నోరు జారడం, కూడదీసుకోవడం మన రాజకీయ నాయకులకు బాగా అలవాటైన విద్య.
నోరు జారడం, కూడదీసుకోవడం మన రాజకీయ నాయకులకు బాగా అలవాటైన విద్య. అందరినీ కలవరపరిచే సమస్యపై తొందరపడి ఏదో అనేయడం, ఎలా తోస్తే అలా నిర్ణయం తీసుకోవడం, ఆనక తీరిగ్గా విచారించడం ఈమధ్యకాలంలో తరచు చూస్తున్నాం. సున్నితంగా ఆలోచించే మనస్తత్వాన్ని కోల్పోతే, సమస్యను లోతుగా విశ్లేషించుకునే తత్వాన్ని అలవరచుకోకపోతే, బండబారితే వచ్చే ఫలితమిది. అలాంటివారి జాబితాలో తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరినట్టు కనబడుతోంది. ఆయన ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా మూడోసారి అధికారంలోకొచ్చి చరిత్ర సృష్టించారు. 230 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి 165 స్థానాలు లభించాయి. అయితే, ఆ విజయం సమస్యలను గుర్తించడంలో, పరిష్కారాలు వెదకడంలో దృష్టిని మసకబార్చకూడదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈమధ్య రూపొందించిన ఒక పుస్తకం చూస్తే అలాంటి పరిస్థితి ఏర్పడిందన్న అనుమానం కలుగుతుంది. కాలకృత్యాలను బహిర్భూమిలో తీర్చుకునే వారిని దారికి తెచ్చేందుకు అనుసరించాల్సిన విధానాలను ఆ పుస్తకం నిండా ఏకరువు పెట్టారు. ఆ సమస్యపై ఎలాంటి అవగాహనా లేనివారు దాన్ని రూపొందించారని పుస్తకం చూడగానే ఎవరికైనా అర్ధమవుతుంది. దాన్నిండా సూచించిన పరిష్కారాలు భయంకరమై నవి. అనాగరికమైనవి. అందరూ నిరసించేవి.
కాలకృత్యాలను బహిర్భూమిలో తీర్చుకొనే స్థితి ఉండటం నిజంగా బాధాకరమైన విషయం. స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు దాటుతున్నా మరుగుదొడ్లు లేని ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో 67 శాతం వరకూ ఉన్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాతీయ సగటుకు మించి ఉన్న రాష్ట్రాల్లో అగ్రస్థానం జార్ఖండ్‌ది కాగా, దాని తర్వాత స్థానం మధ్యప్రదేశ్‌ది. జార్ఖండ్‌లో 91 శాతం ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు. మధ్యప్రదేశ్ 86 శాతంతో రెండోస్థానంలో ఉంది. మరుగుదొడ్లపై చేసే ఖర్చు వృథా వ్యయమని గ్రామీణ ప్రాంతాల్లో భావిస్తారని నిపుణులు చెప్పే మాటల్లో అర్థసత్యమే ఉంది. పల్లె ప్రజానీకం సెల్‌ఫోన్లపైనా, కలర్ టీవీ సెట్లపైనా ఖర్చు చేస్తారు తప్ప మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు రారని కేంద్రమంత్రి జైరాం రమేష్ గతంలో అన్నారు. అయితే, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం పర్యవసానంగా రెండు పూటలా తినడానికే తిండిలేని పరిస్థితులున్నప్పుడు ప్రజలు ఇలాంటి వ్యామోహాలకు లోనవుతున్నారనడం హాస్యాస్పదమవుతుంది. బహిర్భూమికి వెళ్లే పరిస్థితులుండటంవల్ల మహిళలపైనా, బాలికలపైనా నేరాలు ఎక్కువ జరుగుతున్నాయని జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఈ తరహా నేరాలు మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నాయి. వాటిని సాధించలేక చతికిలబడుతు న్నాయి. మధ్యప్రదేశ్ విషయమే తీసుకుంటే పట్టణ ప్రాంతాల్లో 2017కు, గ్రామీణ ప్రాంతాల్లో 2025కు అన్ని ఇళ్లకూ మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆ దిశగా వేసిన అడుగులు గమనిస్తే నిరాశ కలుగు తుంది. కొత్తగా పెళ్లయి అత్తారింటికొచ్చి, మరుగుదొడ్డి లేదని తెలిసి వెనుదిరిగి సంచలనం సృష్టించిన అనితాబాయిని మరుగుదొడ్ల విషయమై చైతన్యం కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. కానీ, అందుకోసం ఆమెకు అందించిన మొత్తం రూ. 500 మాత్రమే. ఈ సొమ్ముతో జిల్లాలకు వెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నిస్తే జవాబిచ్చేవారే లేరు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం కుటుంబాలకిచ్చే సొమ్ము కూడా అరకొరగానే ఉంటున్నదని గ్రామీణుల ఆరోపణ. వాస్తవాలు ఇవికాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పుస్తకం ఈ లోటుపాట్లపై దృష్టి సారించడం మాని చిత్రమైన పరిష్కారాలను సూచిస్తున్నది. అందులో బహిర్భూమికెళ్లేవారిపై కేకలేయడం దగ్గర్నుంచి అలాంటివారిని ఫొటోలు తీయడం వరకూ ఎన్నెన్నో ఉన్నాయి. ఆ పుస్తకంలో ముద్రించిన రేఖాచిత్రాలు కూడా ఈ సూచనలతో పోటీపడ్డాయి. అందరికీ కంపరం పుట్టించాయి. సమస్య తీవ్రతను, దానికి గల కారణాలనూ అర్ధం చేసుకోకుండా... అందులో తమ వైఫల్యం పాత్ర ఎంతో గమనించుకోకుండా పౌరులను తప్పుబట్టేలా, వారిని అవహేళన చేసేలా రూపొందించిన ఈ పుస్తకం ప్రభుత్వాధినేతల కళ్లుగప్పి వచ్చిందనుకోవడానికి లేదు. ఆ పుస్తకానికి శివరాజ్‌సింగ్ చౌహాన్ ముందుమాట కూడా ఉంది.
దేశంలో రెండున్నర లక్షల గ్రామాలుండగా అందులో కేవలం దాదాపు 30,000 గ్రామాల్లో మాత్రమే ఇంటింటికీ మరుగుదొడ్లు ఉన్నాయని ప్రపంచబ్యాంకు నివేదిక ఆమధ్య వెల్లడించింది. ఈ గ్రామాలను మాత్రమే అది సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా పరిగణనలోకి తీసుకుంది. సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్మల్ గ్రామ పురస్కారాలను ఏర్పాటుచేసినా ప్రణాళికా సంఘం వంటివి దీనిపై పూర్తి దృష్టి పెట్టకుండా పరిష్కారం లభించదు. అసలు ప్రభుత్వ పాఠశాలలన్నిటా మరుగుదొడ్లు ఉండేలా చూడమని సుప్రీంకోర్టు ఆదేశించడం మొదలెట్టి రెండేళ్లవుతోంది. ప్రతి వాయిదాకూ ప్రభుత్వపరంగా హామీలివ్వడమే తప్ప ఆచరణలో ఎలాంటి ఫలితమూ ఉండటం లేదు. ఇప్పటికీ దేశంలో లక్షలాది పాఠ శాలలకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు. సుప్రీంకోర్టు దృష్టిపెట్టిన సమస్య విషయం లోనే పరిస్థితి ఇలావుంటే మిగిలినవాటి గురించి చెప్పేదేముంటుంది? సమస్యల్ని గుర్తించి, పరిష్కారాల గురించి ఆలోచించి, అవసరమైన పథకాల రూపకల్పనకు పూనుకోవాల్సిన పాలకులు అందుకు విరుద్ధంగా ప్రజలనే తప్పుబట్టాలని చూడటం చేతకానితనమే అవుతుంది. ప్రక్షాళనో, పారిశుద్ధ్యమో ముందు తమ మెదళ్లకు జరగాలని ఆ పుస్తక రచయితలు, దానికి అంగీకారం తెలిపిన పాలకులు గ్రహించాలి.