మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సాక్షి, హైదరాబాద్: మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గజ్వేల్ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్.. లోక్‌సభకూ పోటీ చే యాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పుడు.. కేసీఆర్ కూడా అక్కడి నుంచే రంగంలోకి దిగితే ఎలా ఉంటుందన్న చర్చ జరిగింది. తర్వాత చంద్రబాబు పోటీపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఈ ఆలోచనను టీఆర్‌ఎస్ నాయకత్వం పక్కనబెట్టింది. కరీంనగర్, జహీరాబాద్ వంటి స్థానాలూ పరిశీలనకు వచ్చాయి. అయితే కేసీఆర్ సొంత నియోజకవర్గం సిద్ధిపేట, ఇప్పుడు పోటీచేయాలనుకుంటున్న గజ్వేల్ అసెంబ్లీ స్థానాలు మెదక్ లోక్‌సభ పరిధిలోనే ఉన్నాయి. దీంతో మెదక్ లోక్‌సభ స్థానమైతేనే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు.