వచ్చే విద్యాసంవత్సరం నుంచి కర్నూలులోనే ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ట్రిపుల్ ఐటీ తరగతులు
Dec 13 2016 11:54 PM | Updated on Sep 4 2017 10:38 PM
– జగన్నాథ గట్టులో నిర్మాణపు పనులను పరిశీలించిన కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే విద్యాసంవత్సరం నుంచి కర్నూలులోనే ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని ట్రిపుల్ ఐటీల కంటే కర్నూలు ట్రిపుల్ ఐటీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామన్నారు. మంగళవారం కర్నూలు శివారులోని జగన్నాథగట్టులో ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మరో రెండు నెలల్లో తరగతి గదులు, ల్యాబ్, పరిపాలనా భవనం తదితర పనులు పూర్తి చేస్తామని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో 100 మంది మహిళలకు, 150 మంది బాలురకు తరగతులు ప్రారంభిస్తామన్నారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణపు పనులు జరుగుతున్నాయని వాటిల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి 2018 నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు. కాంపౌడు వాల్ చుట్టూ మొక్కలు నాటి పెంచి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. నిర్మాణపు పనులను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. జగన్నాథగట్టులో పెద్దపెద్ద బండరాళ్లు ఉన్నాయని వాటిపై బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలంటే ఇబ్బందిగా ఉందని, 50 ఎకరాల భూమి కెటాయించాలని ఇంజినీరింగ్ అధికారి కోరగా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట కర్నూలు తహసీల్దారు రమేష్, ట్రిపుల్ ఐటీ సీసీడబ్ల్యూ ఇంజినీర్లు ఉన్నారు.
Advertisement
Advertisement