రెబెల్.. గుబుల్

ఆర్. కృష్ణయ్య వాహనాన్ని అడ్డుకుంటున్న టీడీపీ రెబెల్ అభ్యర్థి అనుచరులు - Sakshi


* అన్ని పార్టీలకు తిరుగు‘పాట్లు’

* తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం..

* చివరి ఘడియ దాకా పార్టీల్లో జంపింగ్‌లు

* భారీగా బరిలోకి దిగిన తిరుగుబాటు అభ్యర్థులు

* గట్టి పోటీనిచ్చే రెబెల్స్ సంఖ్య 127..

* పొత్తులు నచ్చక కొందరు, టికెట్లు దక్కక మరికొందరు.. అన్ని పార్టీలకూ ఇదే బెడద.. ఫలించని బుజ్జగింపులు

* నామినేషన్ల ఉపసంహరణకు ససేమిరా, సత్తా చూపిస్తామని పట్టుదల

* 25 స్థానాల్లో టీడీపీ అసంతృప్తుల పోటీ, బీజేపీ స్థానాల్లోనూ పొత్తు పోట్లు

 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. గురువారం నామినేషన్ల పరిశీలన, మరో రెండు రోజుల్లో ఉపసంహరణ పర్వం ముగిస్తే చాలు అసలు యుద్ధం మొదలవుతుంది. ఎన్నికల బరిలో నిలిచే వారెవరో, ఎవరితో ఎవరు తలపడతారో తేలుతుంది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నేతల కోసం, గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తూ అన్ని పార్టీలూ నామినేషన్ల తుది గడువు దాకా జాబితాలను ప్రకటిస్తూనే వచ్చాయి. అఖరి ఘడియ వరకూ ఫిరాయింపులు, చేరికలతో అన్ని పార్టీల శిబిరాల్లోనూ అరువు నేతల హడావుడే కనిపించింది.



అభ్యర్థుల ప్రకటనలో అసాధారణ జాప్యంతోపాటు.. వుంచి రోజు కూడా కావడంతో చివరి రోజైన బుధవారమే ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీలు సుదీర్ఘ కసరత్తు చేసినా.. ఎంత జాగ్రత్తగా అభ్యర్థులను వడబోసినా.. తిరుగుబాటు బెడదను ఏమాత్రం తగ్గించుకోలేకపోయాయి. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత అన్ని పార్టీలకు చెందిన దాదాపు 127 వుంది గట్టి రెబెల్స్ లెక్క తేలారు. ఈ సంఖ్య వింటేనే పార్టీలు కలవరపాటుకు గురవుతున్నాయి. ఇంకా చిన్నాచితకా తిరుగుబాటు అభ్యర్థులనూ కలిపితే ఈ సంఖ్య 200 దాటుతుంది. వుహబూబ్‌నగర్‌లో 32 మంది, ఖమ్మంలో 28 మంది రెబెల్స్ బరిలో ఉన్నారు. కేసీఆర్, పొన్నాల, విజయశాంతి వంటి ముఖ్య నేతలతోపాటు జేఏసీ నేతలకూ ఈ బెడద తప్పడం లేదు.



దారికి తెచ్చుకునేందుకు తంటాలు

పొత్తులు నచ్చక, పొత్తుల్లో అవకాశం దక్కక, సొంత పార్టీలో టికెట్లు చిక్కక.. అనేక వుంది నాయకులు ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేశారు. స్వతంత్రంగానే సత్తా చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. అలకలు, ఆగ్రహావేశాలు, ఆందోళనలు, ధర్నాలతో అన్ని పార్టీల కార్యాలయాలు దద్దరిల్లాయి. వారిని బుజ్జగించడానికి ప్రధాన నేతలు నానా పాట్లు పడుతున్నారు. విజయావకాశాలను దెబ్బతీసే రెబెల్స్‌ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవడానికి తంటాలు పడుతున్నారు.



తిరుగుబాటు నేతలతో నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు ఎక్కడికక్కడ ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇతరత్రా అవకాశాలు కల్పిస్తావుంటూ హామీలిస్తున్నారు. సరైన అభ్యర్థుల్లేక ఇతర పార్టీల నుంచి ఎడాపెడా నాయకులను చేర్చుకున్న స్థానాల్లో, అలాగే పొత్తుల్లో ఇతర పార్టీలకు సీట్లను కేటాయించిన చోట అసంతృప్త నేతలు గరంగరంగా ఉన్నారు. సీపీఐకి ఇచ్చిన స్థానాల్లో కాంగ్రెస్ నేతలు, బీజేపీకి ఇచ్చిన స్థానాల్లో టీడీపీ నేతలు, టీడీపీకి కేటాయించిన చోట బీజేపీ నాయకులు కూడా పోటీలకు దిగారు. ఈ వ్యవహారం పార్టీల నడువు కొత్త పంచాయితీలకు దారితీస్తోంది. ప్రధానంగా ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద ఎక్కువగా ఉండటం గవునార్హం.



టీ-పీసీసీ చీఫ్‌కూ చికాకే!

కాంగ్రెస్‌లో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదనేది ఆ పార్టీ నేతలు నిరంతరం చెప్పేమాట! ఆ మాటను నిజం చేస్తూ ఆ పార్టీ నేతలు తెలంగాణవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో తిరుగుబాటు చేశారు. తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో ప్రధాన రెబెల్స్‌గా నిలిచిన 127 మందిలో 47 మంది కాంగ్రెస్ నాయకులే. మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. చివరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకూ ఈ బాధ తప్పలేదు.



కేంద్ర మాజీ మంత్రి కమాలుద్దీన్ అహ్మద్ కుమారుడు ఎండీ రజీయుద్దీన్, పీసీసీ కార్యదర్శి బక్కా జడ్సన్ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులుగా జనగాం బరిలో నిలిచారు. వాస్తవానికి దాదాపు వంద మందికిపైగా నేతలు టికెట్ దక్కలేదన్న ఆగ్రహంతో  రెబెల్స్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థులు, టీపీసీసీ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగింపు చర్యలు చేపట్టడంతోపాటు రకరకాల ఆశలు కల్పించడంతో చాలామంది శాంతించారు.



నామినేషన్ల ఉపసంహరణకు మరో రెండ్రోజులే గడువుండటంతో తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు ఏకంగా హైకమాండ్ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ రెబెల్స్‌గా నామినేషన్ వేసిన ప్రముఖుల్లో ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి(ఆదిలాబాద్), వరంగల్ డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి(నర్సంపేట), మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ (వికారాబాద్), మాజీ ఎమ్మెల్యేలు రేపాల శ్రీనివాస్(మిర్యాలగూడ), అరుణతార(జుక్కల్) ఉన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలోనూ ఇబ్రహీం నామినేషన్ వేశారు.

 

 సీపీఐ పొత్తుకు పోటు!

 పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. కోదాడ, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీయే బి.ఫారాలిచ్చి తమ నేతలతో నామినేషన్ దాఖలు చేయించింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి కోదాడ నుంచి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. సీపీఐకి ఇచ్చిన మిగిలిన ఆరు స్థానాల్లోనూ స్థానిక కాంగ్రెస్  నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో నిలిచారు.

 

కేసీఆర్‌కూ రెబెల్!

టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కూ రెబెల్ బెడద పట్టుకుంది. మెదక్ పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి బీరయ్య యాదవ్ అధినేతపైనే పోటీకి దిగారు. కేసీఆర్ నామినేషన్ ర్యాలీకి స్వాగతం పలికిన బీరయ్య.. తర్వాత తన నామినేషన్‌ను కూడా దాఖలు చేయడం విశేషం. మొదట ఇతన్ని డమ్మీ అభ్యర్థి అని అంతా భావించారు. అయితే తాను కూడా పోటీ చేస్తున్నట్లు బీరయ్య చెబుతున్నారు. దీంతో పార్టీ వర్గాలు కొంత ఆశ్చర్యానికి గురయ్యాయి.



పార్టీ టికెట్ దక్కని పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షపతి కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నుంచి పార్టీ నాయకుడు చందులాల్ తిరుగుబాటు అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ పార్టీ తరఫున గుర్నాథరెడ్డి పోటీ చేస్తున్నారు. మొత్తానికి పదికిపైగా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ రెబెల్స్ రంగంలో ఉన్నారు. అయితే ఇతర పార్టీలతో పోల్చితే గులాబీదండులో ఈ తలనొప్పి కొంత తక్కువే!

 

జేఏసీ నేతలకు తలపోటు!

తెలంగాణ జేఏసీ నుంచి సీట్లు పొందిన నేతలకూ చిక్కులు తప్పలేదు. తుంగతుర్తి నుంచి జేఏసీ నేత అద్దంకి దయూకర్‌కు పోటీగా కాంగ్రెస్ రెబెల్ గుడిపాటి నర్సయ్యు నామినేషన్ వేశారు. ఈ స్థానానికి నర్సయ్య పేరు తొలి జాబితాలో ఉండగా.. తర్వాత మార్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఇక వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి జేఏసీ నేత కత్తి వెంకటస్వామిపై డీసీసీ అధ్యక్షుడు దొంతి వూధవరెడ్డి పోటీ నామినేషన్ వేశారు. జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేస్తున్న మహబూబ్‌నగర్‌లోనూ టీఆర్‌ఎస్ రెబెల్ అవురేందర్ బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి ఆర్మూరు నియోజకవర్గానికి టికెట్ పొందిన ఓయూ జేఏసీ నేత రాజారాం యూదవ్‌పై ఆ పార్టీకే చెందిన గోపాల్ నగేష్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగారు.



బీజేపీకి పొత్తు చికాకులు!

మిత్రపక్షాల పొత్తు బెడిసికొడుతోంది. బీజేపీ-టీడీపీ పొత్తుపై రెండు పార్టీల నేతల్లో రేగిన చిచ్చు నామినేషన్ల చివరి ఘట్టంలోనూ స్పష్టంగా కనిపించింది. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన కీలక నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని చోట్ల బీజేపీ సీట్లలోనూ పార్టీ రెబెల్స్ రంగంలో నిలిచారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నగర శివారులోని కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, రాంజేంద్రనగర్, చేవెళ్ల, మహేశ్వరం, మేడ్చల్ నియోజవర్గాలను గట్టిగా కోరి భంగపడ్డ బీజేపీ నేతలు ఆయా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.



మేడ్చల్‌లో ఇద్దరు బీజేపీ నేతలు పోటీ చేస్తున్నారు. వరంగల్ జిల్లా పరకాల సీటు టీడీపీ ఖాతాలో ఉండగా అక్కడ బీజేపీ నేత విజయచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోనూ బీజేపీ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. చెన్నూరు, బెల్లంపల్లి, బాల్కొండ, పటాన్‌చెరు, ఇబ్రహీంపట్నం, వికారాబాద్, నారాయణ్‌పేట, మక్తల్, సత్తుపల్లిలో కూడా పోటీ నామినేషన్లు దాఖలయ్యాయి.



టీడీపీ డబుల్‌గేమ్!

బీజేపీకి ఇచ్చిన స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అంతర్గత కుమ్ములాటల్లో భాగంగా టీడీపీ పోటీ చేస్తున్న సీట్లలోనూ రెబెల్స్ బరిలో నిలిచారు. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సొంత పార్టీ అభ్యర్థులపై, బీజేపీ పోటీ చేసే సీట్లలో కూడా టీడీపీ తిరుగుబాటు నేతలు నామినేషన్లు సమర్పించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కేటాయించిన ఎల్‌బీనగర్‌లో కృష్ణప్రసాద్, సామ రంగారెడ్డి రెబెల్స్‌గా మారారు.



బీజేపీ పోటీ చేస్తున్న ఖైరతాబాద్‌లో టీడీపీ నగర నాయకుడు బీఎన్ రెడ్డి బరిలో నిలిచారు. సికింద్రాబాద్‌లో పి.ఎల్. శ్రీనివాస్, బద్రీనాథ్ యాదవ్...  బీజేపీ నేత రామచంద్రారావు పోటీ చేస్తున్న మల్కాజిగిరిలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ శారదా మహేష్, సుమలతా రెడ్డి తిరుగుబాటు చేశారు. మేడ్చల్ సీటును జంగయ్య యాదవ్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న నక్క ప్రభాకర్, సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్రులుగా నామినేషన్ వేశారు.



ఖమ్మం జిల్లాలో బీజేపీ పోటీలో ఉన్న పినపాకతో పాటు వైరా, కొత్తగూడ, భద్రాచలం, సత్తుపల్లి, ఖమ్మంతో పాటు నల్లగొండ, కొల్లాపూర్, దేవరకద్ర, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నుంచి కూడా టీడీపీ నేతలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. సుమారు 25 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ రెబెల్స్ మిత్రపక్షాల అభ్యర్థులకు తలనొప్పిగా మారారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top