చిక్కు తీసిన చక్కనమ్మ

Ambika Pillai a Make-up artist story  - Sakshi

జీవితంలో చిక్కులు తప్పవు. చిక్కులకు భయపడి.. భయంలో చిక్కుకుపోతే ఎదగం. ఎదగలేం. అదే.. ప్రతి చిక్కునూ విప్పుకుంటూ పోతే.. భయాన్ని జుట్టుపట్టి ఈడ్చిపారేయొచ్చు. అంబికా పిళ్లై కూడా అదే చేశారు. చిక్కులు తీసే ముస్తాబమ్మ అయ్యారు. తన చిక్కులు తీసుకున్న చక్కనమ్మా అయ్యారు. జీవితంలో నిలబడడం కన్నా... చక్కదనం ఏముంటుంది చెప్పండి?!

అంబికా పిళ్లై వయసు 56 ఏళ్లు. సొంతూరు కేరళ రాష్ట్రంలోని కొల్లాం. ప్రస్తుతం ఉంటున్నది ఢిల్లీలో. సింగిల్‌ మదర్‌. తనక్కడ ‘డిజైనర్‌ సెలూన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను స్థాపించి ఎనిమిదేళ్లవుతోంది. 150 మంది ఉద్యోగస్తులు, పదికోట్ల టర్నోవర్‌తో ఆ సెలూన్స్‌ను నడిపిస్తోంది అంబికా. ‘‘జుట్టు కట్‌ చేసినంత ఈజీ కాదు ఈ వ్యవహారం.. వాటర్‌ ప్రూఫ్‌లేని మేకప్‌ వానకు కొట్టుకుపోయినట్టు.. నమ్మక ద్రోహంతో రెండుసార్లు వ్యాపారం తుడిచిపెట్టుకుపోయింది’’ అంటుంది అంబికా పిళ్లై!

ఇరవై నాలుగేళ్లకే విడాకులు
అంబికా వాళ్లది కాస్త కలిగిన కుటుంబమే. పదిహేడేళ్లకే ఆమెకు పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. అయితే ఆమె కాపురం కలహాలతో సాగింది. ప్రయత్నించినా భర్త తీరులో మార్పు రాలేదు. దాంతో విడాకులు తీసుకుంది. భర్తతో విడిపోయే నాటికి ఆమె వయసు 24 ఏళ్లు.

చంకలో రెండేళ్ల పాపతో మెట్టినిల్లు వదిలి పుట్టింటి తలుపు కొట్టకుండా సొంత శక్తిమీద నిలబడాలని ఢిల్లీ వెళ్లింది. రకరకాల జడలు వేయడం, బట్టల సెలెక్షన్, మిక్స్‌ అండ్‌ మ్యాచ్, బాగా ముస్తాబు అవడం, స్నేహితులకు మేకోవర్‌ చేయడం అంటే చాలా ఇష్టం. ఆసక్తి కూడా. అందుకే ఢిల్లీలో హెయిర్‌ స్టయిలిస్ట్‌ కోర్సు చేసి, మేకప్‌లో శిక్షణ తీసుకుంది.

తండ్రి చేయూతనీ వద్దంది
కోర్సు అయిన వెంటనే ఓ బ్యూటీ సెలూన్‌లో రెండువేల రూపాయలకు ఉద్యోగంలో చేరింది అంబిక. అందులో సగం రెంట్, మిగతా సగం ఇంటి ఖర్చులకే అయిపోయేది. అందుకే పెద్ద పెద్ద మేకప్‌ ఆర్టిస్టుల దగ్గర, హెయిర్‌ స్టయిలిస్టుల దగ్గర పార్ట్‌ టైమ్‌ చేసేది. అంటే.. ఫ్యాషన్‌ షోలకు, పెళ్లిళ్ల ఈవెంట్‌ మేనేజర్‌లకు అసిస్టెంటుగా వెళ్లేది. దీనివల్ల అదనపు ఆదాయంతో పాటు పనిలో నైపుణ్యం కూడా పెరిగింది ఆమెకు.అలా కష్టపడ్డ డబ్బును దాస్తూ, దాంట్లో కొంత మొత్తంతో ఓ సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుక్కుంది.

తన సొంత సంపాదనతో కొన్న కారును తండ్రికి చూపించాలనే ఆరాటంతో తండ్రిని ఢిల్లీకి పిలిచింది. తన కారులోనే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఆయనను రిసీవ్‌ చేసుకుంది. ‘‘ఇది నీ కూతురు కారు...’’ అంటూ తన కారును చూపించింది. అప్పటికే హై ఎండ్‌ కార్లను వాడుతున్న ఆయన.. బిడ్డ కారును చూసి పెదవి విరిచాడు. ‘‘నన్ను అడిగితే మంచి కారే కొనిపెడతా కదా’’ అన్నాడు. చిన్నబుచ్చుకోలేదు అంబిక. ‘‘సొంత సంపాదనలో ఉన్న ఆనందం, అందే గౌరవం నీ కూతురికి బాగా తెలుసు నాన్నా’’ అంది కార్‌ స్టార్ట్‌ చేస్తూ! బిడ్డ ధైర్యాన్ని పరీక్షించిన తండ్రి మనసు కుదుటపడ్డది.

పార్ట్‌నర్‌ దగా చేశాడు
‘‘ఎన్ని రోజులు ఇలా ఒకరి చేతి కింద పనిచేస్తాం? ధైర్యం చేయకపోతే ఏదీ సాధించలేం’’.. తనతో పాటే పనిచేస్తున్న ఫ్రెండ్‌ కామెంట్‌. ‘‘నిజమే.. నా దగ్గర కొంత డబ్బుంది. కొంత లోన్‌ తీసుకొని సొంతంగా సెలూన్‌ పెట్టుకుందామా?’’ అడిగింది అంబిక. ఫ్రెండ్‌కూ నచ్చి ఓకే అయింది ప్రపోజల్‌. సొంత సెలూన్‌ కోసం ఏడు లక్షలు అప్పు తెచ్చి రాత్రింబవళ్లు కష్టపడింది అంబిక. అకౌంట్స్‌ అన్నీ ఫ్రెండ్‌ చేతిలో పెట్టింది.

పెళ్లిళ్ల  సీజన్‌లో రోజుకు 22 మ్యారేజెస్‌ అటెండ్‌ చేస్తే రిజిస్టర్‌లో రెండు మ్యారేజెస్‌ మాత్రమే నమోదయినట్లు తెలిసింది అంబికకు... సెలూన్‌ నష్టాల్లో ఉందని ఫ్రెండ్‌ చెప్పినప్పుడు! హతాశురాలైంది. నిలదీస్తే... నిజం చెప్పకపోగా అంబిక మీదే నిందలు పడ్డాయి. అప్పుల కింద ఆమె పెట్టుబడిని జమకట్టుకొని ఎగ్జిట్‌ దారి చూపించారు. మరోవైపు కూతురు పెరుగుతోంది.  వ్యాపారం వృద్ధిలోకి వస్తే పిల్లను బాగా చదివించుకోవచ్చని చాలా ఆశపడింది. కానీ ఇలా జరిగింది! కళ్లు తుడుచుకుని మళ్లీ లేచి నిలబడింది అంబిక.

సొంత సంస్థకిప్పుడు 12 బ్రాంచీలు
2010లో పదకొండు మంది సిబ్బందితో ‘అంబికా పిళ్లై డిజైనర్‌ సెలూన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను మొదలుపెట్టింది. రోజుకు అయిదుగురి కంటే ఎక్కువ కస్టమర్స్‌ ఉండే వాళ్లు కాదు. ఇలాగైతే ఇదీ మూసేయాల్సిందే అనుకుంది.  కాని స్థయిర్యం కోల్పోలేదు. రెండు నెలలు తిరిగేసరికి పుంజుకుంది. రెండేళ్లు తిరిగే సరికి ఢిల్లీలోనే 12 బ్రాంచ్‌లను ప్రారంభించింది. త్వరలోనే వెస్ట్‌ ఆసియాలోనూ ఓపెన్‌ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆమె కూతురు కవిత కూడా పెద్దదైంది. తల్లి వ్యాపారంలో భాగస్వామిగా చేరింది. జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది.

‘‘ఇంతకుముందు ఉదయం నుంచి రాత్రి వరకూ పనిచేసేదాన్ని. ఇప్పుడంత ఓపిక ఉండట్లేదు. అందుకే పన్నెండు నుంచి అయిదింటి వరకు టైమింగ్స్‌ను కుదించుకున్నాను. మిగతా సమయంలో ఫేస్‌బుక్‌లో బ్యూటీ టిప్స్, హెయిర్‌కు సంబంధించిన సొల్యూషన్స్‌ ఇస్తున్నాను. ట్రావెలింగ్, రాయడం అంటే ఇష్టం. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. త్వరలోనే ఓ రెస్టారెంట్‌ ఓపెన్‌ చేయాలనే ప్లాన్‌లో ఉన్నా’’ అంటుంది అంబిక. ఆమె ఫేస్‌ బుక్‌ పేజీకి ఎనిమిదిన్నర లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ‘‘నా ప్రొఫెషన్‌లోనూ.. పర్సనల్‌గానూ నన్ను చాలా మంది మోసం చేశారు. నా డబ్బు తీసుకున్నారు. కాని నా టాలెంట్‌ను, ధైర్యాన్ని, నా ఆత్మవిశ్వాసాన్ని తీసుకోలేకపోయారు’’ అంటుందీ విజేత.

మేకప్‌ ఆర్టిస్ట్‌గా ఐఫా అవార్డు
అంబిక పనితనం, కష్టపడే తత్వం తెలిసిన ఫ్యాషన్‌ డిజైనర్‌ హేమంత్‌ త్రివేది సపోర్ట్‌గా నిలిచాడు. ఆ సమయంలో.. అంటే 90ల్లో ఢిల్లీలో ఏవైనా ఫ్యాషన్‌ షోలు జరిగితే ముంబై మోడల్స్‌ అందరూ తమ సొంత మేకప్‌ ఆర్టిస్ట్స్, హెయిర్‌ స్టయిలిస్ట్‌లతో దిగేవారు. ఆ అవసరంలేదు.. అక్కడా మంచి హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఉందని ఆ మోడల్స్‌కు అంబికను పరిచయం చేశాడు హేమంత్‌.

అలా ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్‌ షోల్లో పని కల్పించడమే కాక, సుభాష్‌ ఘయ్‌ ‘తాల్‌’ సినిమాకు చాన్స్‌ ఇప్పించాడు. ఆ సినిమాకు బెస్ట్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌గా ఐఫా అవార్డ్‌నూ అందుకుంది అంబిక. సొంత సెలూన్‌పెట్టి వట్టిచేతులతో నిలబడ్డ ఆమెకు అదెంతో రిలీఫ్‌నిచ్చింది. ఆ ఫీల్డ్‌లోనూ ఆదరణనూ పెంచింది. ఈసారి ఇంకో ఫ్రెండ్‌ వచ్చాడు సెలూన్‌ పెడ్దామని. మళ్లీ నమ్మింది. ఇంకోసారీ మోసపోయింది. తండ్రి గుర్తొచ్చాడు. వెళ్లింది. బాధపోయేలా ఏడ్చింది. కొత్త శక్తితో తిరిగొచ్చింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top