చుక్‌..చుక్‌ బండి.. వచ్చిందండి! | rail is running | Sakshi
Sakshi News home page

చుక్‌..చుక్‌ బండి.. వచ్చిందండి!

Aug 24 2016 11:51 AM | Updated on Apr 7 2019 3:23 PM

చుక్‌..చుక్‌ బండి.. వచ్చిందండి! - Sakshi

చుక్‌..చుక్‌ బండి.. వచ్చిందండి!

కూ.. చుక్‌..చుక్‌ మంటూ నంద్యాల – కడప ప్యాసింజర్‌ రైలు పరుగులు పరుగులెత్తింది.

– నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ ప్రారంభం
– నంద్యాల – కడప ప్యాసింజర్‌ రైలు పరుగులు
– నాలుగు దశాబ్దాల కల సాకారం
– రైలుకు పెండేకంటి పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి
 
నంద్యాల:  నాలుగు దశాబ్దాల కల సాకారమైంది. కలల బండి పట్టాలెక్కింది. కూ.. చుక్‌..చుక్‌ మంటూ నంద్యాల – కడప ప్యాసింజర్‌ రైలు పరుగులు పరుగులెత్తింది. ఎంతో కాలంగా ఎదురు చూసిన ప్రజలు ఆనందంగా స్వాగతం పలికారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభాకర్‌ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను మంగళవారం విజయవాడ నుంచి వీడియో రిమోట్‌ లింక్‌ద్వారా ప్రారంభించారు.
 
వెంటనే ఎంపీ ఎస్పీవైరెడ్డి, ఎమ్మెల్యేలు, రైల్వే అధికారులు జెండా ఊపడంతో డెమో రైలు కడపకు పరుగులు తీసింది. ఈ సందర్భంగా నంద్యాల రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నంద్యాల నుంచి తిరుపతికి రైలును ఏర్పాటు చేయాలని ఎంపీ ఎస్పీవైరెడ్డి కోరారు. తిరుపతికి వెల్లాలంటే రూ.350కి పైగా బస్‌ చార్జీలను చెల్లించాలని, కాని తక్కువ ధరకు భక్తులు తిరుపతికి వెళ్లి రావచ్చని చెప్పారు. ఈ రైల్వే లైన్‌కు శ్రీకారం చుట్టిన పెండేకంటి వెంకటసుబ్బయ్యకు ఆయన నివాళులు అర్పించారు. నంద్యాల–కడప రైలు పెండేకంటి ప్యాసింజర్‌ రైలుగా నామకరణం చేయాలని ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. 
 
–  నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మాట్లాడుతూ రైల్వే లైన్‌ పూర్తి కావడంతో రవాణా సౌకర్యాలు మెరుగు పడి, అభివద్ధి జరుగుతుందన్నారు. రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ఉన్న స్థలాల్లో నివాసం ఉన్న పేదలకు ఏడాదిలోగా ప్రత్యామ్నాయం చూపిస్తామని రైల్వే అధికారులు వారిని తొలగించవద్దని కోరారు. 
 
– ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మధ్య రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
 
– పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మాట్లాడుతూ పాణ్యంలో రైల్వే రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. పాణ్యం రైల్వే బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతుండటంతో చుట్టుపక్కల వ్యాపారులు షాపులను మూసుకొని ఉపయోగించకున్నా షాప్‌రూంలకు అద్దెలు చెల్లిస్తూ నష్టపోతున్నారని చెప్పారు. జిందాల్‌ ఫ్యాక్టరీ రైల్వే స్టేషన్‌లో లోడింగ్, అన్‌లోడింగ్‌ చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, దూరంగా తరలించాలని కోరారు.
 
 – బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సంజామల రైల్వే స్టేషన్‌కు పెండేకంటి పేరు పెట్టాలని కోరారు. 
 
– నూనెపల్లె దళిత వాడ వద్ద ఉన్న రైల్వే స్థలాల్లో నివాసం ఉన్న పేదలపై దయచూపాలని కౌన్సిలర్‌ అనిల్‌ అమతరాజ్‌ రైల్వే అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
 
– కార్యక్రమంలో రైల్వే డీఆర్‌ఎం విజయ్‌శర్మ, పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement