నటించాల్సిన దుఃఖానికి ప్రతిఫలం

Review On A Separation Novel In Sakshi Sahityam

కొత్త బంగారం  

‘ఇదంతా, అతి సమర్థురాలైన ఇసాబెల్లా ఫోన్‌తో మొదలయింది. క్రిస్టఫర్‌ ఎక్కడున్నాడని అడిగింది. మేము విడిపోయి ఆర్నెల్లయిందనీ, ఆమె కొడుకుతో నేను మాట్లాడి నెల దాటిందనీ చెప్పలేని ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నన్ను నెట్టింది’ అన్న మాటలతో ప్రారంభం అయ్యే ‘ఎ సెపరేషన్‌’ నవలలో– ప్రధాన పాత్రా, కథకురాలూ అయిన ముప్పైల్లో ఉన్న ‘ఫారినర్‌’ స్త్రీకి పేరుండదు. లండన్‌లో ఉంటుంది.
క్రిస్టఫర్‌ ధనిక కుటుంబంలో పుట్టినవాడు. అప్పటికే ఒక పుస్తకం రాసి పేరు తెచ్చుకున్నవాడు. గ్రీస్‌ దేశపు అంత్యక్రియల్లో– సంతాపం వెల్లడిస్తూ ఏడ్చే వృత్తి వారి గురించి పరిశోధించడానికి వెళ్ళాడని ఇసాబెల్లా తనతో చెప్పినప్పుడు, ‘ఇప్పటివరకూ ఒక పెంపుడు కుక్కనూ కోల్పోని మనిషికి దీనిమీదున్న ఆసక్తి వింతైనదే’ అనుకుంటుంది.
కథకురాలు అనువాదకురాలు. ఆ పనిలో ఉండే ‘స్తబ్దత’ ఆమెకు నప్పుతుంది. ఐదేళ్ళ వైవాహిక జీవితం తరువాత, క్రిస్టఫర్‌కు ఉండే దాంపత్య ద్రోహపు అలవాటుతో విసిగిపోయిన ‘నేను’తో తాము విడిగా ఉన్నామని ఎవరికీ చెప్పొద్దంటాడు అతను.
‘మా పెళ్ళి– క్రిస్టఫర్‌కు తెలిసిన, నాకు తెలియని విషయాలతో ఏర్పడినది. ..నమ్మకద్రోహం అన్నది ఒక భాగస్వామిని తెలుసుకునే పరిస్థితిలో పెట్టి, మరొకరిని చీకట్లో ఉంచుతుంది... కోడలిగా ఇది నా ఆఖరి బాధ్యత’ అనుకున్న ఆమె గెరిలిమెనిస్‌ అన్న గ్రీస్‌ కుగ్రామంలో క్రిస్టఫర్‌ ఉండిన నిర్జనమైన హోటల్‌కు వెళ్తుంది. అతను గదిలో ఉండడు. మరీయా అన్న రెసెప్షనిస్ట్, టాక్సీ డ్రైవర్‌ స్టీఫానోకూ తను క్రిస్టఫర్‌ భార్యనని పరిచయం చేసుకున్నప్పుడు మరీయా ఈర‡్ష్య పడుతుందని గమనిస్తుంది. క్రిస్టఫర్‌ తనతో పడుకున్నాడని ఒకానొక సందర్భంలో మరీయాయే ఒప్పుకున్నప్పుడు, ‘క్రిస్టఫర్‌లాంటి మనిషికి ఎప్పుడూ ‘తర్వాతి స్త్రీ’ ఉండనే ఉంటుంది’ అనుకుంటుంది.
అనాసక్తిగా హోటల్లో గడుపుతూ – వైవాహిక సంబంధాలలో ఉండే జఠిలతా, వివాహ విచ్ఛిన్నతకుండే అనిర్ధారిత ఎల్లల గురించి విశ్లేషించుకుంటున్నప్పుడు, క్రిస్టఫర్‌ గురించి తనకేమీ తెలియదని గుర్తిస్తుంది. క్రిస్టఫర్‌ గదికి వెళ్ళినప్పుడు, అతని లాప్‌టాప్‌లో అశ్లీల చిత్రాలు కనబడతాయి. 
అక్కడి నివాసులతో మాట్లాడ్డానికి ఎంత మర్యాద, గోప్యత అవసరమో అర్థం కాదామెకు. ఆ ఊరి శోకించే స్త్రీ వద్దకు వెళ్తుంది. ఆమె తమ ఆచారాన్ని ప్రదర్శించినప్పుడు ‘యీమె స్వర సామర్థ్యానికీ, అభినయానికీ కాక మరొకరి స్థానాన తాను బాధను అనుభవిస్తున్న కారణంగానే యీమెకి డబ్బు ముడుతుంది’ అని అనుకుంటుంది. 
మరుసటి రోజు– క్రిస్టఫర్‌ శరీరం కందకంలో పడుందని, గుర్తు పట్టడానికి పోలీస్‌ స్టేషన్‌కు రావాలని ఆమెకు చెప్తారు. ఎవరో అతని పర్స్‌ దొంగిలించి అతని తలమీద కొట్టడంతో అతను చనిపోతాడు. ‘గ్రీస్‌లో యీ పోలీస్‌ స్టేషన్‌ ద్వారం వద్ద నేను అదృశ్యమయ్యాను’ అనుకుంటూ, అత్తమామలకి వార్త చెప్పగానే వారొచ్చి మృతదేహాన్ని లండన్‌ తెస్తారు.
కొన్ని నెలల తరువాత ఆమెకు క్రిస్టఫర్‌ భార్యగా ముప్పై లక్షల బ్రిటిష్‌ పౌండ్లు సంక్రమిస్తాయి. తమ దాంపత్య నటనని నిలబెట్టడానికి ఆ డబ్బు తీసుకుంటుంది. ‘భార్య, భర్త, పెళ్ళి అన్న మాటలు కేవలం అస్థిర వాస్తవాలను దాచిపెట్టేవి’ అనుకుంటుంది.
రచయిత్రి కేటీ కిటమురా క్లిష్టమైన భాషలో రాసిన ఈ పుస్తకంలో పెద్ద కథాంకం అంటూ ఉండదు. అంతర్గత ఏకభాషణతోనే సాగుతుంది. ఆలోచనలు, భావసూచనలు, చేష్టలను పట్టిపట్టి చూస్తుంది కథకురాలు. వచనం వాడిగా ఉంటుంది. వాక్యాలు లయబద్ధంగా ఉండటం వల్ల శైలి ఆకర్షణీయంగా అనిపిస్తుంది. నవలంతటా– క్రిస్టఫర్‌ ఒక జ్ఞాపకమే అయినప్పటికీ, వివరాలన్నీ అతని చుట్టూనే తిరుగుతాయి. ఉన్న కొద్దిపాటి డైలాగుల్లోనూ కొటేషన్‌ మార్క్స్‌ ఉండక, అవీ భూతకాలంలో ఉన్న కథనంలో కలిసిపోతాయి. నవలను పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ 2017లో ప్రచురించింది.
రచయిత్రి జపనీస్‌ సంతతికి చెందినవారు. అమెరికా, కాలిఫోర్నియాలో పుట్టి పెరిగారు. పత్రికలకు రాస్తుంటారు. కళా విమర్శకురాలు. ప్రస్తుతం, ‘ద లండన్‌ కన్సార్టియం’లో హానరరీ రీసెర్చ్‌ ఫెలోగా చేస్తున్నారు. భారత సంతతి బ్రిటిష్‌ రచయిత హరి కుంజ్రును పెళ్లి చేసుకున్నారు.
కృష్ణ వేణి
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top