కిరణ్ ది షోలే జైలర్ లాంటి పరిస్థితేనా? | Sakshi
Sakshi News home page

కిరణ్ ది షోలే జైలర్ లాంటి పరిస్థితేనా?

Published Sat, Mar 22 2014 12:45 PM

కిరణ్ ది షోలే జైలర్ లాంటి పరిస్థితేనా? - Sakshi

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢీలా పడిపోయారా? సమైక్యవాదిగా ముద్ర పడితే ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తారని అనుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి నిరాశ ఎదురైంది. మొన్నటి శ్రీకాకుళం రోడ్ షో అయినా, శుక్రవారం నాటి జగ్గయ్యపేట రోడ్ షో అయినా జనాన్ని ఆకర్షించలేకపోయింది.


జగ్గయ్యపేటలో లగడపాటి రాజగోపాల్ కి చాలా ప్రభావం ఉంది. ఇది ఆయన ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం. పైగా ఆయన మాజీ సీఎం స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి ప్రధాన సలహాదారు కూడా. లగడపాటి ఎంత ప్రయత్నించినా జనం రోడ్ షో పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. జనాలు రాకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగాన్ని హడావిడిగా ముగించేశారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయిల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు.


మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఎంపీ సాయిప్రతాప్ లు కూడా తెలుగుదేశం వైపు పక్కచూపులు చూస్తున్నారు. వీరిద్దరూ కిరణ్ పార్టీకి ఉపాధ్యక్షులు. షోలేలో జైలర్ అన్నట్టు 'సగం మంది కుడివైపు, సగం మంది ఎడమ వైపు, మిగిలినవారు నా వెంట రండి'  అన్నట్టుంది కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి!

Advertisement
Advertisement