విజ్ఞాన సర్వస్వం.. మహాభారతం


  • నన్నయ భట్టారక జయంతి సభలో వక్తలు

  • రాజమహేంద్రవరం కల్చరల్‌ :

    మహాభారతం విజ్ఞాన సరస్వస్వమని ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌వీ రాఘవేంద్రరావు అన్నారు. సాహితీ శరత్‌ కౌముది ఉత్సవాల్లో భాగంగా మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి స్థాపించిన శరన్మండలి ఆధ్వర్యాన.. ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన నన్నయ భట్టారక జయంతి సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన నన్నయ కవిత్వంపై ప్రసంగించారు. ‘‘కాంతాసమ్మితంగా భారత రచన సాగింది, భార్య.. భర్తకు నచ్చజెప్పినట్టుగా అటు వ్యాసుడు, ఇటు కవిత్రయం మనకు భారతాన్ని అందించారు. భారతం నీతిశాస్త్రం, మహాకావ్యం, ఇతిహాసం, బహుపురాణ సముచ్ఛయం, ధర్మశాస్త్రం. ఎవరు ఏ దృష్టితో చూస్తే వారికి ఆ దృష్టిలోనే గోచరిస్తుంది. మహాభారతంలో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది. ఇందులేనిది మరెక్కడా ఉండదు’’ అని అన్నారు. దీని ఆంధ్రీకరణలో మానవజాతికి నన్నయ అద్భుతమైన నీతులు అందించాడని చెప్పారు. ‘‘మనం చేసే పనులను ఎవరూ చూడట్లేదని అనుకోవద్దు. మనం చేసే ప్రతి పనినీ సూర్యచంద్రులు, పంచభూతాలు, యముడు, ఉభయ సంధ్యలు, మనస్సు, ధర్మదేవతలు గమనిస్తూనే ఉంటారని శకుంతల పాత్ర ద్వారా నన్నయ తెలియచేసాడు’’ అన్నారు. జన్మనిచ్చినవాడు, అన్నం పెట్టినవాడు, భయాన్ని తొలగించేవాడు స్త్రీకి గురువులైతే, వీరితోపాటు విద్య నేర్పినవాడు, ఉపనయనం చేసినవాడు పురుషుడికి గురువులని వివరించారు. ‘జగద్ధితంబుగ¯ŒS’ భారతాంధ్రీకరణ చేసినట్టు నన్నయ చెప్పుకున్నాడని, దీని అర్థం జగత్తు హితం కోసమే ఈ రచన చేసినట్టని అన్నారు. ‘శారద రాత్రులు..’ నన్నయ చివరి పద్యంగా భావించాలని రాఘవేంద్రరావు చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్‌ నరసింహారావు మాట్లాడుతూ, భారతాంధ్రీకరణను రాజరాజుకు నన్నయ అంకితమిచ్చినట్టు ఆంధ్రభారతంలో ఎక్కడా లేదన్నారు. చిలకమర్తి ఫౌండేష¯ŒS వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాథ్‌ మాట్లాడుతూ, రుషులు ద్రష్టలు, స్రష్టలు అని చెప్పారు. భవిష్యత్తును చూడగలిగినవాడు ద్రష్ట అయితే, కలకాలం నిలిచిపోయే పాత్రలను సృష్టించినవాడు స్రష్ట అని వివరించారు. తొలుత కళాశాల ప్రాంగణంలోని ప్రకాశం, నన్నయ భట్టారకుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి తనయులు మధునామూర్తి, సుబ్రహ్మణ్యం,  మేనల్లుడు కామరాజు, సోదరుని కుమారుడు సత్యనారాయణమూర్తి, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కళాశాల కరస్పాండెంట్‌ అసదుల్లా అహమ్మద్, డాక్టర్‌ బీవీఎస్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top