సౌదీతో సాన్నిహిత్యం

Editorial On Prime Minister Narendra Modi Visit To Saudi Arabia - Sakshi

ఏ దేశంలోనైనా సంస్కరణలు ఊపందుకుని ఆర్థిక సామాజిక రంగాల్లో చలనం అధికంగా కనిపిం చినప్పుడు అది ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. అక్కడకు వివిధ దేశాల అధినేతల రాకపోకలు పెరుగుతాయి. ఆ దేశంలో పెట్టుబడులపరంగా, వాణిజ్యపరంగా విస్తృతమైన అవకాశాలు ఏర్పడటం అందుకు కారణం. ఆ కోణంలో సౌదీ అరేబియా ఇప్పుడు చాలామందిని ఆకర్షిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే మంగళవారం ఆ దేశంలో రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ రూపొందించిన విజన్‌–2030 ఎనిమిది దేశాలతో సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పుకొనాలని నిర్దేశిస్తోంది. అందులో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్‌లతోపాటు మన దేశం కూడా ఉంది. సౌదీ అరేబియాకు ఇతరేతర దేశాలతో ఉన్న సంబంధాలు మాటెలా ఉన్నా మనతో అది సౌహార్ద సంబంధాలే కొనసాగిస్తూ వస్తోంది. ఈ ఏడాది మొదట్లో సౌదీ అరేబియా యువ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మన దేశంలో పర్యటించారు.

అప్పుడు భారత్‌లో ఇంధనం, ఖనిజాలు, మౌలిక సదుపాయాలు, పెట్రో కెమికల్స్, చమురుశుద్ధి, విద్య, తయారీరంగం తదితరాల్లో రూ. 10,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన కుదిరింది. దానికి కొనసాగింపుగా మోదీ పర్యటనలో ఒప్పందాలపై సంతకాలవుతాయి. దాంతోపాటు మంగళవారం రియాద్‌లో ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్షియేటివ్‌(ఎఫ్‌ఎఫ్‌ఐ) ఫోరం ఆధ్వర్యంలో ప్రారంభమైన వార్షిక సద స్సులో కూడా మోదీ పాల్గొన్నారు. 2024కల్లా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు సంకల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. సౌదీతో మన ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 2,750 కోట్ల డాలర్లు. మన చమురు అవసరాల్లో 83 శాతం దిగుమతుల ద్వారానే తీరు తుండగా ఇరాక్‌ తర్వాత భారత్‌కు భారీగా ముడి చమురు సరఫరా చేసే దేశం సౌదీ అరేబియానే. 2018–19లో మన దేశం 20 కోట్ల 73 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకోగా అందులో సౌదీ వాటా 4 కోట్ల టన్నులపైనే. సౌదీకి చెందిన ఆరామ్‌కో ప్రపంచంలోనే అత్యధిక లాభాలు గడిస్తున్న చమురు సంస్థ. ఆ దేశంలో 27,000 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయని అంచనా. కనుక చమురు రంగంలో సౌదీ అరేబియా స్థానం తిరుగులేనిది.

అయితే భారత్‌–సౌదీ అరేబియాల మధ్య సహకారం కేవలం చమురు–ఇంధన రంగాలకు మాత్రమే పరిమితమై లేదు. ఇరు దేశాల అధినేతలూ తీసుకున్న చొరవ కారణంగా ఈ సహకారం బహుళరంగాలకు విస్తరించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, రక్షణ, సాగర భద్రత, పెట్టుబడులు, పర్యాటకం తదితర అనేక రంగాలకు విస్తరించింది. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఆర్థిక సంస్కరణల కార్యక్రమం భారీయెత్తున సాగుతోంది. అందులో గణనీయమైన భాగస్వామ్యం ఇవ్వడంతోపాటు మన దేశంలోని పెట్రోకెమికల్స్, మౌలిక సదుపాయాలు, మైనింగ్‌ తదితర రంగాల్లో సౌదీ సహకారం అందించాలని మన దేశం కోరుకుంటోంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఇటువంటి పరిస్థితి లేదు. మనకు అప్పటికి సోవియెట్‌ యూనియన్‌గా ఉన్న రష్యాతో మంచి సంబంధాలుండేవి. అటు సౌదీ అరేబియా అమెరికా అనుకూల వైఖరితో ఉండేది. దానికితోడు భారత్‌తో సంబంధాల విషయం వచ్చేసరికి అది పాకిస్తాన్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించేది. ఇప్పుడు అదంతా మారింది. రెండు దేశాలూ సకల రంగాల్లో సన్నిహితం కావాలని నిర్ణయించాయి. కశ్మీర్‌ భారత్‌ ఆంతరంగిక వ్యవహార మని, దాని జోలికి పోవద్దని సౌదీ నేతలు భావించారు. జమ్మూ–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం, 370 అధికరణను రద్దుచేయడం వంటి అంశాల్లో ఈ కారణం వల్లే సౌదీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. టర్కీ తరహాలో సౌదీ కూడా స్పందిస్తుందనుకున్న పాకిస్తాన్‌ ఈ పరిణామంతో ఖంగుతింది.

 పొరుగునున్న పాకిస్తాన్‌ నుంచి మనకు ఉగ్రవాద బెడద ఉన్నట్టే సౌదీ అరేబియాకు కూడా ఇరుగు పొరుగు నుంచి ముప్పు కలిగే ప్రమాదం ఉంది. ఇటీవలే అక్కడి ఆరామ్‌కో చమురుశుద్ధి కర్మా గారంపై ద్రోన్‌ దాడులు జరిగి భారీ నష్టం సంభవించింది. పశ్చిమాసియాలో సైనికపరంగా సౌదీ శక్తిమంత మైనదే అయినా, ఏటా అది ఆయుధాల కోసం వందలకోట్లు వెచ్చిస్తున్నా, ఉగ్రవాద వ్యతి రేక పోరులో దానికి అనుభవం తక్కువ. కనుకనే ఈ రంగంలో సహకరించుకోవాలని భారత్, సౌదీ అరేబియాలు నిర్ణయించుకున్నాయి. ఉమ్మడి సైనిక శిక్షణ కార్యక్రమాలు, విన్యాసాలు జరపడం ఇలాంటి లోటు పాట్లను తీరుస్తుంది. ఫిబ్రవరిలో బిన్‌ సల్మాన్‌ మన దేశంలో పర్యటించినప్పుడు ఈ విషయంలో ఒప్పందం కుదరింది. అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సౌదీ వెళ్లి దానికి కొన సాగింపుగా చర్చలు జరిపారు.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాది మొదట్లో రెండు దేశాల ఉమ్మడి నావికా దళ విన్యాసాలు జరుగుతాయి. అంతరిక్ష సాంకేతికతపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సౌదీ నిర్ణయించింది. కనుక ఈ రంగంలో సైతం మన దేశానికి అవ కాశాలు బాగా పెరుగుతాయి. రిమోట్‌ సెన్సింగ్, ఉపగ్రహ కమ్యూనికేషన్లు, ఉపగ్రహ ఆధారిత సము   ద్రయాన నిర్వహణ వగైరాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు అపారమైన అనుభవం ఉంది. వీటన్నిటా రెండు దేశాలూ కలిసి పనిచేస్తే ఉమ్మడిగా లాభపడటానికి అవకాశాలుంటాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాలూ చాలా రంగాల్లో సన్నిహితమయ్యాయి గనుక ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి వెళ్తాయి. అయితే రెండు దేశాల మధ్య ఏర్పడే ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే అవి రెండూ తమ జాతీయ ప్రయోజనాలపైనే దృష్టిపెట్టాలి తప్ప మూడో దేశం ప్రయోజనాల గురించి ఆలోచించకూడదు. భారత్, సౌదీ అరేబియాలు రెండూ ఈ అంశాన్ని గమనంలోకి తీసుకుంటే అచిరకాలంలోనే ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top