దేశాన్ని దేవుడే రక్షించాలి | God protect the country | Sakshi
Sakshi News home page

దేశాన్ని దేవుడే రక్షించాలి

Apr 27 2014 4:04 AM | Updated on Mar 29 2019 9:24 PM

దేశాన్ని దేవుడే రక్షించాలి - Sakshi

దేశాన్ని దేవుడే రక్షించాలి

మోడీ మోడల్’ నుంచి దేశాన్ని దేవుడే రక్షించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు గొప్పగా చెబుతున్న ‘గుజరాత్ మోడల్’ వాస్తవానికి ‘మోడీ మోడల్’ అని వ్యాఖ్యానించారు.

‘మోడీ మోడల్’ పై సోనియా
 
 (పంజాబ్)/రాయ్‌బరేలి (యూపీ): ‘మోడీ మోడల్’ నుంచి దేశాన్ని దేవుడే రక్షించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు గొప్పగా చెబుతున్న ‘గుజరాత్ మోడల్’ వాస్తవానికి ‘మోడీ మోడల్’ అని వ్యాఖ్యానించారు. ఈ మోడల్‌తో గుజరాత్‌లో సామాన్యులు సతమతమవుతున్నారని చెప్పారు. అయినా దీన్ని గుజరాత్ పేరు చెప్పి బీజేపీ ప్రధాన ప్రచారకర్త (మోడీ) అమ్ముకుంటున్నారని విమర్శించారు. శనివారం పంజాబ్‌లోని మాల్వాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో సోనియా ప్రసంగించారు. నరేంద్ర మోడీ మోడల్ కింద గుజరాత్‌లో ఏం జరుగుతుందో తెలుసా? అని ప్రశ్నించారు.

గత 50 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న సిక్కులను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేలా ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. అయినా వారి గురించి బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) ఏనాడూ గళం వినిపించలేదని విమర్శించారు. మోడీ మోడల్ కింద రోజుకు సగటున రూ. 11 సంపాదన ఉన్నవారిని పేదలు (దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారు)గా పరిగణించట్లేదని, ఫలితం గా గుజరాత్‌లో ఐదేళ్లలోపు పిల్లల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని వివరించారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ప్రజలకు సురక్షిత నీరు అందట్లేదని చెప్పారు. మరోవైపు ఒకే ఒక్క పారిశ్రామికవేత్త (అదాని)కే దాదాపు 45 వేల ఎకరాల భూమిని అత్యంత చౌక ధరకు కట్టబెట్టేశారని విమర్శించారు. సామర్థ్యాలు, నైపుణ్యాలను బట్టిగాకుండా మతం, కులం, భాష ఆధారంగా సామాన్యుడికి గుర్తింపునిచ్చే విభజన సిద్ధాంతాన్ని బీజేపీ దత్తత తీసుకుందని విమర్శించారు.

కేంద్రంలో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని కాషాయం పార్టీ తహతహలాడుతోందని విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ విధానం బీజేపీకి భిన్నమైందని, దేశంలోని రైతులు, పేదలు, బలహీనవర్గాలు ఇలా ప్రతి పౌరుడి అభివృద్ధే తమ సిద్ధాంతం లక్ష్యమని సోనియా పేర్కొన్నారు. ఇక పంజాబ్‌లో పోలీసులకే రక్షణ లేదని, ఇక సామాన్యుల భద్రత గురించి ఏం మాట్లాడతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఏడీ-బీజేపీ నాయకత్వానికి మత్తుపదార్థాల స్మగ్లింగ్, దందాలు, అక్రమ మైనింగ్ స హా అన్ని రకాల నేరాల్లో సంబంధం ఉందని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement