నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల
నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం ఇన్‌చార్జి కలెక్టర్ హరికిరణ్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
– నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
– చివరి తేదీ ఈనెల 30
– 31న జెడ్పీ హాల్‌లో లక్కీడిప్
కర్నూలు(టౌన్): నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం ఇన్‌చార్జి కలెక్టర్ హరికిరణ్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈనెల 30వ తేదీ గడువు ముగుస్తుంది. 31న స్థానిక జిల్లాపరిషత్ సమావేశ భవనంలో లక్కీడ్రా ద్వారా మద్యం షాపులను కేటాయిస్తామని ఇన్‌చార్జి కలెక్టర్ హరికిరణ్ వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం షాపుల కేటాయింపు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండాలన్న నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని రూపొందించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న 163 షాపులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 203 మద్యం షాపులు ఉన్నాయన్నారు. 500 మీటర్ల లోపు కర్నూలు డివిజన్ పరిధిలో 86, నంద్యాల డివిజన్ పరిధిలో 77 షాపులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీటిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
టెండర్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టండి...
– ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ శ్రీరాములు
టెండర్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ శ్రీరాములు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయంలో నంద్యాల, ఆదోని ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాలు, నగర పంచాయతీలు, మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో జనాభా ప్రాతిపదికన ఏడు స్లాబ్‌లలో లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
జనాభా లైసెన్స్ ఫీజు లక్షల రూపాయల్లో
5 వేల లోపు 7.5
10 వేలు.. 8.5
25 వేలు 9.25
50 వేలు 10
3 లక్షలు 11.25
5 లక్షలు 12.5
ఆపైన 16.25