సారీ... చెల్లెమ్మా!

సారీ... చెల్లెమ్మా!


భార్గవి చనిపోయింది! ఆత్మహత్య చేసుకుంది!! చెల్లెళ్లిద్దరూ ఈ రోజుకీ అక్కా అక్కా అంటూ పలవరిస్తూనే ఉన్నారు. అమ్మానాన్న.. తల్లీ తల్లీ ఎందుకిలా చేశావే అని తల్లడిల్లిపోతున్నారు.

 

క్షమించమ్మా.

నిన్ను ఏకాకిని చేసినందుకు క్షమించమ్మా.

నీ కష్టం అర్థంచేసుకోనందుకు క్షమించమ్మా.

చోద్యం చూస్తున్న మా పిరికితనాన్ని క్షమించమ్మా.

అమ్మాయిలను బడికి పంపకూడదేమోనన్న భయానికి ఆజ్యం పోసినందుకు క్షమించమ్మా.

సారీ భార్గవి... సారీ చెల్లమ్మా.

ఇలా ఇంకో చెల్లికి జరక్కుండా జాగ్రత్తపడతాం.


    

భార్గవి! బంగారు బొమ్మ. పదిహేనేళ్లు. పదో తరగతి చదువుతోంది. పరీక్షలు దగ్గరపడ్డాయి కదా, ఇంకా బాగా చదువుతోంది. 10/10 గ్రేడ్ సాధించాలని ఆ అమ్మాయి తపన. సాధించి తీరుతుందని తల్లిదండ్రుల ధీమా. రేయింబవళ్లు కష్టపడి చదువుతోంది. ఇష్టంగా చదువుతోంది. ఇంటి పని చేస్తూనే, ఇద్దరు చెల్లెళ్లకు చదువులో సాయం చేస్తూనే తను చదివినవి మననం చేసుకుంటోంది. అమ్మానాన్న ఇక్కడ లేదు. పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వడానికి ఉపాధి కోసం పరాయి రాష్ట్రానికి వెళ్లారు. రోజూ వారికి ఫోన్ చేస్తోంది భార్గవి. ‘బాగా చదువుతున్నాను. కాలేజీలో చేరి ఇంకా బాగా చదువుతాను. తర్వాత మంచి ఉద్యోగం చేసి మీకు కష్టం తప్పిస్తాను’ అని చెబుతోంది. ఇంట్లో పెద్ద కూతురు భార్గవి. అప్పుడే ఇంత పెద్దది అయిందా అని అమ్మానాన్న ఎప్పట్లాగే ఆ రోజు కూడా మురిసిపోయారు. ఫోన్‌లోనే కూతురు పెట్టిన ముద్దులకు తడిసి ముద్దయ్యారు.



ఆ ముద్దుల తడి ఇంకా ఆరనైనా లేదు. అంతలోనే దుఃఖపు వరదలో మునిగిపోయారు. భార్గవి చనిపోయింది! ఆత్మహత్య చేసుకుంది!! చెల్లెళ్లిద్దరూ ఈ రోజుకీ అక్కా అక్కా అంటూ పలవరిస్తూనే ఉన్నారు. అమ్మానాన్న.. తల్లీ తల్లీ ఎందుకిలా చేశావే అని తల్లడిల్లిపోతున్నారు.

 

ఏం జరిగింది?

రెండు నెలల ముందు నుంచే పరీక్షలకు శ్రద్ధగా ప్రిపేర్ అవుతున్న భార్గవికి మరో పరీక్ష ఎదురైంది. ప్రేమ పరీక్ష! వయసులో భార్గవికంటే చిన్నవాడైన తోటి విద్యార్థి ఆమెను ప్రేమిస్తున్నానన్నాడు. నువ్వూ నన్ను ప్రేమించు అన్నాడు. నువ్వు లేకపోతే బతకలేనన్నాడు. నువ్వు ఒప్పుకోక పోతే బతకనివ్వను అని కూడా అన్నాడేమో తెలీదు. మొత్తానికైతే రోజూ వెంటపడేవాడు. భార్గవి భయపడిపోయింది. వణికిపోయింది. అక్క ముఖంలో దిగులును ఆ చిన్నారి చెల్లెళ్లు గమనించారు కానీ, ప్రేమ వేధింపులే అందుకు కారణమని గ్రహించలేకపోయారు. అసలు గ్రహించేంత వయసు కూడా కాదు వాళ్లది. భార్గవికి ప్రేమించే టైమ్ లేదు. ప్రేమించే ఆసక్తీ లేదు. చదువుపైనే ఆమె ప్రేమ. తల్లిదండ్రులపైనే ఆమె ప్రేమ. నానమ్మ మీదే ఆమె ప్రేమ. భవిష్యత్తు మీదే ఆమె ప్రేమ. చెల్లెళ్ల మీదే ఆమె ప్రేమ. అందుకే అతడికి చెప్పింది. నాకు ఇలాంటివి ఇష్టం లేదు అని గట్టిగా చెప్పింది. వినకపోవడంతో విసుగెత్తి చివరకు అమ్మకు నాన్నకు చెప్పింది. నాయనమ్మకు చెప్పింది. మేనమామకు చెప్పింది. ఎవరు వెళ్లి చెప్పినా ఆ విద్యార్థి వినలేదు. విసిగి వేసారి అలసిపోయిన భార్గవి ఆఖరి ప్రయత్నంగా పోలీసులకు కంప్లైంట్ చేసింది. వాళ్లు చెప్తే అతడు వినేవాడేమో కానీ వాళ్లు చెప్పలేదు. ‘చె బుదామనే అనుకున్నాం, వేరే పనిలో ఉండి చెప్పలేకపోయాం’ అని ఇప్పుడు... భార్గవి చనిపోయాక అంటున్నారు!



వారం క్రితమే వచ్చింది

భార్గవి సొంతూరు నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామం. నాన్న పల్లపు చినవెంకన్న. అమ్మ విజయ. భార్గవి వేములపల్లిలోని మోడల్ స్కూల్‌లో చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఏడు సంవత్సరాల క్రితమే బతుకు తెరువు కోసం మహారాష్ట్రలో టెలిఫోన్ కేబుల్ గుంతలు తవ్వే పనికి వెళ్లారు. బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు, పండుగలకు మాత్రమే ఇక్కడికి వచ్చి వెళుతున్నారు. భార్గవి శెట్టిపాలెంలోనే తన పెద్ద చెల్లి మహేశ్వరితో కలిసి నాయనమ్మ సైదమ్మ వద్ద ఉంటోంది. ఆమె చిన్న చెల్లెలు సదా త్రిపురారం మండలంలోని పెదదేవులపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉండి ఐదో తరగతి చదువుతోంది.



అంతా కుదురుగా ఉన్న సమయంలో ఇక్కడ  భార్గవి చదువుకు అనుకోని ఆటంకం! ఆ ఊళ్లోనే ఉంటున్న ఆమె సహవిద్యార్థి ప్రేమ పేరుతో ఆమె చదువును సాగనివ్వడం లేదు. అతడు కూడా వేములపల్లిలో భార్గవి చదివే మోడల్ స్కూల్‌లోనే ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రోజూ భార్గవి వెంటపడి తనను ప్రేమించమని వేధిస్తున్నాడు. కొన్నాళ్లు చూసి, సహనం నశించి భార్గవి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు. దీంతో అతడికి రెండు నెలల క్రితం  టీసీ ఇచ్చి పంపించారు. అప్పటి నుంచి   శెట్టిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. ఈ క్రమంలో...  మోడల్‌స్కూల్‌లోని బాలికల హాస్టల్‌లో ఉంటున్న భార్గవి ఆరోగ్యం బాగోలేక వారం రోజుల క్రితమే  శెట్టిపాలెంలోని నాయనమ్మ వద్దకు వచ్చింది. అక్కడి నుంచే రోజూ పాఠశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వస్తోంది. ఇదే అదునుగా భావించాడు సహవిద్యార్థి.  ప్రేమించమని వేధించడం మొదలు పెట్టాడు.

  ఇక తట్టుకోలేక ఈనెల 21వ తేదీ ఆదివారం రాత్రి మేనమామ పుల్లయ్యతో కలిసి వెళ్లి వేములపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 తర్వాత ఏమైందో తెలీదు. సోమవారం ఉదయం నాయనమ్మ ఊళ్లోని మిల్లుకు బియ్యం పట్టించేందుకు వెళ్లినప్పుడు... ఇంట్లో ఎవరూ లేని సమయంలోభార్గవి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. పక్కింటి వాళ్లు అరుపులు విని వచ్చి మంటలు ఆర్పేలోగా భార్గవి మృతి చెందింది. ప్రేమ వేధింపులకు బలైపోయింది!

 - పైడిమర్రి రామకృష్ణ, సాక్షి, వేములపల్లి

 

ఫిర్యాదు వచ్చింది

తమ గ్రామానికే చెందిన విద్యార్థి తనను ప్రేమించాలని రోజూ వేధిస్తున్నాడని పల్లపు భార్గవి ఆదివారం రాత్రి ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలల నుంచి అతడు తనను వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. సోమవారం ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నాం.

 - విజయ్‌కుమార్, ఎస్‌ఐ, వేములపల్లి

 

ఈవ్‌టీజింగ్‌నుఎదుర్కోవడానికి మానసిక నిపుణుల సూచనలు

తల్లిదండ్రులకు : పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉండాలి. సామాజిక సంబంధాల (రిలేషన్‌షిప్ ఇష్యూస్) గురించి పిల్లల దగ్గర మాట్లాడటానికి కొందరు తల్లిదండ్రులు వెనకాడుతుంటారు. ఏ విషయమైనా తల్లిదండ్రుల దగ్గర జంకు లేకుండా ప్రస్తావించేలా పిల్లలతో వ్యవహరించాలి. ఫలానా అంశం తల్లిదండ్రుల దగ్గర ప్రస్తావించకూడని రహస్యం అని పిల్లలు అనుకోకూడని విధంగా వాళ్లతో కమ్యూనికేషన్ ఉండాలి. పిల్లలతో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, వేధింపులు ఇలా ఏ అంశంపైనైనా మాట్లాడుతూ ఉండాలి. ఏదైనా అవాంఛిత పరిణామం జరుగుతుంటే పిల్లలు దాన్ని చెప్పుకునేలా తల్లిదండ్రుల చొరవ ఉండాలి.

 

టీచర్లకు : సామాజిక సంబంధాలను గుర్తించడానికి తగిన ఆస్కారం ఉన్న స్థానంలో టీచర్లు ఉంటారు. టీనేజర్లు, వాళ్ల స్నేహితుల వ్యవహారాలు కనిపెట్టడానికి వాళ్లకు అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది టీచర్లు ఇది తమకు సంబంధించని వ్యవహారం అనుకుంటుంటారు.టీనేజర్ల విషయంలో ఏదైనా తేడా ఉందని గ్రహించిన వెంటనే పిల్లలకు వాళ్లు తగిన సలహా ఇవ్వవచ్చు. తల్లిదండ్రులు చెప్పిన దాని కంటే టీచర్లు చెప్పేదాని ప్రభావమే పిల్లలపై ఎక్కువ. ఏదైనా తమ పరిధి దాటిపోతుందని గ్రహిస్తే టీచర్లు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపాలి.

 

పోలీసులకు : ఈవ్‌టీజింగ్ అంశాలు తమ దృష్టికి వచ్చినప్పుడు బాధితులకు తగిన న్యాయం చేస్తూనే... పిల్లలిద్దరి విషయంలోనూ వారు తప్పనిసరిగా గోప్యత పాటించాలి. పిల్లలు సామాజికంగా వివక్షకు గురికాకుండా ఉండటానికి వారు ఇచ్చే ఫోన్ నెంబర్లు, వాళ్లు చదివే స్కూలు వంటి అంశాల్లో ఈ గోప్యత చాలా అవసరం.

 

ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు : సాధారణంగా అమ్మాయిలు టీజింగ్‌కు గురయ్యే మాల్స్, నలుగురు కలిసేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ బాధితులకు తగిన కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. టీనేజ్ పిల్లలు చదివే స్కూళల్లో, కాలేజీలలో అప్పుడప్పుడూ ఈ అంశాల మీద అవగాహన సదస్సులు నిర్వహించాలి. కేవలం ఈ అంశంపై వార్తలు వెలుగులోకి వచ్చిన సందర్భాల్లో మాత్రమే కాకుండా... ప్రభుత్వ యంత్రాంగం, సంబంధిత అధికారులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

 

స్నేహితులకు : ఈవ్‌టీజింగ్ లాంటివి జరుగుతున్న సందర్భాల్లో అది మొదట తెలిసేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది కేవలం స్నేహితులకు మాత్రమే. అందుకే తమ స్నేహితులు ఉదాసీనంగా ఉన్నా, డిప్రెషన్‌కు లోనైనా దాన్ని చక్కదిద్దడమో లేదా టీచర్లకో, పిల్లల తల్లిదండ్రులకో ఫ్రెండ్ సమాచారం ఇవ్వాలి. అలాగే తన స్నేహితురాలి సమాచారాన్ని అవసరమైన వ్యక్తులకు తప్ప ఇతరులకు తెలియజేయని విధంగా గోప్యత పాటించాలి. తమ స్నేహితురాలిలో ఆత్మవిశ్వాసం నింపేలా ఫ్రెండ్స్ మాటలు ఉండాలి. నిజానికి వాళ్లకు మొదటి సలహా, సూచన ఇవ్వగలిగే అద్భుత అవకాశం స్నేహితులకే ఉంటుంది.

 - డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్,  లూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top