మోడీపై ఎఫ్‌ఆఐర్

మోడీపై ఎఫ్‌ఆఐర్ - Sakshi


ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు

పోలింగ్ బూత్ వద్ద కమలం గుర్తు చూపుతూ ప్రసంగించిన మోడీ

మోడీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు


 

 అహ్మదాబాద్/న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అత్యుత్సాహానికి పోయి పెద్ద న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. బుధవారం ఆయన గాంధీనగర్‌లో ఓ పోలింగ్ బూత్‌లో ఓటేసిన తర్వాత ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ చిహ్నమైన కమలం గుర్తును పదేపదే ప్రదర్శించి, ప్రసంగించారు. దీంతో ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలపై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఆఐర్ నమోదు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టీవీ చానళ్లపైనా ఎఫ్‌ఐఆర్ పెట్టారు. ఈమేరకు డీజీపీ పీసీ ఠాకూర్ వెల్లడించారు.



బీజేపీ నేత అద్వానీ పోటీచేస్తున్న గాంధీనగర్‌లోని రానిఫ్ ప్రాంతంలో  మోడీ ఓటే శారు. తర్వాత బూత్ బయట విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేశారు. కమలం గుర్తును చేత్తో పెకైత్తి పదేపదే చూపుతూ, ఓటేసినందుకు గుర్తుగా సిరా పూసిన వేలు ప్రదర్శించారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కిన ఆయనపై అనర్హత వేటు తదితర చర్యలు తీసుకోవాలని  కాంగ్రెస్ లీగల్ సెల్ కార్యదర్శి కేసీ మిట్టల్ ఈసీని కోరారు. దీంతో ఎన్నికల సంఘం మోడీ ప్రసంగాన్ని తీవ్రంగా పరిగణించింది. మోడీ ప్రసంగ వీడియోను  క్షుణ్ణంగా పరిశీలించింది. పోలింగ్ రోజున ఎన్నికల సామగ్రి ప్రద ర్శన, బూత్‌లో ప్రసంగం ఎన్నికల చట్టాలను ఉల్లంఘించడమే కనుక మోడీపై, ఆయన కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టీవీ చానళ్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అహ్మదాబాద్ పోలీసులను ఆదేశించింది. ‘మొత్తం గుజరాత్‌తోపాటు దేశంలో పలుచోట్ల పోలింగ్ కొనసాగే సమయంలో సమావేశం పెట్టి ప్రసంగించడం ద్వారా మోడీ ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 126(1)(ఏ), 126(1)(బీ) నిబంధనలను ఉల్లంఘించారు... మోడీ మాటలసారాంశం, స్వరం, చేసిన ప్రకటనలు, కమలం గుర్తును ప్రదర్శించ డం ఈ రోజు(బుధవారం) జరిగే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన రాజకీయ ప్రసంగంలా ఉన్నాయి..’ అని ఢిల్లీలో విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. తమ ఆదేశాలను అమలు చేసి బుధవారం సాయంత్రం ఆరు గంటల్లోగా నివేదిక ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలన ఆదేశించింది. దీంతో వారు గడువులోగా నివేదిక ఇచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 126(1)(ఏ), 126(1)(బీ) సెక్షన్ల ప్రకారం పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు బహిరంగ సమావేశాలు నిర్వహించడం నిషిద్ధం. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడుతుందని  క్రైమ్ బ్రాంచ్ పోలీసు వర్గాలు చెప్పారు. మోడీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందుకు కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఈసీని అభినందించారు.

 

నిబంధనలు ఉల్లంఘించలేదు: బీజేపీ



 మోడీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించలేదని, ఆయన పోలింగ్ బూత్ వద్ద నిషేధిత ప్రాంతమైన వంద మీటర్ల అవతలే మీడియాతో మాట్లాడారని బీజేపీ తెలిపింది. ‘స్వేచ్ఛ గల మీడియా హక్కులకు ఎన్నికల కోడ్ కింద భంగం కలిగించవచ్చా? ఈ ఉదంతంలో రాజ్యాంగపరంగా పెద్ద ప్రశ్న తలెత్తింది’ అని పార్టీ ప్రతినిధులు రవిశంకర్ ప్రసాద్, మీనాక్షి లేఖి తదితరులు అన్నారు. అయితే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామన్నారు. కాగా,  నేరాలకు పాల్పడ్డం మోడీకి అలవాటని కాంగ్రెస్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ధ్వజమెత్తింది. ఉన్నతస్థాయి నేతలు ఓటేసిన తర్వాత కాసేపు మీడియాతో మాట్లాడడం మామూలే. అయితే మోడీ మీడియా సమావేశంలో 20 నిమిషాలు మాట్లాడడం అసాధారణంగా కనిపించింది.



 సెల్‌లో ఫొటోలు తీసుకున్న మోడీ



 మోడీ రానిప్ బూత్‌లో ఓటేసి బయటకొచ్చాక ప్రజలు పెద్ద సంఖ్యలో ‘మోడీ.. మోడీ’ అని చేతులూపుతూ ఆయనను పలకరించారు. తర్వాత మోడీ అక్కడే కుర్చీలో కూర్చుని మీడియాతో మాట్లాడారు. ఉన్నట్టుండి తన భద్రతా సిబ్బందిలో ఒకరి పిలిచారు. ఆ వ్యక్తి ఖరీదైన అత్యాధునిక సెల్‌ఫోన్‌ను జేబులోంచి తీసి మోడీకి అందించారు. మోడీ ఆ ఫోన్‌తో తన ఫొటో తీసుకోవ డానికి ప్రయత్నించారు.

 

 తొలి ఎఫ్‌ఐఆర్.. ఈ రోజును మరచిపోను


 

తిరుపతి: తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై మోడీ తిరుపతి సభలో స్పందించారు. ‘నా జీవితంలో ఇంతవరకూ నాకు వ్యతిరేకంగా ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదు. కనీసం రాంగ్‌సైడ్ స్కూటర్ డ్రైవింగ్, రాంగ్ పార్కిం గ్‌కు సంబంధించీ నమోదు కాలేదు. ఈ రోజు నేనిక్కడికొచ్చాక నాపై ఎఫ్‌ఐఆర్ పెట్టినట్లు అకస్మాత్తుగా తెలిసింది. ఏప్రిల్ 30ని నేనెన్నటికీ మరచిపోను. కత్తి, తుపాకీని ఎక్కుపెడితే అర్థం(బెదిరింపు) చేసుకోవచ్చు. అయితే నాపై ఎందుకు ఎఫ్‌ఐఆర్ పెట్టారో మీకు తెలుసా? ఎందుకంటే నేను జనానికి కమలాన్ని చూపినందుకు..’ అని అన్నారు. కాంగ్రెస్ ఎంతగా వణికిపోతోందో ఈ ఎఫ్‌ఐఆర్ చెబుతోందన్నారు. ఓటమిని ఎదుర్కొంటున్న ఆ పార్టీ.. ఒకప్పుడు బతకడానికి టీ అమ్మిన వ్యక్తి తనను సవాల్ చేస్తున్నాడని ఆందోళనపడుతోందన్నారు.

 .

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top