అతడి జననం ఒక పేద తల్లి ఆనంద బాష్పం. అతడి మరణం లక్షలాది హృదయాల విషాదగీతం. ఒక కవి చెప్పినట్టు జనన మరణాల మధ్య
అతడి జననం ఒక పేద తల్లి ఆనంద బాష్పం. అతడి మరణం లక్షలాది హృదయాల విషాదగీతం. ఒక కవి చెప్పినట్టు జనన మరణాల మధ్య మనిషికి లభించే ‘రెప్పపాటు’ జీవితాన్ని ఎంతో అర్ధవంతంగా గడిపారు గనుకే సోమవారం సాయంత్రం కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంను ఈ దేశ ఉత్తమ పుత్రుడిగా కీర్తిస్తూ కేంద్ర మంత్రివర్గం ఘనంగా నివాళులర్పించింది. కలాం కన్నా ముందూ... తర్వాతా ఎందరో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అధిరోహించారు. కలాం తరహాలోనే వారిలో భిన్న రంగాల్లో నిష్ణాతులైనవారూ, చెరగని ముద్రేసినవారూ ఎందరో ఉన్నారు. కానీ ఆయనలా జనంతో, మరీ ముఖ్యంగా యువతతో... విద్యార్థిలోకంతో మమేకమైనవారు మాత్రం ఎవరూ లేరు. రాష్ట్రపతి భవన్ తలుపుల్ని సామాన్య పౌరుల కోసమని తెరిచి ఉంచినవారూ లేరు.
కేవలం జాతీయ దినోత్సవాల సమయంలో మాత్రమే ఎవరికైనా అందులో ప్రవేశం. అయితే ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్న అయిదేళ్లూ ఆ సంప్రదాయాన్ని తోసిరాజని సాధారణ పౌరులకు అది సందర్శనా స్థలి అయింది. విద్యార్థులకూ, భిన్నరంగాల్లోని నిపుణులకూ అక్కడ ఆదరణ లభించేది. ఆయన ‘ప్రజా రాష్ట్రపతి’గా కీర్తిప్రతిష్టలం దుకున్నది ఆ కారణంవల్లనే. ప్రొటోకాల్ పట్టింపు లేదు...లాంఛనాల యావ లేదు. అధికారిక భద్రతా వలయాలంటే ఇష్టమే లేదు. సందర్భం ఏదైనా కావొచ్చు...ఎక్కడికెళ్లినా ఆయన కళ్లు వెదికేది పసి పిల్లలనూ, యువతనే! వారిపై ఆయనకు అంతటి అచంచల విశ్వాసం. సమాజానికి సంబంధించిన దురభిప్రాయాలు కావొచ్చు, పక్షపాతం కావొచ్చు... వారి దరి చేరవన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. వారిలో చైతన్యాన్ని రగిలిస్తే, వారి హృదయాల్లో ఒక చిరు దివ్వెను వెలిగిస్తే అది ఇంతింతై దేశమంతటినీ తేజోమయం చేస్తుందని ఆయన నిండైన విశ్వాసంతో చెప్పేవారు. కలాంకు నివాళిగా ఆయన జన్మదినమైన అక్టోబర్ 15ను అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది అందుకే! శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించి, ఎన్నో పరిశోధనల్లో పాలుపంచుకుని, దేశం గర్వించదగిన క్షిపణి వ్యవస్థను సృజించి, దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగి భారత రత్న పురస్కారాన్ని సైతం పొందారు కలాం. లోహ శాస్త్రంలో తాను పొందిన ప్రావీణ్యాన్ని ఉపయోగించి హృద్రోగులకు అవసరమైన స్టెంట్, వికలాంగులకు తోడ్పడే తేలికపాటి కాలిపర్స్ రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఎన్ని చేసినా, ఎంత ఎత్తుకెదిగినా తన హృదయానికి ప్రీతిపాత్రమైనది ఉపాధ్యాయ వృత్తేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పారాయన. అందుకు తగ్గట్టే చివరి క్షణాల్లో సుస్థిరాభివృద్ధిపై షిల్లాంగ్ ఐఐఎంలో నిర్వహించిన సదస్సులో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూనే ఆయన కుప్పకూలిపోయారు. కొన్ని క్షణాలకే తనువు చాలించారు.
శాస్త్రవేత్తగా తన చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేయడంతో ప్రారంభించి దేశం మొత్తాన్నే ఉత్సాహోద్వేగాల్లో ముంచెత్తడం వరకూ కలాం చేసిన ప్రయాణం విశిష్టమైనది. గుండెతడి ఉన్నవారికే...కల్లలెరుగని బాల్యాన్ని లోలోపల భద్రపర్చుకో గలిగినవారికే అది సాధ్యం. చట్టంలో ఉరిశిక్ష ఉండరాదన్న అభిప్రాయం ఆయనకు దాన్నుంచే ఏర్పడింది. తమిళనాడు చివరి కొసన ఉన్న రామేశ్వరంలో నిరుపేద జాలరి కుటుంబంలో కలాం కళ్లు తెరిచారు. రామేశ్వరంనుంచి ధనుష్కోడి వరకూ అట్నుంచి ఇటు...ఇటునుంచి అటూ నాన్న యాత్రీకులను చేరేసినప్పుడు వారి నోటి వెంబడి నిత్యం వినే రామాయణ గాథ, అందులోని సన్నివేశాలూ తనపై విశేష ప్రభావాన్ని చూపాయని ఆయన చెప్పేవారు. ఎలాగైనా జీవితంలో పైకి రావాలని తాను పడిన తపనకు...కిరోసిన్‌ను కాస్తంత ఆదాచేసి కలాం రాత్రి చదువుకు సాయపడాలన్న అమ్మ ఆత్రుత తోడైంది. కుటుంబానికి సైదోడుగా వేకువజామున ఇంటింటికీ పత్రికలు పంపిణీ చేస్తూనే చదువుకున్నాడాయన. ఇవన్నీ అంతిమంగా అబ్దుల్ కలాం అనే సృజనశీలిని రూపొందించాయి.
ఇంతకూ నిరుపేద కుటుంబంలో పుట్టి ‘మిసైల్ మ్యాన్’గా ఎదిగిన కలాం 2002లో రాష్ట్రపతి కావడానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఆయనను ఆ అత్యున్నత పదవికి ఎంపిక చేయాలన్న ఆలోచన తమదేనని చెప్పుకుని తిరిగే మరుగుజ్జు నేతలకు మన దేశంలో కొదవలేదు. ముస్లిం కుటుంబంలో పుట్టినా తమిళ ఇతిహాసం తిరువళ్లువర్ విరచిత ‘తిరుక్కురళ్’ను ఔపోసన పట్టడమే కాదు...త్యాగరాజ కృతులను వీణపై కలాం శ్రావ్యంగా పలికించగలరని...ఆయన దేవాలయాలకు వెళ్తారని, శాకాహారని... ఇవన్నీ ‘మంచి ముస్లిం’ లక్షణాలనీ భావించబట్టే ఆనాడు కలాం రాష్ట్రపతి కావడానికి ఆరెస్సెస్ సుముఖత చూపిందా? తాను రక్షణమంత్రిగా ఉన్నప్పుడు శాస్త్ర సాంకేతిక సలహాదారుగా ఉన్న కలాంతో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల ములాయం పట్టుబట్టారా? గుజరాత్‌లో అంతక్రితం సంభవించిన నరమేథం మచ్చను కడిగేసుకోవడానికి బీజేపీ ఒక మంచి ఎత్తుగడగా కలాంను రంగంలోకి తెచ్చిందా అన్న చర్చలు చాన్నాళ్లుగా నడుస్తున్నాయి. ఇక ముందూ అవి ఉంటాయి. కానీ అప్పటికి దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చి దాదాపు పదేళ్లు కావొచ్చింది. దానిపై ఉన్న భ్రమలు అప్పుడప్పుడే క్షీణించడం మొదలయ్యాయి. యువతలో ఒక రకమైన అసహనం, అసంతృప్తి ఏర్పడుతున్నది.
ఆ సమయంలో కలాంను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నిలపడం, ఆయన గెలవడం ఆనాటి పరిస్థితుల్లో ఎన్డీయే సర్కారుకు ఎంతగానో కలిసొచ్చింది. కలాం వంటి క్రియాశీల రాష్ట్రపతి వల్ల మళ్లీ యువతలో ఆశలు రాజుకున్నాయి. పట్టుదలతో కృషిచేస్తే దేన్నయినా సాధించడం సాధ్యమేనన్న నమ్మకం ఏర్పడింది. అలాగని కలాం సాధారణ అర్థంలో వ్యక్తిత్వ వికాస నిపుణుల మాదిరి వ్యవహరించలేదు. గెలిచిన వారిగురించే కాదు... ఓడినవారి చరిత్రలూ చదవమన్నారు. ఆ వైఫల్యాలనుంచి గుణపాఠాలు తీసుకోమన్నారు. పడటం కాదు...పడి లేవకపోవడం వైఫల్యమవుతుం దన్నారు. వ్యామోహాన్ని కాక వ్యక్తిత్వాన్ని...అసహనాన్ని కాక ఆలోచనాత్మక ధోరణిని అలవర్చుకోవాలన్నది ఆయన సందేశాల సారాంశం. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల యువత ఆయన మాటలతో మంత్రముగ్ధమైంది. అంతటా దాని ప్రభావం అలుముకుంది. ఆ తరాన్ని మాత్రమే కాదు...తరువాతి తరాలను సైతం చివరి క్షణం వరకూ ప్రభావితం చేస్తూనే ఉన్న అబ్దుల్ కలాం ధన్యజీవి. ఆయనకు ‘సాక్షి’ అంజలి ఘటిస్తున్నది.