
తన పదమూడో ఏట వాళ్లమ్మ చనిపోయినప్పుడు తొలిసారి మానసికంగా కుంగిపోయింది వర్జీనియా వుల్ఫ్(1882–1941). తర్వాత రెండేళ్లకు ఆమె సోదరి మరణించింది. అదే సమయంలో ఆమె మారుతల్లి పోయింది. బాగా చదువుకున్న కుటుంబంలో పుట్టిన వర్జీనియా తన పద్దెనిమిదో ఏట తండ్రి ప్రోత్సాహంతో రాయడానికి ఉపక్రమించింది. అత్యంత ప్రభావశీలిగా నిలవబోయే ఇరవయ్యో శతాబ్దపు ఆధునిక రచయిత్రి ఆ మనో వ్యాకులతల మధ్య కలం పట్టింది.
పైగా, ఆడపిల్ల రాయడాన్నీ, చిత్రించడాన్నీ అంత గణించదగినదిగా పరిగణించని ఛాందస ఇంగ్లిష్ సమాజానికి ఎదురీదుతూ లండన్‌లోని కళాకారులు, రచయితలతో జట్టుగా సాహిత్యంలో మునిగి తేలింది. వరుస విపత్తులతో కుంగిపోయివున్న వుల్ఫ్ వెన్వెంటనే తండ్రిని కూడా కోల్పోవడం ఆమెను మానసిక దౌర్బల్యానికి గురిచేసింది. ఒక్కోసారి తీవ్ర నైరాశ్యంలోకీ, అప్పుడే ఎగసిపడే ఉత్సాహంలోకీ ఆమె ఉద్వేగాలు మారిపోయేవి. ఈ మానసిక అనారోగ్యానికిగానూ ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది.
చివరకు, 59వ ఏట నదిలో మునిగి చనిపోయింది. ఒక మనిషిని శూన్యం చేయకుండా వదలని విధి ఆటల నడుమే ‘మిసెస్ డాలోవే’, ‘టు ద లైట్‌హౌజ్’, ‘ఓర్లాండో’ లాంటి ప్రసిద్ధ నవలలు రాసింది. చైతన్య స్రవంతి రచనా విధానాన్ని ఉపయోగించిన మార్గదర్శుల్లో ఒకరిగా నిలిచింది. వ్యాస రచయిత్రిగా కూడా వుల్ఫ్ ప్రసిద్ధురాలు. స్త్రీవాద ఉద్యమానికి ఆమె రచనలు ప్రేరణ నిచ్చాయి.