మిత్రపక్షమైనందునే బాబును ప్రశ్నించలేకపోతున్నాం | unable question tdp due alliance says somu verraju | Sakshi
Sakshi News home page

మిత్రపక్షమైనందునే బాబును ప్రశ్నించలేకపోతున్నాం

Oct 26 2015 10:32 PM | Updated on Oct 22 2018 8:57 PM

మిత్రపక్షమైనందునే బాబును ప్రశ్నించలేకపోతున్నాం - Sakshi

మిత్రపక్షమైనందునే బాబును ప్రశ్నించలేకపోతున్నాం

మిత్రపక్షంగా ఉన్నందువల్లనే తెలుగుదేశం ప్రభుత్వ తప్పిదాలను, చంద్రబాబును ప్రశ్నించలేకపోతున్నామని...

ఒంగోలు: మిత్రపక్షంగా ఉన్నందువల్లనే తెలుగుదేశం ప్రభుత్వ తప్పిదాలను, చంద్రబాబును ప్రశ్నించలేకపోతున్నామని శాసనమండలి సభ్యుడు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. సోమవారం ఉదయం ఒంగోలుకు వచ్చిన ఆయన స్థానిక ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ అవినీతిని మాత్రం తాము సహించలేమని, అందులో భాగంగానే రాష్ట్రంలో జరిగిన ఇసుక కుంభకోణంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీఎంకు స్వయంగా లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. పెట్రో, ట్రైబల్, సెంట్రల్ యూనివర్సిటీలను రాష్ట్రానికి కేటాయించినా ఇంతవరకు అవసరమైన భూమిని కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.

రాష్ట్రంలో ఐదు యూనివర్సిటీలకు రూ.4 వేల కోట్లు అందించామని, మరో రూ.4 వేల కోట్లు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఒంగోలు, తిరుపతి, చిత్తూరులలో నిమ్జ్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా భూ కేటాయింపులు జరగకపోవడం వల్లే ప్రాజెక్టు ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు. కేంద్రం నిధులు అందిస్తున్నా ఏపీ ప్రభుత్వం ప్రచార వైఫల్యం వల్లే ప్రజలకు తెలియడంలేదని వీర్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నిధులు అందించకపోతే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దును చేపట్టిందని ప్రశ్నించారు. అవాకులు పేలితే చూస్తూ ఊరుకోం.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జరుగుతున్న జాప్యాన్ని టీడీపీ నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది పోయి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, గుంటూరు ఎంపీ గల్లా విడ్డూరమైన ప్రకటనలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అవాకులు, చవాకులు విసిరితే సహిస్తూ ఊరుకోబోమని, అవసరమైతే తమ పదవులను త్యజించి, కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొడతామంటూ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement