సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ చూపాలి
ఉరవకొండ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపాలని స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
	– హంద్రీనీవా మొదటి దశ కింద ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలి
	– ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్
	ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపాలని స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఉరవకొండలో సీఎం పర్యటనను తాము స్వాగతిస్తున్నామని, ఎలాంటి నిరసనలు తెలియచేయమని స్పష్టం చేశారు. అయితే నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, వాటిని ఆయన పరిష్కరించాలన్నారు. జలహరతి కార్యక్రమం కేవలం పుష్కరాలకే చేస్తారని అయితే సీఎం చంద్రబాబు టీబీ డ్యాం, శ్రీశైలం నీళ్లు వచ్చినా ప్రతిసారి హరతి కార్యక్రమం పెట్టుకోవడం హస్యాస్పదంగా ఉందన్నారు.
	
	ఉరవకొండ హంద్రీనీవా లాంటి గొప్ప పథకానికి ముఖద్వారం లాంటిదని, మహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుండి పనులు ప్రారంభించారని చెప్పారు. వైఎస్సార్ హయాంలో మొదటి దశ కింద జీడిపల్లి వరకు 97 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కేవలం తాము పోరాటాలు చేసిన సమయంలో మాత్రమే ప్రభుత్వం హడావిడి చేస్తుందే తప్ప ఎక్కడా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం గత యేడాది ఆగస్టులోనే ఆయకట్టుకు నీరు ఇస్తామని ప్రకటించారని అయితే ఇప్పటి వరకు నీటి విడుదలను పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు ఉరవకొండ పర్యటనలోనైనా ఆయకట్టుకు నీరు ఇస్తామని ప్రకటించాలన్నారు. 
	
	అలాగే వైఎస్సార్ హయంలో కొనుగోలు చేసిన 88 ఎకరాల భూమికి వెంటనే పట్టాలు ఇచ్చి, బహిరంగ సభలోనే పక్కా ఇళ్లు కుడా ప్రకటించాలన్నారు. దీంతో పాటు ఉరవకొండను మున్సిపాలిటీగా ప్రకటించి, నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తులు చేసేందుకు రూ. 50 కోట్ల  నిధులు ప్రకటించాలన్నారు. ముఖ్యంగా చేనేత కార్మికులకు రేషన్ పై ఇచ్చే సబ్సిడీని సక్రమంగా అందించి, తొలగించిన పాసుపుస్తకాలను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు తిప్పయ్య, కన్వీనర్ నరసింహులు, జయేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలు బసవరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
