతాగటం భర్తకు  మాత్రమే ప్రమాదం కాదు. భార్యకు కూడా. నళిని కథ వింటే.. స్మోకింగ్‌ చేస్తున్న మీ భర్తను  ‘స్టాప్‌ స్మోకింగ్‌’ అని అనక మానరు. ఫేస్‌బుక్‌లో వేలాదిగా షేర్‌ అవుతున్న  ఈ కథనాన్ని చదవండి.

హడావుడిగా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నా స్వరపేటికలో అల్సర్‌ వచ్చిందని చెప్పారు పిల్లలు. వాళ్లు ఏదో దాస్తున్నారనిపించింది నాకు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నేను ఒక్కనాడు కూడా సిగరెట్లు కాల్చలేదు, ఎవ్వరినీ నొప్పించలేదు. అయినా నాకు ఇలా జరిగిందేమిటి అని...

నా పేరు నళిని. నా జీవితంలో నేను ఒక్క సిగరెట్‌ కూడా కాల్చలేదు. కాని దురదృష్టం నన్ను వెంటాడింది. గొంతు క్యాన్సర్‌ వచ్చింది. ఇప్పుడు నాకు స్వరపేటిక లేదు. 1972లో మా బావతో నాకు వివాహం అయ్యింది. చాలా నిక్కచ్చి మనిషి. ఆయన ఇంజనీర్‌. దేశమంతా ఉద్యోగరీత్యా తిరుగుతుండేవారు. కాని ఆయనకు సిగరెట్లు కాల్చడమనే ఒక బలహీనత ఉంది. నేను ఏం చెప్పినా ఆయన మాత్రం ధూమపానం మానలేదు. ఆయనకు 45 సంవత్సరాల వయసులో 1991లో మైల్డ్‌ స్ట్రోక్‌ వచ్చింది. సిగరెట్ల సంఖ్య తగ్గించారే కాని పూర్తిగా మానలేకపోయారు. అయిదేళ్ల తరవాత మళ్లీ గుండె పోటు వచ్చింది. అప్పుడు ఇంక సిగరెట్లు పూర్తిగా మానేయమని డాక్టర్లు హెచ్చరించడంతో మానేశారు. 2005లో నిద్రలోనే కన్నుమూశారు. ఆయన మరణించిన నాలుగు సంవత్సరాలకి అంటే 2009లో నాకు గొంతు నొప్పి వచ్చింది. స్వరంలో శబ్దం తగ్గిపోయింది. డాక్టరు దగ్గరకు వెళితే మందులు రాశారు. వాడుతూనే ఉన్నా గుణం మాత్రం కనిపించలేదు. ఒక సంవత్సరం పాటు వాడుతూనే ఉన్నాను. తగ్గకపోగా, ఊపిరి సమస్య మొదలైంది. ఒకరోజు ఇంక ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది. నా బాధ చెబుదామంటే నోట్లో నుంచి మాట రాలేదు. మా పిల్లలు కంగారు పడ్డారు. 

హడావుడిగా నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నా స్వరపేటికలో అల్సర్‌ వచ్చిందని చెప్పారు పిల్లలు. వాళ్లు ఏదో దాస్తున్నారనిపించింది నాకు. గట్టిగా అడగడంతో నాకు క్యాన్సర్‌ వచ్చిందని చెప్పారు. 
ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నేను ఒక్కనాడు కూడా సిగరెట్లు కాల్చలేదు, ఎవ్వరినీ నొప్పించలేదు. అయినా నాకు ఇలా జరిగిందేమిటి అని చాలా బాధపడ్డాను.పాసివ్‌ స్మోకింగ్‌ కారణంగా నాకు క్యాన్సర్‌ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నా భర్త పక్కనే కూర్చోవడం వల్ల ఆయన వదిలిన సిగరెట్‌ పొగ నేను నాకు తెలియకుండానే పీల్చడం వల్లే ఇలా జరిగిందని అర్థం చేసుకున్నాను. జరిగిన దాని గురించి కాదు, జరగవలసిన దాని గురించి ఆలోచించాలి అనుకున్నాను. డాక్టర్లు వెంటనే ఆపరేషన్‌ చేయాలనడంతో మారు మాట్లాడకుండా అంగీకరించాను. 2010, ఏప్రిల్‌ 19న, నన్ను ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. నా కంఠానికి గాటు పెట్టి, స్వరపేటిక, థైరాయిడ్‌ గ్లాండ్‌ తీసేశారు. మెడలో ఒక రంధ్రం (స్టోమా) పెట్టారు. వాయిస్‌ ప్రాస్థసిస్‌ అమర్చారు. దాని ద్వారానే నేను చెప్పదలచుకున్నది చెప్పడం నేర్చుకోవడం ప్రారంభించాను. ఉదర భాగానికి ఒక గొట్టం అమర్చి దాని ద్వారా నాకు ఆహారం ఇవ్వడం ప్రారంభించారు. మొదట్లో నేను బాగా కుంగిపోయాను. నా పిల్లలు ఇచ్చే మనోధైర్యంతో, క్రమంగా మానసికంగా కోలుకున్నాను. వచ్చిన అనారోగ్యం గురించి ఆలోచించడం మానేశాను. నవ్వడం అలవాటు చేసుకున్నాను. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అనవసరమైన ఆలోచనలు వస్తాయి. అందుకే ఏదో ఒకటి చేయాలనుకున్నాను. నా 64వ ఏట నేను కంప్యూటర్‌ నేర్చుకోవడం ప్రారంభించాను. చాలా తొందరగా ఫేస్‌బుక్‌ వాడటం అలవాటు చేసుకున్నాను. 

నా మెడలో రంధ్రం ద్వారా అమర్చిన గాలి గొట్టం ద్వారా కష్టపడి మాట్లాడటానికి ప్రయత్నించాను. అయినా నాలో ఏదో అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. ఆ రంధ్రం నుంచే వేణువు వాయించడం సాధన చేస్తున్నాను. పెద్దగా వాయించలేకపోయినా, నా ఆత్మానందానికి తగినట్లుగా వేణువు వాయించగలిగితే చాలు. అందుకే ప్రతిరోజూ కొంతసేపు వేణువు సాధన చేస్తున్నాను. నా చీరకు మ్యాచ్‌ అయ్యేలా నా మెడకి ఉన్న రంధ్రం మూసుకునేలా రకరకాల దుస్తులు కుట్టడం ప్రారంభించాను. పగలంతా పొగాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాను. ఎంతోమంది క్యాన్సర్‌ రోగులకు మానసిక ధైర్యం ఇస్తున్నాను. ఒక మాటలు రాని వ్యక్తిగా, నేను ఈరోజు చాలా మాట్లాడుతున్నాను. డాక్టర్లు కూడా నా కోసం ఒక మాట్లాడే సాధనం ఇస్తామన్నారు. ఆ సాధనం వల్ల నేను నా స్టోమాని పట్టుకోవలసిన అవసరం ఉండదు.
నేను నా తరఫు నుంచి ఒక సందేశం ఇస్తాను. ఇది చాలా సింపుల్‌. పాసివ్‌ స్మోకింగ్‌ను నిర్లక్ష్యం చేయకండి. మీకు ప్రియమైనవారు మీ దగ్గర సిగరెట్‌ కాలుస్తుంటే, నిర్మొహమాటంగా వద్దని చెప్పేయండి. వారి కోసమే కాదు, మీ కోసం కూడా.
 

పాసివ్‌ స్మోకింగ్‌ కారణంగా నాకు క్యాన్సర్‌ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నా భర్త పక్కనే కూర్చోవడం వల్ల ఆయన వదిలిన సిగరెట్‌ పొగ నేను నాకు తెలియకుండానే పీల్చడం వల్లే ఇలా జరిగిందని అర్థం చేసుకున్నాను.


మనవరాలు, మనవడితో నళిని (71) 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top