ఏ ఇంటి కోడలు కలికి కామాక్షి?

Biruduraju Ramaraju Essay Essay In Sakshi Sahityam

ఈ గేయానికి ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో చాలా భావస్వామ్యం వున్న గేయాలు దొరుకుతున్నాయి.  అయితే, దీన్ని అచ్చమైన  పల్లెపాటగా పరిగణించడం కష్టం. జానపద గేయాల ఫణితిని శ్రద్ధగా గమనించిన  శిష్టజనులెవ్వరో ఈ గేయాన్ని కళాత్మకంగా మలిచారని తోస్తుంది.

కలవారి కోడలు కలికి కామాక్షి
కడుగుచున్నది పప్పు కడవలో బోసి
అప్పుడే వచ్చేడు ఆమె పెద్దన్న
కాళ్లకు నీళ్లిచ్చి కన్నీరు నింపె–

ఇలా సాగే ఈ జానపద గేయం తెలుగునాట ఆబాలగోపాలానికీ ప్రీతిపాత్రమయింది. బిరుదురాజు రామరాజు సిద్ధాంత వ్యాసం ‘తెలుగు జానపద గేయ సాహిత్యము’లో చోటు చేసుకున్న తర్వాత పామర ప్రజానీకం నోట్లోంచి పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కి పండితాదరణ కూడా పొందగలిగింది. ఈ గేయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో చాలా భావస్వామ్యం వున్న గేయాలు దొరుకుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన రీతిలో వినబడే ఈ పాట ముఖ్యాంశం – అత్తగారింట్లో ఆరళ్ల పాలైన కోడలి జీవితం. పదిమంది నోళ్లలో నానుతున్న ఈ పాటలో ఆమె పుట్టింటికి చెల్లెలు పెళ్లికని వెళ్లి, మరదుల పెళ్లికి తిరిగి వస్తానంటుంది. కానీ అసలైన జానపద గేయాల్లో అత్తింటి ముఖం చూడనని భీష్మ ప్రతిజ్ఞ చేయడం గమనించదగ్గ విషయం.
చొక్కాపు నారాయణస్వామి సేకరించిన ‘పుట్టింటికి’ అన్న కర్నూలు జిల్లాలోని గేయంలో కోడలు పిల్ల అత్తగారింట పెద్దలందరినీ పుట్టింటికి పోవడానికి అనుమతి అడిగి చిట్టచివర మొగుడిని కోరగా అతను–
వండుకో వరికూడు దానిమ్మలో
కట్టుకో సద్దికూడు దానిమ్మలో
ఎత్తుకో బాలున్ని దానిమ్మలో
ఎగురు గుర్రాన్ని దానిమ్మలో–

అంటూ సంతోషంగా వెళ్లి రమ్మంటాడు. అప్పుడామె ఏం చేసిందంటారు?
 

ఎగిరే గుర్రాన్ని దానిమ్మలో
దుమ్ముల్లు రేగా దానిమ్మలో
పారే గుర్రాము దానిమ్మలో
చెంగల్వపట్నానికి దానిమ్మలో–
ఆమె గుర్రమెక్కి, అన్నతోనో, తమ్మునితోనో పుట్టింటికి బయలుదేరింది. పుట్టిల్లు చెంగల్వపట్నంలో ఉందట. ఆమె వూరు తామరకొలను అయితే ఆమె జీవితం ఎంత ఆనందంగా సాగిపోతుందో! ఈ గేయంలో చిత్రింపబడ్డ స్త్రీ ఎలాంటి మానసిక, శారీరక హింసలకూ గురి కాలేదన్నమాట. ఈ గేయం ‘తేనెసొనలు’(1974) లోనిది.
గోపు లింగారెడ్డి సేకరించిన గేయం(తెలంగాణ శ్రామిక గేయాలు, 1982)లో దీపావళి పండుగకు పుట్టింటికి పిల్చుకు పోవడానికి వచ్చిన అన్నలకు చెల్లెలు ‘‘కాళ్లకు నీళ్లిచ్చి కన్నీళ్లు దీసె’’. అప్పుడామె అన్నలు ‘‘ఎందుకూ కష్టాలు ఏమి కష్టాలు’’ అని ఆదుర్దా పడుతూ అత్తగారి అనుమతి తీసుకొని, వెంటనే బయలుదేరమంటారు. అప్పుడామె అత్త, మామ, బావ, తోడికోడలు వగైరాలను అడిగి ఆఖరికి పెనిమిటి అనుమతి అడిగితే, అతను ఇప్పుడే బయలుదేరమంటాడు. మళ్లీ ఎప్పుడొస్తావు అంటే ఆ ముద్దరాలు అంటుంది గదా!
‘‘ఏటి మీద యెర్రజొన్న పండిన్ననాడు సీతారామచంద్ర
ఏడు పుట్ల మన గరిసె నిండిన్ననాడూ సీతారామచంద్ర
పాటిమీద పచ్చజొన్న పండిన్ననాడూ సీతారామచంద్ర
పది పుట్ల మన గరిసె నిండిన్ననాడూ సీతారామచంద్ర
నక్కలూ నాగండ్లు దున్నిన్ననాడు సీతారామచంద్ర
కుందేల్లు సద్దూలు మోసిన్ననాడూ సీతారామచంద్ర
వరిపొట్టు సేతాడు పేనిన్ననాడూ సీతారామచంద్ర
మా యత్త మా మామ సచ్చిన్ననాడూ సీతారామచంద్ర
తడిబట్ట స్నానాల కంటూ వచ్చేనూ సీతారామచంద్ర–

పాపం, ఈ కోడలు అత్తారింట్లో ఎన్ని కష్టాల పాలయిందో! అందుకే అత్తవారింటికి తిరిగి రావడానికి పెట్టిన షరతులన్నీ అసంభావ్యాలే.
పాలమూరు జిల్లా జానపద గేయాలు(1994)లోని ఓ పాట దాదాపు ఇదే వరుసలో ఉంది. కసిరెడ్డి వెంకటరెడ్డి సేకరించిన ఈ గేయంలోని కోడలి కథ కూడా వ్యథాభరితమే. వినండి ఆమె అన్న మాటలు ఎంతటి ఆక్రోశంతో నిండివున్నాయో!
 

నక్కల్లూ నాగండ్లు దున్నిన్ననాడూ సీరామరామ సెంద్రా
కుక్కల్లూ గుంటకలు కొట్టిన్ననాడూ సీరామరామ సెంద్రా
మాయత్తా మామ సచ్చిన్ననాడూ సీరామరామ సెంద్రా
తడిబట్ట స్నానాల కందొచ్చేనూ సీరామరామ సెంద్రా.

వరంగల్‌ జిల్లాలో సేకరింపబడ్డ ఓ గేయం ‘మన పల్లెటూళ్ల పాటలు’(2004) ఈ కలవారి కోడలు కష్టాల్ని మరిన్ని వివరాలతో తెలియజేస్తుంది. చెల్లెల్ని పిల్చుకుని రమ్మంటే ముగ్గురన్నలు తాము వెళ్లమని అంటే కొనాకు తండ్రే బయలుదేరడం ఈ గేయంలోని విశేషం. కాగా ఈ కోడలి పేరు భాగ్యమ్మగా పేర్కొనడం మరో ప్రత్యేకత. ఆ కోడలు ఇంటిల్లిపాదీ పెద్దాచిన్నలకు పుట్టింటికి పోవడానికి అనుమతి అడిగి, చిట్టచివరికి పెనిమిటి పోయిరమ్మని చెప్పి, మళ్లీ ఎప్పుడొస్తావంటే ఆమె అంటుంది కదా:
అత్త సచ్చీనంక ఉయ్యాలో ఆరు నెల్లా కొస్త ఉయ్యాలో
మామ సచ్చీనంక ఉయ్యాలో మంచం కాడి కొస్త ఉయ్యాలో.

ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రచురించిన ‘జాలారి సిరిమల్లెలు’ (2007)లో జి.శ్రీనివాసయ్య కర్ణాటకలోని కోలారు జిల్లాలో సేకరించిన అర్థపూర్ణమైన తెలుగు జానపద పాటలున్నాయి. దీన్లోని ‘మాయన్నగారూ’ గేయం కలవారి కోడలు కన్నీటి కథే. ఆమె అందరిని అనుమతి అడిగి, చివరగా మరిది సమ్మతించగా పుట్టింటికి బయలుదేరుతుంది. అప్పుడు ‘‘వదినా మళ్లీ ఎప్పుడు వస్తావు’’ అంటే–
 

ఉడికిండే ఉలువాలూ మలిసిన్నాటికో
కలకోడి పుంజేమో కూతేసిన్నాటికో
బండమింద రాజనాలు పండిన్నాటికో– 

తిరిగి వస్తానంటుంది. ఆమె మళ్లీ అత్తగారింటి వైపు తలపెట్టి నిద్రపోదన్న మాట.
మేక ఉమారెడ్డి సిద్ధాంత గ్రంథం ‘నల్లగొండ జిల్లా జానపద గేయాలు: సమగ్ర పరిశీలన’(2015)లో ఉటంకించిన గేయంలో కోడలు అత్తగారింటిని గుండెల మీద కుంపటిగా భావించిన లక్షణాలేవీ కనపడవు. ముద్దుల పెళ్లాంకు భర్త ఇలా వీడ్కోలు చెప్తాడు:
పెట్టెలో సొమ్మూలు కోల్‌ – పెట్టుకోవే నాగ కోల్‌
దండాన బట్టలు కోల్‌ – సద్దుకోవే నాగ కోల్‌
మీ యన్నల వెంట కోల్‌ – వెళ్లిరావే నాగ కోల్‌.

ఈ పాటలోని కోడలు అత్తగారింటి నుంచి క్షేమంగా వెళ్లి పుట్టింటి నుంచి లాభంగా తిరిగొస్తుందని భావించవచ్చు.
‘ఉడకేసిన ఉలవలు మొలకెత్తినబుడు’ అన్న శీర్షికతో ప్రచురించబడ్డ జానపద గేయం ‘దణి– హోసూరు పల్లెపాటల కతలు’ (2017) కలవారి కోడలు దుఃఖాన్ని వెలువరించేదే. తమిళనాడు కృష్ణగిరి జిల్లా ప్రాంతంలో లభించిన ఈ పాటలో–
 

రాతి మీద రతనాలు పండినబుడు
రాతి బసవన్న రంకేసినబుడు
ఉడకేసిన ఉలవలు మొలకెత్తినబుడు– 
తిరిగి వస్తానంటుంది ఈ చాన. 

కలవారి కోడలు కలికి కామాక్షి గేయంలో కళకళలాడే ముఖంతో, సుఖమయ జీవితం గడిపే కోడలు కనిపిస్తుంది. కాని వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో వున్న జానపద గేయాల్లో కన్నీరు పెట్టిన కామాక్షే కళ్లముందు నిలబడుతుంది. వీటి వల్ల ‘అత్తలేని కోడలు ఉత్తమురాలు– కోడలు లేని అత్త గుణవంతురాలు’ అన్న అలనాటి మాటలే మన చెవుల్లో గింగురుమంటాయి.
కలవారి కోడలు కలికి కామాక్షి గేయాన్ని అచ్చమైన పల్లెపాటగా పరిగణించడం కష్టం. జానపద గేయాల ఫణితిని శ్రద్ధగా గమనించిన శిష్టజనులెవ్వరో ఈ గేయాన్ని కళాత్మకంగా మలిచారని తోస్తుంది. ఇకపోతే ఈ వస్తువునే గుండె లోతుల్లోంచి ఉబికిన భావాలతో సహజ సుందరంగా, శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసే విధంగా తీర్చిదిద్దిన పల్లెప్రజలకు, నేలతల్లి బిడ్డలకు భావుకులందరూ జోహార్లు అర్పించాలి.
-ఘట్టమరాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top