సాక్షి, వైఎస్సార్: కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న భవనం నుంచి యూనివర్సిటీని అకస్మాత్తుగా తరలించేందుకు నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, భవన యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. యూనివర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడుతున్నారు.
వివరాల ప్రకారం.. కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ప్రస్తుతం ఉన్న భవనం నుంచి యోగివేమన యూనివర్సిటీలోని గురుకుల బిల్డింగ్స్‌లోకి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వర్సిటీ తరలింపుపై వీసీ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల బిల్డింగులో ఎలాంటి సదుపాయాలు లేవని, యూనివర్సిటీ నిర్వహణకు అది సరిపోదని విద్యార్థుల ఆవేదన చెందుతున్నారు. కూటమి నేతల ప్రమేయంతో అకస్మాత్తు తరలింపు ప్రక్రియ జరుగుతోందని చెబుతున్నారు. ఉన్న ఫలంగా తరలిస్తే.. ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. కూటమి ప్రభుత్వం సదరు భవన యాజమాన్యానికి రూ.4 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. నిబంధనల మేరకు మూడు నెలలు ముందు ఖాళీ చేస్తామని నోటీసులివ్వాల్సి ఉండగా కూటమి సర్కార్ మాత్రం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఇలా చేయడాన్ని భవన యాజమాన్యం తప్పుబడుతూ ఆందోళనకు దిగారు. ఇక, యూనివర్సిటీ వద్దకు టీడీపీ నేతలు భారీ సంఖ్యలో వచ్చారు. భవన యాజమాన్యాన్ని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, కేవలం వైఎస్ జగన్ ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారనే అక్కసుతోనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ అడ్మిషన్లు నిర్వహించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేసింది. కూటమి నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ నేతల స్పందిస్తూ.. యూనివర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.


