భూములపై ఉన్నతాధికారుల ఆరా
రామదాసుకండ్రిగ (వెంకటాచలం) : మండలంలోని రామదాసుకండ్రిగ పరిధిలోని సీజేఎఫ్‌ఎస్ భూములపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 194, 2195, 2196, 2200, 2201లలోని 122 ఎకరాల భూములను 1970లో పేదలకు పంపిణీ చేశారు.
-
నివేదిక పంపాలని తహసీల్దార్‌కు ఆదేశాలు
రామదాసుకండ్రిగ (వెంకటాచలం) : మండలంలోని రామదాసుకండ్రిగ పరిధిలోని సీజేఎఫ్‌ఎస్ భూములపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 194, 2195, 2196, 2200, 2201లలోని 122 ఎకరాల భూములను 1970లో పేదలకు పంపిణీ చేశారు. ఈ భూముల్లోని 5.26 ఎకరాలను 2005లో కృష్ణపట్నం పోర్టు రోడ్డుకు కేటాయించారు. అలాగే కొంత భూమిని నివాసాలకు, గ్రామ రోడ్లకు కేటాయించారు. మిగిలిన భూములను ఏపీఐఐసీ ద్వారా ట్రక్‌పార్క్‌కు కేటాయించనున్న విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, దళారులు, వ్యాపారులు కారుచౌకగా కొనుగోలు చేసి రూ.10కోట్లకు పైగా పరిహారాన్ని దోచుకునేందుకు స్కెచ్ వేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఆందోళనలకు దిగడం, పత్రికల్లో కథనాలు రావడంతో జిల్లా అధికారులు రామదాసుకండ్రిక భూములపై నివేదిక పంపాలని వెంకటాచలం తహసీల్దార్‌ను ఆదేశించినట్లు సమాచారం. సీజేఎఫ్‌ఎస్ భూములు మొత్తం ఎన్ని ఎకరాలు..ఎంత మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు..లబ్ధిదారుల జాబితా, అడంగళ్ల వివరాలను పంపాలని ఆదేశించినట్లు తెలిసింది. అలాగే 2005లో కృష్ణపట్నం పోర్టు రోడ్డుకు కేటాయించిన భూముల వివరాలు..పరిహారం పొందిన లబ్ధిదారుల వివరాలను పంపాలని సూచించినట్లు సమాచారం. అలాగే మిగిలిన భూముల వివరాలపై నివేదిక పంపాలని ఆదేశించడంతో తహసీల్దార్ కార్యాలయంలో గురువారం హడావుడి మొదలైంది. ఉన్నతాధికారులకు నివేదిక పంపేందుకు రెవెన్యూ అధికారులు పాత రికార్డులను తిరిగేసి పనిలో మునిగిపోయారు.