జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కాకినాడలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానుంది. అంతకు ముందు 8 గంటలకు పోస్టల్ బ్యాలట్‌ను లెక్కిస్తారు.
సాక్షి, కాకినాడ :జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కాకినాడలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానుంది. అంతకు ముందు 8 గంటలకు పోస్టల్ బ్యాలట్‌ను లెక్కిస్తారు. లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు 19 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఉదయం 11 గంటలకల్లా వెలువడగలవని భావిస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే జిల్లాలో తొలి ఫలితం గంటలోపే వచ్చే అవకాశం ఉంది.
కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 10,92,827 ఓట్లు పోలవగా వాటిలో తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానాల ఓట్లను జేఎన్‌టీయూకే పెట్రోలియం అండ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో, పెద్దాపురం, జగ్గంపేట ఓట్లను ఫుడ్ టెక్నాలజీ బ్లాక్‌లో లెక్కిస్తారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ స్థానాల్లో పోలైన 11,13,426 ఓట్లను ఐడియల్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు.
రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పరిధికి సంబంధించి జిల్లాలోని అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ స్థానాల్లో పోలైన 6,59,152 ఓట్లను రంగరాయ వైద్య కళాశాలలో లెక్కిస్తారు. ఈ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోలైన 1,13,832 ఓట్లను ఐడియల్ కళాశాల సివిల్ బ్లాక్‌లో లెక్కిస్తారు. జిల్లాలో మొత్తం 37,73,322 మంది ఓటర్లుండగా 29,79,237 మంది ఓటేశారు. 78.96 శాతం పోలింగ్ నమోదైంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో 77.42 శాతం పోలింగ్ నమోదవగా ఈసారి 1.54 శాతం పెరిగింది. మొత్తం 4,056 పోలింగ్ స్టేషన్లలో 2,819 చోట్ల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 1,812 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను నూరుశాతం వెబ్ కాస్టింగ్ ద్వారా వీక్షించారు.
22,262 పోస్టల్ బ్యాలట్లు..
అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు కనీసంగా 10, గరిష్టంగా 14 టేబుళ్లు, ఆయా స్థానాల్లో పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు కనీసంగా 7, గరిష్టంగా 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్లు అతి తక్కువగా పోలైన రంపచోడవరం స్థానానికి, అత్యధికంగా పోలైన కొత్తపేట స్థానానికి 14 టేబుళ్లే ఏర్పాటు చేయడం గమనార్హం. పోస్టల్ బ్యాలట్ ఓట్లు 40 వేలు పంపిణీ చేస్తే 22,262 (55.65 శాతం) పోలైనట్టు అధికారులు తెలిపారు. వీటిని విడిగా లెక్కించాక ఆయా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల ఓట్లకు కలుపుతారు.
అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల వారీ టేబుళ్లు
అసెంబ్లీ స్థానాల వారీ అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు విడివిడిగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు 307 రౌండ్లు, పార్లమెంటు ఓట్ల లెక్కింపునకు 337 రౌండ్లుగా నిర్ధారించారు.
మీట నొక్కితే చాలు.. లెక్క తేలిపోతుంది!
ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు చాలా సులువని, కంట్రోలింగ్ యూనిట్ రిజల్ట్ బటన్ నొక్కితే ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో ప్రదర్శిస్తుందని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు గౌతమ్‌ఘోష్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసిపోతుందన్నారు. లెక్కింపు విధుల్లో పాల్గొనేవారు ఉదయం ఏడు గంటలకే హాజరవాలని, పాస్ లేకపోతే రానివ్వమని చెప్పారు. సెల్‌ఫోన్‌లు తీసుకు రాకూడదన్నారు. ప్రతి రౌండ్ ఫలితాన్నీ సంబంధిత ఆర్వోకు తప్పనిసరిగా అందించాలన్నారు. ఫారం-17సి జిరాక్స్ కాపీని అభ్యర్థికి అందించాలన్నారు. ఒక టేబుల్ వద్ద లెక్కింపు పూర్తయ్యాక ఆ టేబుల్ సంఖ్య, లెక్కించిన రౌండ్ల వివరాలతో ఆర్వోకు కవర్ అందించాలన్నారు. లెక్కింపు పూర్తయ్యాక కంట్రోల్ యూనిట్ రిజల్ట్ బటన్‌ను సీల్ చేయాలన్నారు.
లెక్కింపులో 2200 మంది సిబ్బంది
మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఓట్ల లెక్కింపునకు 22 వందల మంది సిబ్బందిని నియమించినట్టు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. వీరిలో 609 మంది మైక్రో అబ్జర్వర్లు, 529 మంది సూపర్‌వైజర్లు, 567 అసిస్టెంట్లు కాగా మిగిలిన వారిని ఇతర అవసరాలకు నియమించినట్టు చెప్పారు. లెక్కింపు కేంద్రాల్లో ఈ సిబ్బందితో పాటు ఆర్వోలు, ఏఆర్వోలు విధులు నిర్వహిస్తారన్నారు.