కాలుష్యంపై పోరాడితే కాల్పులా?!

Is Protest Against Sterlite Pollution Crime - Sakshi

వాయు కాలుష్యానికీ, జల కాలుష్యానికీ కారణమవుతూ తమ ప్రాణాలను కొంచెం కొంచెంగా పీల్చేస్తున్న మాయదారి స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని మూసేయాలని కోరుతూ రోడ్డెక్కిన ఆందోళనకారులపై తమిళనాడులోని తూత్తుకుడిలో మంగళవారం కాల్పులు జరిగి 11మంది నేలకొరిగిన ఉదంతం అత్యంత విషాదకరమైనది. తమపాలిట మృత్యువుగా మారిన సంస్థ ఉండటానికి వీల్లేదని ఆగ్రహిం చినవారు ఆ క్రమంలో సొంత ప్రాణాలనే పణంగా పెట్టాల్సిరావడం ఎంత ఘోరం? నిరసనలనూ, ఆందోళనలనూ మొగ్గలోనే తుంచాలని చూడటం, అది సాధ్యం కాకపోతే వాటిపై దుష్ప్రచారానికి దిగడం, అందులోనూ విఫలమయ్యాక బలప్రయోగానికి పూనుకోవడం ప్రభుత్వాలన్నిటికీ రివాజుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారుదీ ఇదే వరస.

పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా పార్కును వ్యతిరేకిస్తున్న జనంపై అది సాగిస్తున్న జులుం శ్రుతిమించుతోంది. వేదాంత సంస్థ నేతృత్వంలోని స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ వ్యవహారం ఇలాంటి ధోరణులకు భిన్నమైనదేమీ కాదు. జరిగిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం సాకులు వెదుకుతోంది. 20వేలమంది ప్రజానీకం నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంవైపు దూసుకొచ్చారని, వారిని ఆపేం దుకు పోలీసులు ప్రయత్నిస్తే రాళ్లు రువ్వారని, ప్రభుత్వ ఆస్తులకు నిప్పెట్టారని... దాంతో కాల్పులు తప్పనిసరయ్యాయని సంజాయిషీ ఇస్తోంది. నిజమే... వేలాదిమందితో నిరసనలు జరిగినప్పుడు అనుకోని ఘటనలు చోటుచేసుకోవడానికి ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. కనుకనే ఉద్యమాలు శైశవ దశలో ఉన్నప్పుడే ప్రభుత్వాలు మేల్కొనాలి. ప్రజల డిమాండ్లలోని సహేతుకతను గుర్తించాలి. వారి భయాందోళనలు నిరాధారమైనవనుకున్నప్పుడు ఆ సంగతే వారికి చెప్పాలి. ఒప్పించగలగాలి. పాల కులుగా ఇది వారి బాధ్యత. 

స్టెరిలైట్‌ వ్యతిరేక ఉద్యమం ఈనాటిదా? అది ఫ్యాక్టరీ స్థాపించిన 1998లోనే రాజుకుంది. ఈ ఉద్యమం ఒక్క స్టెరిలైట్‌ కంపెనీపై మాత్రమే కాదు... ఫ్యాక్టరీవల్ల పర్యావరణానికి కలిగే హానిని దాచి పెట్టి అనుమతులు మంజూరు చేసిన జిల్లా యంత్రాంగంపైనా, తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలిపైనా కూడా స్థానికులు కన్నెర్ర చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ వల్ల ఏమాత్రం నష్టం లేదని చెబు తున్న సర్కారు... అది మహారాష్ట్ర నుంచి తమిళనాడు ఎందుకు వలస వచ్చిందో చెప్పాలి. 1992లో మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌ స్టెరిలైట్‌కు అక్కడి రత్నగిరి జిల్లాలో 500 ఎకరాలు కేటాయిస్తే ఆ మరుసటి సంవత్సరం దాని పనులు మొదలయ్యాయి. రాగిని కరిగించగల భారీ స్మెల్టర్‌ నిర్మాణానికి సంస్థ పూనుకున్నప్పుడు స్థానికులు తిరగబడి ఆందోళన చేయడం పర్యవసానంగా అక్కడి ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదికతో ప్రాజెక్టు నిలిచిపోయింది. 

మహారాష్ట్రలో హానికారకమని నిలిపేసిన ప్రాజెక్టు తమిళనాడుకు నచ్చింది. 1994లో అక్కడి కాలుష్య నియంత్రణ మండలి ‘నో అబ్జెక్షన్‌’ సర్టిఫికెట్‌ మంజూరు చేసింది. పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) చేయాలని స్టెరిలైట్‌కు సూచించింది. అంతేకాదు... విభిన్న జలచరాలుండే మన్నార్‌ జలసంధి జీవావరణ రిజర్వ్‌కు ప్రతిపాదిత ఫ్యాక్టరీ 25 కిలోమీటర్ల దూరం ఉండాలని నిర్దేశించింది. స్టెరిలైట్‌ ఈఐఏను సమర్పించకుండానే 1995లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు వచ్చేశాయి. ఫ్యాక్టరీ నిర్మాణానికి మండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మన్నార్‌ జలసంధికి 14 కిలోమీటర్ల దూరంలో ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఉత్పాదకత మొదలుపెట్టడానికి చకచకా అను మతులు వచ్చాయి. ఫ్యాక్టరీ చుట్టూ 25మీటర్ల మేర గ్రీన్‌బెల్ట్‌ నిర్మించాలన్న షరతు మాత్రం విధించారు. అదీ బేఖాతరైంది.

ఉత్పత్తి మొదలైన ఏడాదిలోపే స్థానికులనుంచి ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. పరిసరాల్లోని భూగర్భ జలాలు కలుషితం కావడం, ఫ్యాక్టరీ పొగతో ఎందరో అస్వ స్థులవుతుండటం రివాజుగా మారింది. ప్రతి ఫిర్యాదూ బుట్టదాఖలైంది. కాలుష్య నియంత్రణ మండలి, నాగ్‌పూర్‌లోని జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్‌ పరిశోధనా సంస్థ(నీరీ) క్లీన్‌చిట్‌ ఇస్తూనే ఉన్నాయి. స్థానికులు మాత్రం నానా కష్టాలూ పడుతున్నారు. అప్పుడప్పుడు పరిస్థితి తీవ్రత గమ నించి ఉత్పాదకత నిలిపేయాలని ఆదేశిస్తే, దాని పునరుద్ధరణకు అనుమతి కోరకుండానే కార్య కలాపాలు ప్రారంభించేవారని ఉద్యమకారుల ఆరోపణ. రాగిని కరిగించే ప్రక్రియ వల్ల సల్ఫర్‌ డై ఆక్సైడ్, సీసం, ఆర్సెనిక్‌ తదితర ప్రమాదకర పదార్థాలు గాలిలో, భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి.

ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై 2013లో తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు 1997–2012 మధ్య పదిహేనేళ్లపాటు ఈ సంస్థ పర్యావరణ విధ్వంసానికి కారణమైందని నిర్ధారించింది. అయితే ఫ్యాక్టరీ మూతపడాలన్న డిమాండుతో ఏకీభవించలేదు. అందువల్ల 1,300 మంది ఉద్యోగులు రోడ్డున పడటమే కాక... రక్షణ, విద్యుత్‌ రంగాలతోపాటు ఆటోమొబైల్, నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాల రంగం దెబ్బతింటాయని అభిప్రాయపడింది. అయితే చేసిన విధ్వంసానికి పరిహారంగా పరిహారంగా కలెక్టర్‌ వద్ద రూ. 100 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. కానీ ఇంతవరకూ దానిలో ఒక్క పైసా కూడా బాధితులకు విదిల్చిన వైనం కనబడదు. చావసిద్ధపడితే తప్ప బతకడం సాధ్యం కాదని స్థానికులు భావించడంలో ఆశ్చర్యమేముంది? తూత్తుకుడి విధ్వంసాన్ని ఆపాలంటున్న జనంవైపో... చట్టాలను ఉల్లంఘిస్తున్న కార్పొరేట్‌ సంస్థ లవైపో తమిళనాడు ప్రభుత్వం తేల్చుకోవాలి. ఆ విషయంలో సరైన నిర్ణయం జరిగేవరకూ ఆందోళన చల్లారదు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top