అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
కడప : అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బుధవారం కడప నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌బాషాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం పొట్టి శ్రీరాములు సర్కిల్ సమీపంలోని ఎమ్మెల్యే నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు నిర్బంధిస్తున్నట్టు పేర్కొన్నారు.
కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించనున్నారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ, దళిత ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనపై ఎమ్మెల్యే అంజద్ బాషా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సీఎం పర్యటనకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని అన్నారు. అక్రమంగా గృహ నిర్బంధం చేయటం సరికాదని ఆయన మండిపడ్డారు.