బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలను తీవ్రం చేశారు.
మోడీపై రాహుల్ ధ్వజం
కరౌలీ(రాజస్థాన్ )/మనావర్(మధ్యప్రదేశ్)/ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలను తీవ్రం చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రజాజీవితంలో కొనసాగి ఉంటే మోడీ ఆయనను కూడా బీజేపీ అగ్రనేతలైన జశ్వంత్ సింగ్, ఎల్‌కే అద్వానీలను పక్కకు తప్పించినట్లే తప్పించి ఉండేవారని దుయ్యబట్టారు. రాహుల్ ఆదివార ం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ముంబైలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు.
తనను దేశానికి కాపలాదారును చేయాలని మోడీ ప్రజలను కోరుతుండడంపై రాహుల్ మండిపడ్డారు. ‘ఆయన వ్యాపారవేత్తలకే కాపలాదారు. సీనియర్లను పక్కకు తప్పించి అదానీ(పారిశ్రామికవేత్త)ను తీసుకొచ్చారు. గుజరాత్ తన ఇంద్రజాలం వల్లే అభివృద్ధి చెందిందంటున్నారు. కానీ నిజానికది రైతులు, శ్రామికుల కష్ట ఫలితం’ అని వ్యాఖ్యానించారు. కాగా, రాహుల్ ముంబైలో పాల్గొన్న సభకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గైర్హాజరయ్యారు.