మున్సిపోల్స్ సమరం కీలక దశకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది.
సాక్షి, కడప : మున్సిపోల్స్ సమరం కీలక దశకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దీంతో అభ్యర్థులు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఆయా ప్రాంతాన్ని బట్టి ఓటుకు రేటు కడుతున్నారు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. మీకు ఎంత ఇవ్వాలని.. బేరసారాలను సాగిస్తున్నారు. మద్యం విచ్చల విడిగా పంపిణీ చేస్తున్నారు. ఓటర్లకు తాయిలాలు చూపి గాలం వేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. సకల మర్యాదలతో మచ్చిక చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా చివరి యత్నంగా అన్ని అస్త్రాలను సంధిస్తున్నారు.
తెర వెనుక యత్నాలు!
మున్సిపోల్స్‌లో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే డబ్బు పంపిణీ కార్యక్రమం పూర్తిఅయింది. కడప కార్పొరేషన్ పరిధిలో డబ్బు పంపిణీ చేస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే 11వ డివిజన్‌లో టీడీపీ నాయకులు మహిళలకు చీరెలు పంపిణీచేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మరికొన్నిచోట్ల ఫ్రెజర్‌కుక్కర్‌లనుకూడా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. అభ్యర్థులు ఏరియాను బట్టి ఓటుకు రూ. 500 నుంచి రూ. 1000 పంచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
కడపలో కొన్ని స్థానాలనైనా దక్కించుకుని తన ఉనికిని చాటుకునేందుకు టీడీపీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తోంది. పులివెందుల, జమ్మలమడుగులో ఓటర్లకు రూ.200 నుంచి రూ. 300 వరకు పంచుతున్నట్లు సమాచారం. కొన్ని వార్డుల్లోనైనా నామమాత్రపు పోటీ ఇచ్చేందుకు ఓ పార్టీ భారీగా డబ్బు ఎర చూపుతున్నట్లు సమాచారం. ఎర్రగుంట్లలో ఓ పార్టీ రూ. 600తో పాటు ముక్కు పుడకలు పంచేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రొద్దుటూరు, మైదుకూరులో ఓటుకు రూ. 500, బద్వేలులో రూ. 300-400 రేటు పలుకుతున్నట్లు సమాచారం. పోటీని బట్టి కొన్ని వార్డులలో రూ. 1000 పలకడంతోపాటు మరికొన్ని చోట్ల ముక్కు పుడకలు, చీరెలులాంటి వస్తువులతో ఓటర్లను మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది. మద్యం షాపులను మూసి వేసినప్పటికీ రాత్రి వేళల్లో మద్యం ఏరులై పారుతోంది. పోలింగ్‌కు గడువు 24 గంటలే ఉండడంతో అభ్యర్థులు చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు.