వృక్షారామం

Buli Swamy Reddy Is Protecting The Environment Through Charitable Trust - Sakshi

జీ‘వనం’

ద్రాక్షారామం గురించి విన్నాం, మరి ఈ వృక్షారామం ఏంటి అనుకుంటున్నారా..! ఒకే వేదికగా నక్షత, సప్తర్షి, నవగ్రహ, అశోకవనాలతో విలసిల్లుతూ ఆధ్యాతికతకు ఆలవాలమైంది. దేవతా వృక్షారామంగా పేరొందిన ఆ ఆరామం తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని ఆర్తమూరులో ఉంది.

చుట్టూ పచ్చని చెట్లు. అరవైకి పైగా వృక్షజాతులు. పండ్లు, పూల మొక్కలు. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ అక్కడి చెట్లు శక్తి స్వరూపాలుగా పూజలందుకుంటాయి. నింగిలోని నక్షత్రాలకు నేల మీది వృక్షాలకు ఉన్న అనుబంధాన్ని చాటి చెబుతుంటాయి. అగస్త్య మహాముని నడయాడిన నేల, ఇరువురు జీయర్ల జన్మస్థలమైన తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరులోని దేవతా వృక్షారామం ఇందుకు వేదికైంది. మొక్కలంటే ఎనలేని మక్కువతో గ్రామానికి చెందిన ఎస్‌బీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్, ఆధ్యాత్మికవేత్త సత్తి బులిస్వామిరెడ్డి సప్తర్షి ఆరామం, నవగ్రహ ఆరామం, నక్షత్ర ఆరామం, అశోక వనాలతో ఈ వృక్షారామాన్ని నెలకొల్పారు.

పచ్చందనమే ప్రధానం

ఆధునిక ప్రపంచంలో అంతా కాంక్రీట్‌ మయమైపోతుండగా పచ్చదనం కనుమరుగైపోతోంది. ఎస్‌బీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు బులిస్వామిరెడ్డి. ఏటా ట్రస్టు వార్షికోత్సవ వేడుకలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా రెండు లక్షలకు పైగా మొక్కల పంపిణీ చేశారు. జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన మొక్కల ప్రాధాన్యతను చాటి చెప్పడం, సనాతన ధర్మం గూర్చి నేటి తరం వారికి తెలియజెప్పే లక్ష్యంతో బులిస్వామిరెడ్డి సొంత స్థలంలో తన తల్లిదండ్రుల పేరిట శ్రీసత్యలక్ష్మణ దేవతావృక్షారామాన్ని నెలకొల్పారు.

ప్రత్యేకంగా పనివారిని ఏర్పాటుచేసి కంటికి రెప్పలా మొక్కలను సంరక్షిస్తున్నారు. మహాబిల్వం, ఏకబిల్వం, రుద్రాక్ష, నాగకేసరి, మహాలక్ష్మి ఫలం, దేవకాంచన, యాపిల్‌ తదితర ఎన్నో చెట్లు ఈ వృక్షారామంలో చూపరులకు కనువిందు చేస్తుంటాయి. అశోకవనంలో చైనా నుంచి తీసుకువచ్చిన చైనా బాల్స్‌ చెట్టు పూలు సుగంధాలను వెదజల్లుతుంటాయి.

వన ఆరామాలు
సాధారణంగా అక్కడక్కడ నక్షత్ర వనరామాలను ఏర్పాటు చేసినా చాలావరకు ఒకే రోజు మొక్కలు నాటుతుంటారు. అయితే అర్తమూరులో ఏ రోజు వచ్చే నక్షత్రానికి సంబంధించిన మొక్కను అదే రోజు నాటుతూ 27 రోజులు పాటు పారాయణం, హనుమాన్‌ చాలీసా, నిత్యహోమం, మాలధారణతో బులిస్వామిరెడ్డి వృక్షారామాన్ని నెలకొల్పారు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమి, జమదగ్ని, వశిష్టుడు మొదలైన సప్తరుషులు, బుధ, శుక్ర, చంద్ర, గురువు, రవి, కుజ, కేతు, శని, రాహువు మొదలైన నవగ్రహాలకు ప్రతిరూపాలైన మొక్కలను వృక్షారామంలో నాటారు. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలతో అశోకవనం ఏర్పాటు చేశారు.

దేశంలోని వివిధ దేవాలయాల వద్ద నుంచి తీసుకువచ్చిన మట్టితో వనవిహారి రాధా కృష్ణుల విగ్రహాన్ని వృక్షారామంలో ప్రతిష్టించారు. పూజలు నిర్వహించేందుకు యాగశాలను నిర్మించారు. వృక్షారామంలో చెట్ల నుంచి రాలిన ఆకులు, ఎండు కొమ్మలను బయట పడేయకుండా ప్రతీ సోమ, శనివారాల్లో నిర్వహించే యాగానికి వినియోగిస్తారు. ఏ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి ఆ నక్షత్రానికి ప్రతీకైన మొక్కను నాటి సంరక్షిస్తే సకల దోషాలు పోతాయని సనాతనధర్మం చెబుతుంది. దేవతా వృక్షారామంలో స్థానికులు తమ జన్మనక్షత్రానికి సంబంధించిన మొక్కకు నీళ్లు పోసి, చుట్టూ ప్రదిక్షిణలు చేసి పూజలు చేస్తుంటారు.
పెనుబోతుల విజయ్‌కుమార్,
సాక్షి, మండపేట, తూర్పుగోదావరి

మొక్కలతోనే మనుగడ

ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే అది దేవాలయం. దైవానికి ప్రతీకగా మొక్కలు ప్రతిష్టిస్తే అది దేవతా వృక్షారామం. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యం. కుటుంబ సభ్యులందరి జన్మనక్షత్ర సంబంధమైన వృక్షాలను సేకరించి, వాటిని ఒక చోట పెంచి, పూజించడం చాలామందికి సాధ్యంకాదు. గ్రహ, నక్షత్ర దోషాలను నివారించుకుని ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలన్న సంకల్పంతో దేవతా వృక్షారామంను ఏర్పాటుచేసి అందరికి అందుబాటులోకి తేవాలన్న నా కల ఇన్నాళ్లకు నెరవేరింది.
సత్తి బులిస్వామిరెడ్డి,
ఎస్‌బీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top