శోభానాగిరెడ్డి ఆధిక్యం | Sakshi
Sakshi News home page

శోభానాగిరెడ్డి ఆధిక్యం

Published Fri, May 16 2014 10:10 AM

shobha nagireddy leading

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి చరిత్ర సృష్టించబోతున్నారు. మరణానంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక మహిళగా శోభా నాగిరెడ్డి రికార్డు నెలకొల్పనున్నారు. తన చిరకాల ప్రత్యర్థి , తెలుగుదేశం పార్టీ అభ్యర్థి  గంగుల ప్రభాకర్ రెడ్డిపై ఆమె ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజవర్గంలో శోభా భర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఏప్రిల్ 23వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు వైఎస్ షర్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొని, తిరిగి ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె, 24వ తేదీన చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. గతంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా మరణిస్తే వెంటనే ఎన్నికను వాయిదా వేసి, తర్వాత ఉప ఎన్నిక నిర్వహించేవారు. అయితే.. కొంతకాలం తర్వాత వేర్వేరు కారణాలతో ఆ సంప్రదాయాన్ని ఎన్నికల కమిషన్ మానుకుంది. దాంతో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నిక యథాతథంగా కొనసాగుతుందని ఈసీ ప్రకటించింది. అయితే, తొలుత శోభా నాగిరెడ్డికి ఓట్లు వేస్తే, అవి చెల్లకుండా పోతాయన్న ప్రచారం జరిగినా.. తర్వాత మాత్రం ఈసీ ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఎక్కువ ఓట్లు వస్తే ఆమెనే విజేతగా ప్రకటిస్తామని విస్పష్టంగా ప్రకటించింది.

Advertisement
Advertisement